ఫుడ్ డెలివరీ బాయ్స్ 'ఉల్లంఘన'లకు చెక్

Mon,January 21, 2019 07:09 AM

సైబరాబాద్:రోడ్డుపై వాహనదారులను ఇబ్బంది పెట్టి అనవసర గందరగోళ హడావుడి సృష్టిస్తున్న ఉల్లంఘనులపై సైబరాబాద్ పోలీసులు ప్రత్యేక నజర్ పెట్టారు. ఈ ప్రయత్నంలో పోలీసులు చేసిన అధ్యయనం వారికి సరికొత్త ఉల్లంఘనుల చిట్టాను అందించింది. దీంతో వారు చేస్తున్న అలజడికి కళ్లెం వేయాల్సిన పరిస్థితులు ఉండడంతో సైబరాబాద్ సీపీ సజ్జనార్ సారథ్యంలో ఓ ప్రణాళికను రూపొందించారు.


ఈ నేపథ్యంలోనే శనివారం పేరొందిన ఫుడ్ డెలివరీ సంస్థలు జొమాటో, స్విగ్గీ, ఉబర్ ఈట్స్ నిర్వాహకులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా వారి సంస్థలకు అనుసంధానమై డోర్ డెలివరీ చేస్తున్న ఫుడ్ డెలివరీ బాయ్స్ ట్రాఫిక్ ఉల్లంఘనల గురించి మాట్లాడారు. ఈ డెలివరీ బాయ్స్ చేస్తున్న ఉల్లంఘనలు రోడ్డుపై ఇతర వాహనదారులకు తీవ్రమైన ప్రమాదాలకు గురి చేస్తున్నారని సీపీ సజ్జనార్, ట్రాఫిక్ డీసీపీ ఎస్‌ఎం.విజయ్‌కుమార్ వారికి వివరించారు.

అంతే కాకుండా ట్రాఫిక్ ఉల్లంఘనల్లో అత్యంత ప్రమాదకరమైన డ్రంక్ అండ్ డ్రైవింగ్‌లో కూడా ఈ బాయ్స్ చాలా మంది పట్టుబడుతున్న రికార్డులను వారికి చూపించారు. ఈ డెలివరీ బాయ్స్ సెల్‌ఫోన్ డ్రైవింగ్, ర్యాష్ డ్రైవింగ్, రాంగ్ రూట్ డ్రైవింగ్, విపరీతమైన హారన్ శబ్దాలు, సిగ్నల్ జంపింగ్, సరైన నంబరు ప్లేట్ లేకుండా వాహనాలను నడిపిస్తూ దొరికిపోతున్నారని అధికారులు నిర్వాహకులకు వివరించారు. ఉల్లంఘనలే కాకుండా వీరి చర్యలు అలజడి, గందరగోళం, ఆందోళనను సృష్టిస్తుందని తెలిపారు.

ఈ ఉల్లంఘనల నియంత్రణకు ఫుడ్ డెలివరీ సంస్థలు కూడా పోలీసులకు సహకరించి డెలివరీ బాయ్స్ అందరూ ట్రాఫిక్ రూల్స్ పాటించేలా చర్యలు తీసుకోవాలని సీపీ సూచించారు. నిర్వాహకుల సలహాలు, సూచనలను కూడా పోలీసులు తీసుకున్నారు. ఇక తరచూ ఫుడ్ డెలివరీ నిర్వాహకులతో సమావేశమై వీరి ఉల్లంఘనలకు బ్రేక్ వేసేందుకు సైబరాబాద్ పోలీసులు శ్రీకారం చుట్టారు.

సొసైటీ ఫర్ సైబర్ సెక్యూరిటీ కౌన్సిల్ ట్రాఫిక్ ఫోరం విభాగం సహకారంతో జరిగిన ఈ సమావేశంలో సైబరాబాద్ అదనపు ట్రాఫిక్ డీసీపీ ప్రవీణ్‌కుమార్, అమర్‌కాంత్‌రెడ్డి, హైదరాబాద్ ట్రాఫిక్ అదనపు డీసీపీ భాస్కర్, అదనపు డీసీపీ ఎస్బీ గౌసుమొయినుద్దీన్, స్పెషల్ బ్రాంచి ఏసీపీ రవీందర్‌రెడ్డి, ట్రాఫిక్ ఏసీపీ చంద్రశేఖర్, ఎన్ సంతోష్ పాల్గొన్నారు.

3939
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles