సహారాస్టేట్స్ కాలనీలో ఎటుచూసినా పచ్చదనమే..

Mon,February 11, 2019 11:39 AM

Greenery reflects in sahara states colony in hyderabad

హైదరాబాద్: పచ్చని పర్యావరణం.. ఎటూ చూసినా చెట్లు... ఆకుపచ్చని హరితహారం పరచినట్లుగా కనిపిస్తుంది. మినీ ఇండియాను తలపించే విధంగా దేశంలోని అన్ని ప్రాంతాల నుంచి వచ్చి ఇక్కడ స్థిరపడిన ప్రజలతో కలకలలాడుతుంది కాలనీ. ఎలాంటి తగాదాలకు తావు లేకుండా అన్నదమ్ముల్లా కలసి ఉంటూ కాలనీని మరింతగా అభివృద్ధి చేసుకుంటున్నారు. సుమారు 18 సంవత్సరాల క్రితం మన్సూరాబాద్ డివిజన్ పరిధిలోని సుష్మ చౌరస్తా నుంచి మన్సూరాబాద్‌కు వెళ్లే మార్గంలో 47 ఎకరాలలో ఏర్పడిన సహారాస్టేట్స్‌కాలనీలో 1450 పైచిలుకు కుటుంబాలు నివసిస్తున్నాయి. సుమారు 13 సంవత్సరాల పాటు కాలనీ మెయింటెనెన్స్‌ను సహారా గ్రూప్ చూసుకోగా గత ఐదు సంవత్సరాలుగా కాలనీవాసులే ఓ కమిటీని ఎన్నుకుని కాలనీ బాధ్యతలను నిర్వర్తిస్తూ ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా చూసుకుంటున్నారు.

ఏ వీధిని చూసినా పచ్చదనమే


సుమారు ఏడు వేల మంది నివసించే సహారాస్టేట్స్‌కాలనీలో ఏ వీధిలో చూసినా పచ్చని చెట్లు కనపడుతుంటాయి. అడుగడుగునా విస్తరించి ఉన్న చెట్లు అందిస్తున్న స్వచ్ఛమైన వాతావరణంతో ఇక్కడి ప్రజలు ఎంతో ఆరోగ్యంగా జీవిస్తున్నారు. కాలనీలోకి వచ్చే వారు ఏదో హరితవనంలోకి ప్రవేశించినట్లుగా పులకించిపోతారు. ఆహ్లాదకరమైన వాతావరణానికి చిరునామా సహారాస్టేట్స్‌కాలనీ అని చెప్పుకోవచ్చు. ఏదైనా కాలనీలో ఒక ఇల్లు, అపార్ట్‌మెంట్ కట్టిన అనంతరం కొన్ని రోజులకు వాటి ధరలు తగ్గు ముఖం పడతాయి... కానీ సహారాస్టేట్స్‌కాలనీ ఏర్పడి 18 సంవత్సరాలు అయినప్పటికీ ఇక్కడి ఇండ్ల ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయంటే కారణం ఇక్కడి వాతావరణం.. కాలనీలో అందుతున్న సౌకర్యాలు అని చెప్పుకోవచ్చు.

సందడిగా రెండు పార్కులు


సహారాస్టేట్స్‌కాలనీలో రెండు పార్కులు ఇక్కడి ప్రజలకు ఆహ్లాదాన్ని పంచుతున్నాయి. ఉదయం వేళలో వాకర్స్‌తో పెద్ద పార్కు సందడిగా మారుతుంది. సాయంత్రం వేళ పెద్ద పార్కు, చిన్న పార్కుల్లోకి చేరి కాలనీవాసులు సేద తీరుతుంటారు. ఇక్కడ నివసించే వారికి కాలనీనే ప్రపంచం.. ఏది కావాలన్నా కాలనీలోనే సమకూర్చుకోవచ్చు. శుభకార్యాలు నిర్వహించుకునేందుకు క్లబ్, కమ్యూనిటీ హాల్‌తో పాటు స్విమ్మింగ్ పూల్, షాపింగ్ కాంప్లెక్స్ లాంటి సదుపాయాలు ఉన్నాయి.

సీసీకెమెరాల నీడలో కాలనీ


సహారాస్టేట్స్‌కాలనీలో భద్రతకు పెద్దపీట వేశారు. కాలనీలోని ప్రతి వీధిలో సీసీకెమెరాలను ఏర్పాటు చేశారు. సుమారు 32 సీసీకెమెరాల నీడలో సహారాస్టేట్స్‌కాలనీ ఉంటుంది. అంతే కాకుండా 14 మంది సెక్యూరిటీ గార్డులు కాపలాగా ఉంటారు. కాలనీలోకి ప్రవేశించే రెండు గేట్ల వద్ద గట్టి బందోబస్తు ఉంటుంది. బయట నుంచి లోపలికి.. లోపలి నుంచి బయటకు వెళ్లే వాహనాలను క్షుణ్ణంగా పరిశీలిస్తారు. ఎనిమిది సంవత్సరాల లోపు పిల్లలను కాలనీలో నుంచి బయటకు వెళ్లనివ్వరు. చిన్న పిల్లలు బయటకు వెళ్లాలంటే తల్లిదండ్రులతోనే వెళ్లాలి. అందుకే ఇక్కడ నివసించే వారిలో ఎలాంటి భయాందోళనలు.. దొంగల బెడద ఉండదు.

1797
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles