స్వచ్ఛ సర్వేక్షణ్‌పై జీహెచ్‌ఎంసీ సమీక్షా సమావేశం

Wed,September 13, 2017 05:13 PM

ghmc commissioner do review on swachh survekshan

హైదరాబాద్: స్వ‌చ్ఛ సర్వేక్ష‌ణ్ -2018 స్వ‌చ్ఛ‌త పోటీల్లో గ్రేట‌ర్ హైద‌రాబాద్ ను అగ్ర‌స్థానంలో నిల‌ప‌డానికి జీహెచ్ఎంసీ ముంద‌స్తు ప్ర‌ణాళిక‌లు సిద్దంచేసింది. స్వచ్ఛ సర్వేక్షణ్‌ పోటీల్లో దేశ‌వ్యాప్తంగా 4,041 మున్సిపాలిటీలు, కార్పొరేష‌న్లు పాల్గొననున్నాయి. స్వచ్ఛ సర్వేక్షణ్‌పై జీహెచ్ఎంసీ విభాగ అధికారులు, జోన‌ల్‌, డిప్యూటీ క‌మిష‌న‌ర్లు, మెడిక‌ల్ ఆఫీస‌ర్ల‌తో జీహెచ్ఎంసీ క‌మిష‌న‌ర్ డా.బి.జ‌నార్థ‌న్‌రెడ్డి నేడు విస్తృత‌స్థాయి స‌మావేశాన్ని నిర్వ‌హించారు. ఈ సందర్భంగా జీహెచ్ఎంసీ క‌మిష‌న‌ర్ మాట్లాడుతూ.. స్వ‌చ్ఛ స‌ర్వేక్ష‌ణ్ -2018కి గాను మొత్తం వివిధ విభాగాల్లో 4,000 మార్కుల‌ను కేటాయిస్తూ స్వ‌చ్ఛ భార‌త్ మిష‌న్ ప్ర‌క‌టించిందని తెలిపారు. కాగా ఈ స్వ‌చ్ఛ స‌ర్వేక్ష‌ణ్‌కు చేప‌ట్టిన ప్రామాణిక మార్గ‌ద‌ర్శ‌కాల్లో జీహెచ్ఎంసీ చేప‌ట్టిన వినూత్న కార్య‌క్ర‌మాలు అత్య‌ధికంగా ఉన్నాయ‌న్నారు. ఈ స‌ర్వేలో ప్ర‌జాభిప్రాయ సేక‌ర‌ణ‌కు అత్యంత ప్రాధాన్య‌త ఇచ్చిన దృష్ట్యా స్వ‌చ్ఛ భార‌త్ మిష‌న్ ప్ర‌వేశ‌పెట్టిన స్వ‌చ్ఛ‌త మొబైల్ యాప్‌ను దాదాపు 2 ల‌క్ష‌ల మందిచే డౌన్‌లోడ్ చేయించాల‌ని క‌మిష‌న‌ర్ చెప్పారు. ఈ సారి స‌ర్వేలో కేటాయించిన 4 వేల మార్కుల్లో ప్ర‌ధానంగా స్వ‌చ్ఛ కార్య‌క్ర‌మాల‌పై న‌గ‌ర‌వాసుల ఫీడ్‌బ్యాక్‌కు అత్య‌ధికంగా 40 శాతం (1600)మార్కులు, న‌గ‌రంలో చేప‌ట్టిన ప‌లు స్వ‌చ్ఛ కార్య‌క్ర‌మాలు, వాటి ప్ర‌భావంపై అంద‌జేసే నివేదిక‌ల‌కు 35శాతం(1400), స్వ‌చ్ఛ భార‌త్ మిష‌న్ స‌ర్వే బృందం నేరుగా చేప‌ట్టే క్షేత్ర స్థాయి త‌నిఖీల్లో అబ్జ‌ర్వేష‌న్ల‌కు 25శాతం(1000) మార్కులు ఉన్నాయ‌ని వివ‌రించారు. కాగా స్వ‌చ్ఛ స‌ర్వేక్ష‌ణ్‌కు స‌మ‌ర్పించిన డాక్యుమెంట్ల‌కు, క్షేత్ర‌స్థాయి ప‌రిశీల‌న‌లో వ్యత్యాసాలు ఉంటే నెగిటీవ్ మార్కులు సైతం ఇస్తారన్నారు.

2017లో ఈ సారి స్వ‌చ్ఛ స‌ర్వేక్ష‌ణ్‌లో గ్రేట‌ర్ హైద‌రాబాద్ మున్సిప‌ల్ కార్పోరేష‌న్‌లో అమ‌లు చేసిన ప‌లు వినూత్న కార్య‌క్ర‌మాలలో ప్ర‌ధానంగా ఓపెన్ గార్బెజ్ పాయింట్ల ఎత్తివేత‌, రెండు చెత్తబుట్టల పంపిణీ విధానం, స్వ‌చ్ఛ ఆటోల ద్వారా చెత్తను వేర్వేరుగా సేక‌ర‌ణ‌, దోమ‌ల నివార‌ణ‌పై చైత‌న్య కార్య‌క్ర‌మాలు, స్వ‌చ్ఛ కార్య‌క్ర‌మాల‌పై ప్ర‌జ‌ల భాగ‌స్వామ్యం క‌ల్పించే ప్ర‌చార అవ‌గాహ‌న కార్య‌క్ర‌మాల‌కు ప్ర‌త్యేకంగా మార్కుల‌ను కేటాయిస్తూ స్వ‌చ్ఛ భార‌త్ మిష‌న్ ప్ర‌క‌టించిందని క‌మిష‌న‌ర్ పేర్కొన్నారు. న‌గ‌రంలోని అన్ని మార్కెట్లలో కంపోస్టింగ్ యూనిట్ల ఏర్పాటు చేయ‌డానికి ప్రాధాన్య‌త ఇవ్వాల‌ని, న‌గ‌రంలోని అన్ని పెట్రోల్ బంక్‌ల‌లో ఉన్న టాయిలెట్ల‌ను ప్ర‌జ‌లు ఉప‌యోగించుకునేలా సంబంధిత బంక్‌ల యాజ‌మ‌న్యాల‌తో లిఖిత‌పూర్వ‌కంగా లేఖ‌ల‌ను స్వీక‌రించాల‌ని తెలిపారు. పాఠ‌శాల స్థాయి నుండే విద్యార్థుల్లో స్వ‌చ్ఛ కార్య‌క్ర‌మాల‌పై చైత‌న్యం క‌లిగించేలా ప్ర‌తి పాఠ‌శాల‌లో స్వ‌చ్ఛత క‌మిటీల‌ను ఏర్పాటు చేసేలా చ‌ర్య‌లు చేప‌ట్టాల‌న్నారు. న‌గ‌రంలో 50 ప్రాంతాల్లో డ్రై రిసోర్స్ కేంద్రాల‌ను ఏర్పాటు చేసే ల‌క్ష్యాన్ని పూర్తిచేయాలని అధికారులను ఆదేశించారు.

683
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles