ఈ నెలాఖరుకు ఎన్నికల షెడ్యూల్ వచ్చే అవకాశం..!

Tue,February 12, 2019 06:16 PM

హైద‌రాబాద్‌: పార్ల‌మెంట్ ఎన్నిక‌ల‌కు హైద‌రాబాద్ జిల్లాలో ఏర్పాట్లు చేస్తున్న‌ట్లు హైద‌రాబాద్ జిల్లా ఎన్నిక‌ల అధికారి, జీహెచ్ఎంసీ క‌మిష‌న‌ర్ దాన‌కిషోర్ తెలిపారు. ఎన్నిక‌ల ఏర్పాట్ల‌పై న‌గ‌ర పోలీస్ కమిష‌న‌ర్ అంజ‌నీకుమార్‌, పోలీసు ఉన్న‌తాధికారులు, రిట‌ర్నింగ్ అధికారులు, స‌హాయ రిట‌ర్నింగ్ అధికారులతో జీహెచ్ఎంసీ కార్యాల‌యంలో స‌మావేశాన్ని నిర్వ‌హించారు. ఫిబ్ర‌వ‌రి చివ‌రి వారం లేదా మార్చి మొద‌టి వారంలో పార్ల‌మెంట్ ఎన్నిక‌ల షెడ్యూల్‌ ప్ర‌క‌టించే అవ‌కాశం ఉంద‌ని తెలిపారు. ఇప్ప‌టి నుంచి ఎన్నిక‌ల నిర్వహ‌ణ‌కు అవ‌స‌ర‌మైన ఏర్పాట్ల‌ను చేప‌ట్టాల‌ని అధికారుల‌కు సూచించారు.


సికింద్రాబాద్ లోక్‌స‌భ స్థానానికి హైద‌రాబాద్ జిల్లా జాయింట్ క‌లెక్ట‌ర్‌, హైద‌రాబాద్ పార్ల‌మెంట్ స్థానానికి హైద‌రాబాద్ జిల్లా క‌లెక్ట‌ర్ రిట‌ర్నింగ్ అధికారులుగా వ్య‌వ‌హ‌రిస్తార‌ని తెలిపారు. ప్ర‌తి అసెంబ్లీ సెగ్మెంట్‌కు డిప్యూటి క‌మిష‌న‌ర్లు, జోన‌ల్ క‌మిష‌న‌ర్లు, ఆర్డిఓలు స‌హాయ రిట‌ర్నింగ్ అధికారులుగా వ్యవహరిస్తారన్నారు. సికింద్రాబాద్ పార్ల‌మెంట్ నియోజ‌క‌వ‌ర్గంలో ముషిరాబాద్‌, అంబ‌ర్‌పేట్‌, ఖైర‌తాబాద్‌, జూబ్లీహిల్స్‌, స‌న‌త్‌న‌గ‌ర్‌, నాంప‌ల్లి, సికింద్రాబాద్ శాస‌న స‌భ నియోజ‌క‌వ‌ర్గాలు ఉన్నాయి.

హైద‌రాబాద్ పార్ల‌మెంట్ నియోజ‌క‌వ‌ర్గ ప‌రిధిలో మ‌ల‌క్‌ పేట్‌, కార్వాన్‌, గోషామ‌హ‌ల్‌, చార్మినార్‌, చాంద్రాయ‌ణగుట్ట‌, యాక‌త్‌పుర, బ‌హ‌దూర్‌పుర అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గాలు ఉన్నాయి. సికింద్రాబాద్ కంటోన్మెంట్ అసెంబ్లీ సెగ్మెంట్ మాత్రం మల్కాజ్‌ గిరి పార్ల‌మెంట్ ప‌రిధిలోకి వ‌స్తుంద‌ని దాన‌కిషోర్ వివ‌రించారు. 2019 ఫిబ్ర‌వ‌రి 10వ తేదీ నాటికి సికింద్రాబాద్ పార్ల‌మెంట్ స్థానం ప‌రిధిలో 19,14,954 మంది ఓట‌ర్లు ఉండగా 706 బిల్డింగ్ లొకేష‌న్ల‌లో 1,809 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయ‌న్నారు.

హైద‌రాబాద్ పార్ల‌మెంట్ ప‌రిధిలో 19,32,926 మంది ఓట‌ర్లు ఉండ‌గా 770 పోలింగ్ లొకేష‌న్ల‌లో 1,935 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయ‌న్నారు. హైద‌రాబాద్ జిల్లాలోని 15 అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గాల్లో 1,404 క్రిటిక‌ల్ పోలింగ్ స్టేష‌న్లు, 552 క్రిటిక‌ల్ పోలింగ్ స్టేష‌న్ లొకేష‌న్లు ఉన్నాయ‌ని తెలిపారు. ఈ నెల 22న ఓట‌ర్ల తుది జాబితా ప్ర‌క‌టిస్తున్నందున ఓట‌ర్ల సంఖ్య మ‌రింత పెరిగే అవ‌కాశం ఉంద‌ని చెప్పారు. శాస‌న స‌భ ఎన్నిక‌లను స‌మ‌ర్థ‌వంతంగా నిర్వ‌హించామని దానకిషోర్ వెల్ల‌డించారు. అయితే అక్కడక్కడ ఎదురైన చిన్న చిన్న స‌మ‌స్య‌లు పున‌రావృతం కాకుండా చ‌ర్య‌లు చేప‌ట్టాల‌ని సూచించారు. 2019 మే 31వ తేదీకి ముందు హైద‌రాబాద్ న‌గ‌రంలో వ‌రుస‌గా మూడేళ్లు ప‌ని చేసినా, సొంత‌ జిల్లా అయిన అధికారుల‌ను పార్ల‌మెంట్ ఎన్నిక‌ల విధుల‌లో నియ‌మించ‌డంలేద‌ని స్ప‌ష్టం చేశారు.

హైద‌రాబాద్ జిల్లా ప‌రిధిలో ఉన్న అసెంబ్లీ సెగ్మెంట్‌ల‌కు ఏసీపీ స్థాయి అధికారుల‌ను పోలీసు నోడ‌ల్ అధికారులుగా నియమిస్తున్నామ‌ని హైదరాబాద్‌ పోలీస్ కమిష‌న‌ర్ అంజనీకుమార్ తెలిపారు. ఇప్ప‌టికే న‌గ‌రంలో ఉన్న వెప‌న్‌ల‌ను డిపాజిట్ చేయడం జ‌రిగింద‌ని, ఎన్నిక‌ల సంబంధిత కేసుల‌లో ఉన్న వ్య‌క్తుల‌ను బైండోవ‌ర్ చేస్తామన్నారు.

7163
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles