ప్రతిక్షణం అప్రమత్తం..శభాష్ పోలీస్

Sat,September 14, 2019 08:10 AM

Ganesh immersion passes off peacefully in Hyderabad

48 గంటల పాటు నిరావధికంగా విధి నిర్వహణ.. ఎక్కడ కూడా తొందరపాటు.. ఖంగారు లేకుండా.. ప్రజలతో మమేకమవుతూ ట్రై పోలీస్ కమిషనరేట్లలో సుమారు 31,600 మంది పోలీసు సిబ్బంది బందోబస్తులో పాల్గొన్నారు. వినాయక నిమజ్జనోత్సవాన్ని విఘ్నాలు లేకుండా ప్రశాంత వాతావారణంలో పూర్తి చేయడంలో కీలక పాత్ర వహించారు. హైదరాబాద్‌లో వినాయక నవరాత్రులు, నిమజ్జనోత్సవం అనేది పోలీసులకు చాలా ప్రతిష్టాత్మకం. భిన్న సంస్కృతులకు నిలయంగా మారిన హైదరాబాద్ విశ్వనగరంగా మారుతున్నది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత వరుసగా ఆరవ సంవత్సరం ఇన్సిండెంట్ ఫ్రీగా వినాయక నవరాత్రి వేడుకలను పూర్తి చేసిన ట్రై కమిషనరేట్ పోలీసులు శభాష్ అనిపించుకున్నారు.

వినాయక నవరాత్రులు, నిమజ్జనం ప్రశాంతంగా పూర్తి చేయడంలో పోలీసుల శ్రమ ఎంతో ఉంది. నగరంలో భోనాల పండుగ పూర్తైన వెంటనే బక్రీద్, గణేశ్ నవరాత్రులు, మొహర్రం వరుసగా వచ్చాయి. గణేశ్ నవరాత్రులు, మొహర్రం ఒకే సమయంలో రావడంతో ఆయా వర్గాల ప్రజల సహకారంతో పండుగలను ప్రశాంతంగా నిర్వహించారు. గణేశ్ నవరాత్రులు ఈ నెల 2వ తేదీన ప్రారంభం కాగా అంతకు ముందు వారం రోజులుగా గణేశ్ మండపాలకు అనుమతి ప్రక్రియకు పోలీసులు కసరత్తు చేశారు . అప్పటి నుంచి పోలీసులు బిజీగా మారారు. 2వ తేదీ నుంచి క్షేత్ర స్థాయిలో పనిచేసే హోంగార్డు, కానిస్టేబుల్ నుంచి పోలీస్ కమిషనర్ల వరకు నిరంతర పర్యవేక్షణ చేస్తూ టెక్నాలజీ సహాయంతో ఎప్పటికప్పుడు సమాచారాన్ని సేకరించారు.

క్షేత్ర స్థాయిలో పర్యటించే బ్లూకోల్ట్స్, పెట్రోలింగ్ వాహనాలను ట్రాకింగ్ చేయడంతో పాటు మండపాలకు జియో ట్యాగింగ్, క్యూఆర్ కోడ్‌లు ఏర్పాటు చేసి ఉన్నతాధికారులు ఆయా మండపాల పర్యవేక్షణలో తమ వంతు పాత్ర పోశించారు. వినాయక నిమజ్జన కార్యక్రమాలు 3వ రోజు నుంచే ప్రారంభం కావడంతో హైదరాబాద్, రాచకొండ, సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ల పరిధిలోని ఆయా చెరువులు, కుంటలపై పోలీసులు ప్రత్యేక దృష్టి పెట్టి నిమజ్జనానికి కావాల్సిన ఏర్పాట్లు చేశారు. ఇందులో జీహెచ్‌ఎంసీ, ఇరిగేషన్, విద్యుత్, ఆర్‌అండ్‌బీ తదితర శాఖలతో సమన్వయం చేసుకుంటూ ఏర్పాట్లను పరిశీలించారు.

సామాన్యులతో మమేకమై..!

ఫ్రెండ్లీ పోలీసింగ్‌తో ప్రజలకు దగ్గరైన పోలీసులు ప్రజల ఆకాంక్షలకు తగ్గట్టుగా తమ పనితీరును ప్రదర్శించారు. ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన కొందరు సిబ్బంది షిఫ్టుల ప్రకారం బందోబస్తులో పాల్గొన్నా.. స్థానిక అధికారులు, సిబ్బంది మాత్రం 48 గంటల పాటు నిరావధికంగా విధి నిర్వాహణలో ఉన్నారు. బుధవారం ఉదయం నుంచి నిమజ్జనం విధులలో పాల్గొని శుక్రవారం ఉదయం వరకు విధి నిర్వహణలో కొనసాగిన వారు చాలామంది ఉన్నారు. కొద్ది పాటి విశ్రాంతి తీసుకొని తిరిగి విధి నిర్వాహణలో పాల్గొన్నవారు చాలామంది ఉన్నారు. హోంగార్డు నుంచి సీనియర్ ఐపీఎస్‌ల వరకు ట్రై కమిషనరేట్ల పరిధిలోని ప్రధాన నిమజ్జన ట్యాంకుల వద్ద గురువారం మధ్యాహ్నం నుంచి శుక్రవారం ఉదయం 10 గంటల వరకు విధులు నిర్వహించారు. వ్యూహాత్మకమైన బందోబస్తుతో ఉన్నతాధికారులు క్షేత్ర స్థాయి సిబ్బందిని నియమించడంతో ట్రై కమిషనరేట్ల పరిధిలో ప్రశాంతమైన వాతావారణంలో నిమజ్జనం పూర్తయ్యింది. ఇందులో మహిళా పోలీసులు కూడా విశ్రాంతి లేకుండా పనిచేశారు. వీరికి తోడు ట్రై కమిషనరేట్లలోని ఐటీ సెల్ సిబ్బంది కూడా పోలీసులకు తమ వంతు సహకారం అందించారు. పోలీసులకు ఆయా ప్రాంతాలలోని వలంటీర్లు కూడా సహకారం అందించారు.

ప్రజల సహకారం.. పోలీసుల ప్రణాళిక

ట్రై పోలీస్ కమిషనరేట్ల పరిధిలో ప్రజల సహకారంతో ప్రశాంతమైన వాతావారణంలో వినాయక నవరాత్రి ఉత్సవాలు పూర్తి చేయడంలో పోలీసులు మంచి ప్రణాళికలను అవలంభించి సక్సెస్ సాధించారు. సహకరించిన వారందరికీ అభినందనలు. పోలీసులు రాత్రింబవళ్లు కష్టపడుతూ ఒక్క చిన్న సంఘటనకు కూడా తావివ్వకుండా వేడుకలను పూర్తి చేశారు. అన్ని విభాగాలతో సమన్వయం చేసుకుంటూ రాష్ట్ర వ్యాప్తంగా పోలీసులు వినాయక నిమజ్జన కార్యక్రమం, ఇటీవలే పూర్తయిన మొహర్రంలను ప్రశాంతమైన వాతావారణంలో పూర్తి చేసి, హైదరాబాద్‌ను ప్రశాంతతకు మారు పేరు అనే విషయాన్ని తెలంగాణ పోలీసులు మారోసారి ప్రపంచానికి చాటి చెప్పారు.
- మహమూద్ అలీ, హోంమంత్రి.

710
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles