రేపు గాంధీ వైద్య కళాశాల 65వ ఆవిర్భావ దినోత్సవం

Thu,September 13, 2018 07:52 AM

Gandhi Medical College 65th Foundation day on September 14

హైదరాబాద్ : జాతిపిత మహాత్మా గాంధీ పేరుతో కొనసాగుతూ.. మేలిమి బంగారం లాంటి వైద్యులను తయారు చేసి దేశానికి అందిస్తున్నది సికింద్రాబాద్ గాంధీ మెడికల్ కళాశాల. నిష్ణాతులైన వైద్యులుగా తీర్చిదిద్దుతూ నేడు 64 వసంతాలు పూర్తి చేసుకుని రేపు 65వ వసంతంలోకి అడుగుపెడుతున్నది. పీపుల్స్ మెడికల్ కళాశాలగా 1954 సెప్టెంబర్ 14న ఆవిర్భవించింది. అనంతరం గాంధీ మెడికల్ కళాశాలగా పేరు మార్చుకుని దేశంలోనే ప్రతిష్టాత్మకంగా నిలుస్తున్నది. దేశ విదేశాల్లో వైద్య సేవలు అందిస్తున్న వేలాది మంది నిష్ణాతులైన వైద్యులు స్టెతస్కోప్ పట్టుకుని వైద్యబాషలో ఇక్కడే అక్షరభ్యాసం చేశారు.

ఆవిర్భావం ఇలా..
1954 సెప్టెంబర్ 14న అన్వర్ లుమ్ ఎడ్యుకేషనల్ సొసైటీ ఆధ్వర్యంలో 40 మంది విద్యార్థులతో మెహిదీపట్నం సరోజిని కంటి దవాఖాన సమీపంలోని హుమాయూన్‌నగర్‌లో పీపుల్స్ మెడికల్ కళాశాలను స్థాపించారు. మొట్టమొదటి ప్రిన్సిపాల్‌గా డాక్టర్ సయ్యద్ నిజాముద్దీన్ అహ్మద్ విధులు నిర్వహించారు. నాటి రాష్ట్రపతి బాబు రాజేంద్రప్రసాద్ 1955 జూన్ 25న కళాశాలను ప్రారంభించారు. 1956లో ఆర్థిక పరమైన ఇబ్బందుల నేపథ్యంలో ప్రైవేట్ యాజమాన్యం నుంచి హైదరాబాద్ ప్రభుత్వం కళాశాలను తమ ఆధీనంలోకి తీసుకున్నది. 1958 జూలైలో బషీర్‌బాగ్‌కు తరలించి గాంధీ మెడికల్ కళాశాలగా పేరును మార్చారు. డాక్టర్ డీవీ సుబ్బారెడ్డిని పూర్తి స్థాయి ప్రిన్సిపాల్‌గా నియమించారు. అక్కడి నుంచి కొన్ని సంవత్సరాల అనంతరం అనగా 2003లో ప్రస్తుతం ఉన్న గాంధీ దవాఖాన పక్కకు మార్చారు. అయితే 1950-60 మధ్యకాలంలోనే దవాఖానకు అనుసందానం చేశారు. ఎంబీబీఎస్, ఎండీ, ఎంఎస్ డీఎం, సూపర్‌స్పెషాలిటీ లాంటి కోర్సులతోపాటు నర్సింగ్, పారామెడికల్ కోర్సులు అందుబాటులోకి వచ్చాయి. కళాశాలకు అనుబంధంగా ఉన్న గాంధీ దవాఖానలో ఏటా లక్షకుపైగా అవుట్ పేషెంట్లు, 60 వేలకు పైగా ఇన్‌పేషెంట్లుగా వైద్యం పొందుతారు. మరో 15 వేల మేజర్, 25 వేల మైనర్ ఆపరేషన్లు ఇక్కడ జరుగుతుంటాయి.

నేటి నుంచి ఫౌండేషన్ డే కార్యక్రమాలు
గాంధీ మెడికల్ కళాశాల పూర్వ విద్యార్థుల సంఘం నేతృత్వంలో గురువారం మధ్యాహ్నం ఒంటి గంట నుంచి అలూమ్ని భవనంలో ఫౌండేషన్ డే కార్యక్రమం నిర్వహించనున్నట్లు డాక్టర్ ప్రతాప్‌రెడ్డి, డాక్టర్ లింగమూర్తి తెలిపారు. అత్యుత్తమ ప్రతిభ చూపిన వైద్య విద్యార్థులకు బంగారు పతకాలు బహుకరిస్తామని, బెస్ట్ టీచర్ అవార్డుతో పాటు వైద్యులను సత్కరిస్తామని తెలిపారు.

756
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS