నుమాయిష్‌కు కట్టుదిట్టమైన భద్రత

Sat,November 9, 2019 08:32 AM

హైదరాబాద్: నుమాయిష్‌కు వచ్చే సందర్శకులు, స్టాళ్ల యజమానుల భద్రతకు ఈ ఏడాది అధిక ప్రాధాన్యతనిస్తున్నామని ఎగ్జిబిషన్ సొసైటీ అధ్యక్షుడు, రాష్ట్ర వైద్యారోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి ఈటల రాజేందర్ వెల్లడించారు. గతేడాది నుమాయిష్‌లో జరిగిన అగ్నిప్రమాదం నేపథ్యంలో అలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామన్నారు. శుక్రవారం నాంపల్లి ఎగ్జిబిషన్ మైదానంలో పర్యటించిన మంత్రి, అక్కడ చేపట్టిన పలు పనులను పరిశీలించి, తదనంతరం ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆయా వివరాలను మీడియాకు వెల్లడించారు. నుమాయిష్.. నగరవాసులకు చిర, సుపరిచితమైన ఎగ్జిబిషన్.. కుటుంబ సపరివార సమేతంగా వెళ్లి ఇంటిళ్లిపాదికి కావాల్సిన వస్తువులను షాపింగ్ చేసుకునే ఏకైక చోటు. నగరంలో అతిపెద్దదైన పారిశ్రామిక ప్రదర్శనగా ప్రసిద్ధిగించిన ను మాయిష్ నిర్వహణకు ఎగ్జిబిషన్ సొసైటీ ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నదన్నారు.


2020 జనవరి 1 నుంచి ఫిబ్రవరి 15 వరకు 46 రోజులపాటు నుమాయిష్ కొనసాగుతుందని మంత్రి వివరించారు. పోలీసులు, అగ్నిమాపక, విద్యుత్‌శాఖ అధికారులు, నిపుణుల సూచనల మేరకు మైదానంలో పలు ఏర్పాట్లు చేస్తున్నామని, చేపట్టిన పనులన్నీ 10 రోజుల్లోగా పూర్తవుతాయని ఈటల రాజేందర్ తెలిపారు. ఎగ్జిబిషన్ సొసైటీ ఉపాధ్యక్షుడు ఎన్. సురేందర్, కార్యదర్శి డా. వి. ప్రభాశంకర్, సంయుక్త కార్యదర్శి డి. హనుమంతరావు, కోశాధికారి ఎన్. వినయ్‌కుమార్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

2850 మీటర్ల భూగర్భ అగ్నిమాపక లైన్లు..

అగ్నిప్రమాదాలు, వివత్తులు జరిగితే సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు ఎగ్జిబిషన్ మైదానంలో 2850 మీటర్ల పొడవులో అగ్నిమాపక నీటి లైన్లు వేస్తున్నారు. ఒక్క దీని కోసమే రూ. 2.1 కోట్లను ఖర్చు చేస్తున్నారు. 1800 వీటర్ల పొడవులో 150 ఎంఎం, 600 మీటర్ల పొడవులో 100 ఎంఎం, 450 మీటర్లకు 80 ఎంఎం పైపులైన్లు వేస్తున్నారు. అత్యవసర పరిస్థితుల్లో నీటి సరఫరా కోసం గాంధీ సెంటినరీ హాల్, ఈఫిల్‌టవర్ సమీపాల్లో 1.5 లక్షల లీటర్ల సామర్థ్యం గల రెండు భూగర్భ సంప్‌లను నిర్మిస్తున్నారు. ఈ రెండు సంప్‌ల వద్ద నిమిషానికి 2800 లీటర్ల నీటిని తోడే సామర్థ్యం గల మూడు పంపుసెట్లను అమర్చుతున్నారు. విద్యుత్‌తో, బ్యాటరీ, డీజిల్‌తో నడిచే ఈ మూడు పంపుసెట్లతో మైదానం యావత్తు 2కిలోమీటర్ల మేర గల అగ్నిమాపక లైన్లకు నీటిని సరఫరా చేయనున్నారు. ఈ పైపులైన్ల మధ్యలో నీటిని సరఫరా చేసేందుకు ప్రతీ 200 మీటర్లకు ఒకటి చొప్పున మొత్తం 80 ఫైర్ హెడ్రాంట్స్ (నీటిని విడుదల చేసే)ను అమర్చుతున్నారు. ప్రతీ హైడ్రాంట్ నుంచి 30 మీటర్ల మేర నీటిని సరఫరా చేసేందుకు రబ్బరుపైపును అందుబాటులో ఉంచుతున్నారు.

473 మీటర్ల భూగర్భ విద్యుత్‌లైన్లు..

ఎగ్జిబిషన్ మైదానంలో లూజువైర్లు, లూజు కనెక్షన్లతో విద్యుత్ ప్రమాదాలు జరిగే అవకాశముండటంతో ఓవర్‌హెడ్‌లైన్లంటిని మార్చతున్నారు. అంతర్గతంగా విద్యుత్ సరఫరా చేసే ఓవర్‌హెడ్ విద్యుత్‌లైన్లను పూర్తిగా భూగర్భలైన్లుగా మార్చుతున్నారు. ఒక్కవైరు కూడా బయటికి కనిపించకుండా, భూగర్భ కేబుళ్లు వేస్తున్నా రు. ఇందుకోసం రూ. 82.65 లక్షలను వెచ్చిస్తున్నారు. గతేడాది 880మీటర్లు (80శాతం) భూగర్భ విద్యుత్‌లైన్లు వేయగా, తాజాగా మిగిలిపోయిన 473 మీటర్ల నిడివి గల ఓవర్‌హెడ్‌లైన్లను భూగర్భమార్గంలో వేస్తున్నారు. విద్యుత్‌శాఖ చీఫ్ ఎలక్ట్రికల్ ఇన్‌స్పెక్టర్ (సీఈఐజీ) సూచనల మేరకు కేబుల్స్‌ను భూగర్భంలోకి మా ర్చి విద్యుత్ ప్రమాదాలకు అస్కారం లేకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు.

ఇక విద్యుత్ ప్రమాదాలు జరిగినా, సరఫరాలో అంతరాయం ఏర్పడినా వెంటనే ట్రిప్ అయ్యేందుకు వీలుగా ఎంసీ బాక్స్‌లను అమర్చుతున్నారు. గతేడాది 160 ఏఎంపీఎస్ సామర్థ్యం గల 22 డిస్ట్రిబ్యూషన్ బాక్స్‌లను ఏర్పాటు చేయగా, తాజాగా ట్రిప్ అయ్యేందుకు వీలుగా ఎంసీబీలను అమర్చుతున్నారు.

మరికొన్ని ఏర్పాట్లు..

అగ్నిమాపక శకటాలు తిరగడానికి వీలుగా విస్తారంగా అంతర్గత రోడ్లు ఉండేలా చర్యలు. అవసరమైతే స్టాళ్ల సంఖ్యను తగ్గించడం.. కుదించడం.
స్టాళ్ల నిర్వాహకులు గ్యాస్‌స్టౌవ్‌లతో ఆహారాన్ని తయారు చేసుకోవడం, వంట చేసుకోవడం నిషేధం.
బీడీలు, సిగరెట్లు, అగ్గిపెట్టెలతో మైదానంలోకి ప్రవేశంపై పూర్తి నిషేధం.
ప్రతి స్టాల్‌కు పరిణామాన్ని బట్టి, ప్రమాదాన్ని తొలిదశలోనే అరికట్టేందుకు అగ్నిమాపకాలు (ఫైర్ ఎగ్టింగ్విషర్లు) సమకూర్చడం.
46 రోజులపాటు అన్ని స్టాల్స్‌కు భీమా సౌకర్యం.
ఎగ్జిబిషన్ మైదానంలో పలు ప్రాంతాల్లో రెండు అగ్నిమాపక శకటాలు, ఫైర్ మోటార్ బైక్‌లను సిద్ధంగా ఉంచడం.
ఎంపిక చేసిన ప్రాంతాల్లో నీటినిల్వలు (వాటర్ బ్యారెల్స్), అగ్నిమాపక బకెట్లను అందుబాటులో ఉంచడం.
అత్యవసర పరిస్థితుల్లో ఫైర్ హైడ్రాంట్స్ (నీటిని విడుదల చేసే జాయింట్స్)ను ఆపరేట్ చేయడానికి శిక్షణపొందిన వలంటీర్ల నియామకం.
నాలుగు ప్రవేశ, నిర్గమన మార్గాలతోపాటు మరికొన్ని ప్రాంతాల్లో ఎంట్రీ, ఎగ్జిట్ పాయింట్స్ ఏర్పాటు
విద్యుత్ సరఫరా వైఫల్యం చెందితే అత్యవసర పరిస్థితుల దృష్ట్యా ఆటోమెటిక్ డీజిల్ జనరేటర్లు అందుబాటులో ఉంచడం.
విద్యుత్ ప్రమాదాలను అరికట్టేందుకు పలుచోట్ల ఎర్తింగ్ ఉండేలా చూడటం.
అండర్‌గ్రౌండ్ విద్యుత్ కేబుల్స్ రక్షణ దృష్ట్యా పీవీపీ పైపుల్లో వేసి పూడ్చడం.
అగ్నిమాపక భూగర్భ నీటి సరఫరా పైపులైను లీకేజీలు కాకుండా రబ్బర్‌తో చుట్టడం


ఎగ్జిబిషన్‌లో భద్రతాప్రమాణాలపై సీపీ సమీక్ష

నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్‌లో జనవరిలో ప్రారంభంకానున్న ఎగ్జిబిషన్‌లో తీసుకోవాల్సిన భద్రతాచర్యలపై అన్ని విభాగాలతో నగర పోలీ స్ కమిషనర్ అంజనీకుమార్ శుక్రవారం సమీక్ష నిర్వహించారు. గతేడాది ఎగ్జిబిషన్‌లో అగ్నిప్రమాద ఘటన జరిగిన విషయం తెలిసిందే. ఈ ఘటనను దృష్టిలో ఉంచుకొని ముందు జాగ్రత్త చర్యగా అన్ని విభాగాల అధికారులతో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై చర్చించారు. ఇందులో రీజినల్ ఫైర్‌ఆఫీసర్ ప్రసాద్‌కుమార్, జిల్లా ఫైర్ అధికారి శ్రీనివాస్‌రెడ్డి, ఆర్‌అండ్‌బీ, ఎలక్ట్రికల్ విభాగం అధికారి శ్రీనివాస్, హైదరాబాద్ జిల్లా జాయింట్ కలెక్టర్ రవితోపాటు పోలీసు ఉన్నతాధికారులు శిఖాగోయెల్, అనిల్‌కుమార్, చౌహాన్, తరుణ్‌జోషి తదితరులు పాల్గొన్నారు.

393
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles