తండ్రిని ముక్కలు ముక్కలుగా నరికిన తనయుడు

Mon,August 19, 2019 06:42 AM

తండ్రిని చంపిన తనయుడు
ముక్కలుగా నరికి బకెట్లలో దాచిపెట్టి.. ఆపై పరారైన నిందితుడు
కొడుకు భయానికి బయటికి చెప్పని తల్లి
స్థానికుల ఫిర్యాదుతో వెలుగులోకి..


హైదరాబాద్ : మద్యానికి బానిసైన కొడుకు తండ్రిని అతి దారుణంగా హత్య చేసిన ఘటన మల్కాజిగిరి పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటుచేసుకున్నది. చెడు అలవాట్లకు బానిసగా మారిన కొడుకు డబ్బుల కోసం తరుచూ తండ్రిని వేధించడంతో ఇరువురి మధ్య గొడవలు జరిగేవి. ఈ క్రమంలోనే మూడు రోజుల క్రితం హత్య జరిగింది. ఆదివారం ఇంట్లో నుంచి దుర్వాసన రావడంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. దీంతో హత్య సంఘటన వెలుగులోకి వచ్చింది. హత్య వివరాలు ఏసీపీ సందీప్‌రావు వెల్లడించారు.

సౌత్‌సెంట్రల్ రైల్వే సికింద్రాబాద్‌లో గూడ్స్‌రైల్ డ్రైవర్‌గా పనిచేసి రిటైర్డ్ అయిన సూతార్ మారుతి(80), భార్య గయ, కొడుకు సూతార్ కిషన్(30), కూతురు ప్రపూల్‌తో కలిసి మహారాష్ట్ర నుంచి 15 ఏండ్ల క్రితం వచ్చి మౌలాలి ఆర్టీసీ కాలనీలోని డాక్టర్ ఎన్‌ఏ కృష్ణనగర్ కాలనీలో స్థిరపడ్డారు. పెద్ద కూతురు అనుపమ, అల్లుడు రవి ఈస్ట్‌మారెడుపల్లిలో నివాసం ఉంటున్నారు. ఈ నెల 16వ తేదీ రాత్రి 11గంటల సమయంలో కొడుకు కిషన్ మద్యం తాగివచ్చి తండ్రి మారుతితో గొడవపడ్డాడు. ఈ గొడవలో తండ్రిని అతి దారుణంగా హత్య చేసి మృతదేహాన్ని ముక్కలు ముక్కలుగా చేసి 6 నుంచి 7 ప్లాస్టిక్ బకెట్లలో నింపి దాచి ఉంచాడు. అనంతరం నిందితుడు కిషన్ పారిపోయాడు.

ఆదివారం ఆ ఇంట్లో నుంచి దుర్వాసన రావడంతో స్థానికులు 100కు ఫిర్యాదు చేశారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు డ్యాగ్‌స్క్వాడ్, క్లూస్ టీంను రప్పించి దర్యాఫ్తు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాఫ్తు చేస్తున్నామని తెలిపారు. ఘటనా స్థలానికి మల్కాజిగిరి ఇన్‌స్పెక్టర్ మన్మోహన్, డీఐ జగదీశ్వర్, ఎస్సైలు సంజీవరెడ్డి, వెంకటేశ్వర్లు, పోలీస్ సిబ్బంది హత్య జరిగిన తీరుపై పరిశీలించారు.

కొడుకు భయానికే చెప్పలేదు..
హత్య జరిగిన సమయంలో తల్లి, కూతురు ఇంట్లోనే ఉన్నారని, కొడుకు కిషన్ భయానికే పోలీసులకు విషయాన్ని చెప్పలేదని తల్లి గయ, కూతురు ప్రపూల్ తెలిపారని ఏసీపీ సందీప్‌రావు పేర్కొన్నారు.

9314
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles