ప్రతి 8 నిమిషాలకు క్యాన్సర్ మరణం..!

Mon,September 3, 2018 06:40 AM

every 8 minutes one cancer patient is died

-దేశంలో బ్రెస్ట్, సర్వైకల్ క్యాన్సర్లే అధికం
-దీన్ని గుర్తించాలంటే ప్రతి యేటా మహిళలు పరీక్షలు చేయించుకోవాలి
-డాక్టర్ మోహన వంశీ
-హైదరాబాద్ ప్రెస్‌క్లబ్‌లో ఉచిత క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు

హైదరాబాద్: ప్రాణాంతక క్యాన్సర్ వ్యాధిని ముందస్తుగా గుర్తించేందుకు హైదరాబాద్ ప్రెస్‌క్లబ్, ఓమెగా హాస్పిటల్స్ సంయుక్త ఆధ్వర్యంలో ఆదివారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో క్యాన్సర్‌పై అవగాహన, ఉచిత వైద్య పరీక్షా శిబిరాన్ని నిర్వహించారు. ఈ శిబిరాన్ని హైదరాబాద్ ప్రెస్‌క్లబ్ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఎస్. విజయ్ కుమార్ రెడ్డి, బి. రాజమౌళిచారిలు ఓమెగా హాస్పిటల్స్ చీఫ్ సర్జికల్ ఆంకాలజిస్ట్ డాక్టర్ సిహెచ్. మోహన వంశీతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా డాక్టర్ మోహన వంశీ మాట్లాడుతూ ... నేడు క్యాన్సర్ పేరుతో పాటు పరీక్షలు, వైద్యం అంటే కూడా భయపడుతున్నారని, అవగాహన రాహిత్యం వల్లే ఇలాంటి సందిగ్ధ పరిస్థితి నెలకొంటుందన్నారు. క్యాన్సర్ వ్యాధులను ముందస్తుగా గుర్తించలేమని, అయితే మహిళల్లో బ్రెస్ట్, సర్వైకల్, ఓవెరియన్, పురుషుల్లో ప్రొస్టేట్, ఊపిరితిత్తుల క్యాన్సర్‌ను స్క్రీనింగ్ పరీక్షల ద్వారా గుర్తించవచ్చని తెలిపారు. భారతదేశంలో ప్రతి ఏడాది 20 లక్షల క్యాన్సర్ కేసుల్లో బ్రెస్ట్, సర్వైకల్ క్యాన్సర్లే అధికంగా ఉంటున్నాయన్నారు. సర్వైకల్ క్యాన్సర్‌ను గుర్తించాలంటే ప్రతి స్త్రీ ప్రతి సంవత్సరానికి ఒక సారి పాప్ స్మియర్ పరీక్షలు చేయించుకోవాలన్నారు.

మిగతా క్యాన్సర్ వ్యాధుల్లో ఎలాంటి లక్షణాలు కనిపించవని, రొమ్ము, సర్వైకల్, ఓవేరియన్, ప్రొస్టేట్, ఊపిరిత్తుల క్యాన్సర్ బారిన పడిన వారిని కొన్ని లక్షణాల ద్వారా గుర్తించవచ్చన్నారు. ఒక్కసారిగా బరువు తగ్గిపోవడం, మలమూత్రాల్లో రక్తం రావడం, కళ్లెంలో రక్తంపడటం, రొమ్ము వద్ద గడ్డలు, మడతలు రావడం, నాలికపై ఎరువు, తెలుపు రంగులో నొప్పి లేని పుండ్లు రావడం, నొప్పి లేని పుండ్లు ప్రమాదకరమని, రుతుక్రమంలో మార్పులు, అధిక రక్తస్రావం వంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యులను సంప్రదించాలన్నారు. కడుపులో క్యాన్సర్ ఉన్న వారు కొద్దిగా తినగానే కడుపు ఉబ్బరంగా ఉండటం ప్రధాన లక్షణమని తెలిపారు. ప్రతి 8 నిమిషాలకు ఒక స్త్రీ సర్వైకల్ క్యాన్సర్‌తో మరణిస్తుందని, నేడు వ్యాక్సిన్ అందుబాటులో వచ్చిందని, ముందస్తుగా వ్యాక్సిన్లు వేసుకుంటే వాటి బారిన పడకుండా ఉంటారని తెలిపారు. ఆంకాలజిస్టులు డాక్టర్ గీత, డాక్టర్ శిరీష, రేడియాలజిస్ట్ డాక్టర్ రజితల నేతృత్వంలో 24 మంది మహిళలకు మామోగ్రఫీ, 32 మందికి పాప్‌స్మియర్, 30 మందికి అల్ట్రాసౌండ్, ముగ్గురికి ఎక్స్‌రే పరీక్షలు నిర్వహించి వైద్య సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో ప్రెస్‌క్లబ్ ఉపాధ్యక్షులు చిరుకూరి హరిప్రసాద్, కార్యవర్గ సభ్యులు కట్టా కవిత, వి. యశోద, ఎన్. భూపాల్ రెడ్డి, మేనేజర్ విజయ్ కుమార్ పాల్గొన్నారు.

2734
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles