దేశంలో 15 నిమిషాలకో లైంగిక దాడి

Wed,April 10, 2019 08:17 AM

Every 15 Minutes, Sexual Harassment Occurs in India Country

ఖైరతాబాద్: మహిళలను గౌరవించడం మన సంప్రదాయమని, కాని రోజు రోజుకు వారిపై లైంగిక దాడులు, దౌర్జన్యాలు పెరిగిపోతున్నాయని, అత్యాచార రహిత భారతావణి నిర్మించుకోవాల్సిన అవసరం ఉందని ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ కార్యదర్శి ఎం. పద్మనాభ రెడ్డి అన్నారు. నెట్‌వర్క్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ చైల్డ్ రైట్స్ తెలంగాణ, ఖైలాష్ సత్యర్థి ఫౌండేషన్, వివిధ స్వచ్ఛంద సంస్థ సంయుక్త ఆధ్వర్యంలో సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో అత్యాచార రహిత భారతదేశం (రేప్ ఫ్రీ ఇండియా) అనే అంశంపై సమావేశం నిర్వహించారు.

ఈ కార్య్రకమానికి ముఖ్య అతిథిగా హాజరైన పద్మనాభ రెడ్డి మాట్లాడుతూ... రెండేండ్ల పాప నుంచి 70 ఏండ్ల వృద్ధురాలి వరకు లైంగిక దాడికి గురవుతున్నారన్నారు. అలాంటి దాడులు జరిగినప్పుడు పోలీసు స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేసే సందర్భాలు చాలా తక్కువన్నారు. అయితే బాధితురాలు ధైర్యంగా పోలీసు స్టేషన్‌కొచ్చి ఫిర్యాదు చేయాలని, బాధ్యులకు శిక్షపడే వరకు పోరాడాలన్నారు. 'రేప్ ఫ్రీ ఇండియా' పేరుతో స్వచ్ఛంద సంస్థ చేపట్టిన కార్యక్రమం విజయం సాధించాలన్నారు.

ఖైలాష్ సత్యర్థి ఫౌండేషన్ రీజినల్ డైరెక్టర్ ఓం ప్రకాశ్ మాట్లాడుతూ..దేశంలో 54 శాతం పిల్లలపై పని చేస్తున్న, చదువుకుంటున్న ప్రాంతాల్లో లైంగిక వేధింపులు జరుగుతున్నాయని, ఇందులో పేదవారే అధిక సంఖ్యలో ఉన్నారన్నారు. దేశంలో 15 నిమిషాలకు ఒక లైంగికదాడి జరుగుతుందని తెలిపారు. 2014లో లైంగిక దాడికి గురైన బాధితులకు అందించే పరిహారంలోనూ పాలకులు 30 శాతం కోత విధించడం బాధాకరమన్నారు. మహిళలు, పిల్లలపై జరుగుతున్న లైంగికదాడులను నిలువరించాలని కోరుతూ తమ సంస్థ భారతదేశం మొత్తం యాత్ర నిర్వహించిందని, ప్రజలను చైతన్యపరిచిందన్నారు.

ప్రస్తుతం తమ యాత్ర సత్పలితాలనిచ్చిందని, నేరుగా పోలీసు స్టేషన్ వెళ్లి ఫిర్యాదు చేసే బాధితుల సంఖ్య గణనీయంగా పెరిగిందని తెలిపారు. మానవ హక్కుల ఫోరం ప్రతినిధి జీవన్ కుమార్ మాట్లాడుతూ.. లైంగిక దాడికి గురైన బాధితులు ఫిర్యాదు చేసేందుకు పోలీసు స్టేషన్‌కొస్తే వాటిని స్వీకరించడం లేదన్నారు.ఆ పద్ధతి మారాలని, బాధితులు ధైర్యంగా వచ్చి తమకు అన్యాయాన్ని చేప్పుకొనే అవకాశం కల్పించాలని, నిందితులు ఎంతటి వారైనా వారికి శిక్ష పడేలా చొరవ చూపాలన్నారు.

70 శాతం దర్శకులు, నిర్మాతలు.. పది, ఇంటర్‌లో చదువు ఆపేసిన వాళ్లే..

సాక్షి జర్నలిజం స్కూల్ ప్రిన్సిపాల్ దిలీప్ రెడ్డి మాట్లాడుతూ... సమాజంలో ఇలాంటి ఘటనలు చోటు చేసుకోవడం వెనుక సినిమా పాత్ర కూడా ఉందని, పది, ఇంటర్‌లో చదువు మానేసిన వారు డైరెక్టర్లు, ప్రొడ్యూసర్లు 70 శాతానికి పైగా ఉన్నారని, కమర్షియల్‌గా ఆలోచించి సినిమా తీయడం వల్ల సమాజంపై చెడు ప్రభావం చూపతుందన్నారు. సినిమాల్లో ఆడవారిని ఆటబొమ్మలా చూపిస్తున్నారని తెలిపారు. మహిళలపై జరుగుతున్న దాడులను నిలువరించేందుకు స్వచ్ఛంద సంస్థలు చిన్న ప్రయత్నం చేసినా అందరం కలిసి సహకరించాలన్నారు.

చైల్డ్ వెల్ఫేర్ కమిటీ చైర్మన్ శ్యామల, ఎంవీ ఫౌండేషన్ కన్వీనర్ వెంకట్‌రెడ్డిలు మాట్లాడుతూ... బాల్య వివాహ వ్యవస్థ పోవాలని, చట్టాలు సైతం పిల్లలకు అనుకూలంగా తయారు చేసి అమలు చేయాలన్నారు. రాజకీయ నాయకులకు సైతం దీనిపై అవగాహన పెంచాలని, లేదా అవగాహన ఉన్న వారు రాజకీయాల్లోకి వస్తే మంచిదన్నారు. సమావేశంలో అసోసియేషన్ ఫర్ ప్రమోటింగ్ సోషల్ యాక్షన్ డైరెక్టర్ ఎస్. శ్రీనివాస్ రెడ్డి , తరుణి స్వచ్ఛంద సంస్థ అధ్యక్షురాలు, ఎన్‌సీపీఆర్ సభ్యురాలు మమతా రఘువీర్, యాక్షన్ ఎయిడ్ సంస్థ మేనేజన్ ఆంజనేయులు, బచ్‌పన్ బచావో ఆందోళన ప్రతినిధి చందన పాల్గొన్నారు.

1444
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

country oven

Featured Articles

Health Articles