డబ్బులు తీసుకున్నట్లు జగ్గారెడ్డి ఒప్పుకున్నారు: డీసీపీ సుమతి

Tue,September 11, 2018 11:06 AM

DCP Sumathi Press Meet   On Jagga Reddy Arrest

హైదరాబాద్: మానవ అక్రమ రవాణా కేసులో మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డిని అరెస్ట్ చేసినట్లు నార్త్‌జోన్ డీసీపీ సుమతి ఇవాళ మీడియా సమావేశంలో వివరించారు. సికింద్రాబాద్ మార్కెట్ పోలీస్‌స్టేషన్ ఎస్సై అంజయ్యకు వచ్చిన సమాచారం మేరకు కేసు నమోదు చేసినట్లు ఆమె తెలిపారు. డీసీపీ కార్యాలయంలో ఆమె మాట్లాడుతూ.. జగ్గారెడ్డి తన కుటుంబసభ్యుల పేర్లతో అక్రమంగా పాస్‌పోర్టు పొందారు. భార్య నిర్మల, కుమార్తె జయలక్ష్మి, కుమారుడు భరత్‌సాయిరెడ్డి పేర్లతో పాస్‌పోర్టు తీసుకున్నారు. ఎమ్మెల్యేగా పనిచేసిన కాలంలో అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారు. ఈ నేపథ్యంలోనే అధికార దుర్వినియోగం కింద కేసు నమోదు చేశాం.

2004లో నకిలీ పత్రాలతో కుటుంబసభ్యుల పేర్లతో పాస్‌పోర్టు తీసుకున్నట్లు గుర్తించాం. ఆధార్ కార్డుల డేటా ఆధారంగా వివరాలు సేకరించాం. డాక్యుమెంట్లలో భార్య ఫొటో, కుమార్తె జయలక్ష్మి, కుమారుడు భరత్ సాయిరెడ్డిల పుట్టినతేదీ మార్పిడి జరిగింది. ఫ్యామిలీ ఫొటో, ఆధార్ కార్డులు స్వాధీనం చేసుకున్నాం. ఈ కేసుకు సంబంధించి మధ్యవర్తి మధును అదుపులోకి తీసుకుని విచారిస్తున్నామని డీసీపీ సుమతి వెల్లడించారు. పాస్‌పోర్టు ద్వారా వెళ్లింది తెలంగాణ రాష్ర్టానికి చెందిన వారు మాత్రం కాదని ఆమె తెలిపారు. పాస్‌పోర్టు ద్వారా ముగ్గురిని అమెరికా తీసుకెళ్లినట్లు గుర్తించామని పేర్కొన్నారు..

జగ్గారెడ్డిపై ఐపీసీ 419, 420, 467, 468, 471, 370 సెక్షన్లతో పాటు పాస్‌పోర్టు చట్టం 1967 సెక్షన్ 12, ఇమ్మిగ్రేషన్ చట్టం 1983 సెక్షన్ 24 కింద కేసు నమోదు చేశామన్నారు. అన్ని కేసులకు సంబంధించి అధికారిక ఆధారాలున్నాయని పేర్కొన్నారు. ఒక్కొక్కరి దగ్గర నుంచి రూ.5లక్షలు తీసుకున్నట్లు జగ్గారెడ్డి ఒప్పుకున్నారని డీసీపీ సుమతి మీడియాకు వివరించారు. మధు అనే బ్రోకర్ ద్వారా మనుషుల అక్రమ రవాణా జరిగిందని తెలిపారు. వైద్య పరీక్షల అనంతరం జగ్గారెడ్డిని సికింద్రాబాద్ సిటీ సివిల్ కోర్టులో పోలీసులు హాజరుపరిచారు.

5441
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles