మీ ఇంటి పైకప్పు చల్లగా.. కూల్, గ్రీన్ అండ్ పవర్ రూఫ్స్‌తో..!

Sun,May 19, 2019 11:35 AM

cool and green power roofs for cool house roofs

- హరిత పందిళ్లపై రెండు రోజులపాటు సదస్సు
- ప్రవేశం ఉచితం

హైదరాబాద్: విద్యుత్ బిల్లులను తగ్గించుకోవాలనుకుంటున్నారా?.. ఇంటి వద్దనే ఉద్యానవనం(తోట) ఏర్పాటు చేసుకోవాలనుకుంటున్నారా?.. ఇంటిని సూర్యరశ్మి వల్ల అధికంగా వేడెక్కకుండా చేయాలనుకుంటున్నారా?.. అయితే మీలాంటి వారి కోసమే ఇంధన పొదుపు సంస్థ- ఇనిస్టిట్యూషన్ ఆఫ్ ఇంజినీర్స్ (ఇండియా) ప్రత్యేక అవగాహన సదస్సును ఏర్పాటు చేసింది. ప్రస్తుతం మారిన జీవనశైలికి అనుగుణంగా విద్యుత్ ఉపకరణాల వాడకం విపరీతంగా పెరిగిపోయింది. ఫలితంగా విద్యుత్ బిల్లుల వ్యయమూ పెరిగింది. ఈ నేపథ్యంలో ఆధునిక సాంకేతికత సాధనాలతో పాటు ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా విద్యుత్ వినియోగాన్ని తగ్గించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

ఇంటి పైకప్పుల్లో సరికొత్త సాంకేతిక ఉపకరణాలను ఉపయోగించి తద్వారా వాటిని శీతల, హరిత, శక్తివంతమైన పైకప్పులుగా మార్చుకోవడం ద్వారా విద్యుత్ వినియోగం గణనీయంగా తగ్గించవచ్చు. దీనిపట్ల ప్రజలను జాగృతం చేసేందుకు ఎనర్జీ కన్జర్వేషన్ మిషన్ నిర్విరామంగా కృషి చేస్తున్నది. సంస్థ ఆశయాలకనుగుణంగా నెలనెలా విద్యుత్ బిల్లులను తగ్గించుకోవడంతో పాటు పర్యావరణానికి మేలు చేసేలా ముందుకు సాగుతున్నది. ప్రస్తుత తరుణంలో ఆగిపోకుండా భవిష్యత్ తరాలకు సమృద్ధిగా ఇంధన, జల వనరులతోపాటు స్వచ్ఛమైన ప్రాణవాయువు, ఆహ్లాదకరమైన నివాసయోగ్యమైన పర్యావరణాన్ని అందించడం అందరి బాధ్యతని సంస్థ గుర్తుచేస్తున్నది.

రెండు రోజులపాటు ప్రదర్శన..


అందులో భాగంగానే ఈనెల 19, 20 తేదీల్లో ఎనర్జీ కన్జర్వేషన్ మిషన్-ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇంజినీర్స్ (ఇండియా) సంస్థ ఆధ్వర్యంలో ప్రదర్శనను నిర్వహించనున్నారు. కూల్, గ్రీన్ అండ్ పవర్ రూఫ్స్ అనే ప్రధానాంశాలపై ఈ ప్రదర్శనను ఏర్పాటు చేశారు. వినూత్నమైన సాంకేతిక ఉపకరణాలను ఇంటి పైకప్పులపై ఎలా నిర్మించి ఉపయోగించుకోవచ్చనే అంశాలపై నిపుణులైన ఇంజినీర్లు సందర్శకులకు వివరిస్తారు. పర్యావరణ పరిరక్షణ, సమా జ శ్రేయస్సు వంటి మహోన్నతమైన లక్ష్యాలనే ప్రాధాన్యంగా భావించే ఎనర్జీ కన్జర్వేషన్ మిషన్- ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇంజినీర్స్ ప్రజలను చైతన్యవంతులను చేయడాన్ని సామాజిక బాధ్యతగా ముందుకుసాగుతున్నది.

విశ్వేశ్వరయ్య భవన్‌లో కూల్, గ్రీన్ పవర్ రూఫ్ ప్రదర్శన


ది ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇంజినీర్స్ ఇండి యా తెలంగాణ స్టేట్ సెంటర్, ఎనర్జీ కన్జర్వేషన్ మిషన్ సంయుక్త ఆధ్వర్యంలో కూల్, గ్రీన్ పవర్ రూఫ్ అనే అంశంపై ఆదివారం విశ్వేశ్వరయ్య భవన్‌లో ప్రదర్శన నిర్వహిస్తున్నట్లు ఐఈఐ చైర్మన్ డాక్టర్ జి.రామేశ్వర్‌రావు తెలిపారు. ఖైరతాబాద్‌లోని విశ్వేశ్వరయ్యభవన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కార్యక్రమానికి సంబంధించిన బ్రోచర్లను ఎనర్జీ కన్జర్వేషన్ మిషన్ చైర్మన్ ఈ.శ్రీనివాసాచారి, కన్వీనర్ వై. భుజంగరావు, ఐఈఐ కార్యదర్శి టి.అంజయ్యతో కలిసి ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా రామేశ్వర్‌రావు మాట్లాడుతూ.. ప్రపంచ వ్యాప్తంగా ఉష్ణోగ్రత పెరుగుతున్న తరుణంలో ఇంటి పైకప్పులపై హరిత పందిళ్లు, సూర్య రష్మి ద్వారా విద్యుత్ ఉత్పత్తి కోసం సోలార్ ప్యానెల్‌లను ఏర్పాటు చేసుకోవాల్సిన ఆవశ్యకత ఏర్పడిందన్నారు. వాటి వినియోగం, ఉపయోగాలపై నేడు, రేపు రెండు రోజుల పాటు ఉదయం 10 నుంచి సాయంత్రం 7గంటల వరకు ప్రత్యేక ప్రదర్శన ఏర్పాటు చేస్తున్నామన్నారు. అలాగే సిరిధాన్యాలతో సంపూర్ణ ఆరోగ్యం అనే అం శంపై ఆదివారం ప్రముఖ శాస్త్రవేత్త డాక్టర్ ఖాదర్ వలీ నేతృత్వంలో అవగాహన సదస్సును ఏర్పాటు చేస్తున్నామన్నారు.

హరిత పందిళ్లు..(గ్రీన్ రూఫ్స్)


హరిత పందిళ్లలో భాగంగా ఇంటి పైకప్పుపై వివిధ రకాల కూరగాయలు, పూల మొక్కలను పెంచుకోవచ్చు. మరీ ఆసక్తి ఉన్నవారు చేపలను సైతం పెంచుకోవచ్చు. మొక్కలు వాతావరణంలోని వేడిని గ్రహించి, ఇంటిని సూర్యరశ్మి వల్ల అధికంగా వేడెక్కకుండా ఉంచుతాయి. హరిత పందిళ్లను ఏర్పాటు చేసుకోవడంతో ఇంట్లో నిత్యం వాడే కూరగాయల ఖర్చు తగ్గుతుంది. ఇంటి లోపలి భాగాన్ని చల్లబరిచేందుకు అవసరమయ్యే విద్యుత్ బిల్లు తగ్గుతుంది. ఇంటి వద్దనే ఆహ్లాద వాతావరణాన్ని, స్వచ్ఛమైన గాలిని ఆస్వాదించొచ్చు.

శక్తివంతమైన ఇంటి పైకప్పులు (పవర్ రూఫ్స్)


సూర్యరశ్మిని ఉపయోగించుకుని సోలార్ ప్యానల్స్ ద్వారా విద్యుత్, వేడి నీటిని తయారు చేసుకోవచ్చు. ఫలితంగా ఇంట్లో వినియోగించే విద్యుత్ గణనీయంగా తగ్గుతుంది. సూర్యరశ్మితో ఇంటిని అధిక వేడెక్కకుండా కాపాడుతుంది.

చల్లని పైకప్పులు..(కూల్ రూఫ్స్)


ఇంటిపై కప్పులను తెల్లని రంగు/పెంకులు, పలకలు(టైల్స్), పరద(షీట్స్)తో కప్పి వేయడంతో ఇంటిని సూర్యరశ్మి వల్ల అధికంగా వేడెక్కకుండా చూసుకోవచ్చు. ఈ చల్లని పైకప్పుల వల్ల ఇంటి లోపల చల్లబడేందుకు కావాల్సిన విద్యుత్ తగ్గుతుంది. వేసవిలోనూ సూర్యరశ్మి తగ్గి నివాసాలు సౌకర్యవంతంగా మారతాయి.

2364
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles