ప్రభుత్వ డిగ్రీ కాలేజీల్లో ఉచితంగా సివిల్స్ శిక్షణ

Sat,June 16, 2018 08:34 AM

Civils free training in Govt degree colleges

హైదరాబాద్ : తెలంగాణలో నూతన విద్యావిధానానికి రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ప్రభుత్వ విద్యా విధానంలో సమూల మార్పులు తీసుకురావాలని నిర్ణయించుకున్న రాష్ట్ర ప్రభుత్వం ఇకమీదట ప్రభుత్వ కాలేజీల్లోని విద్యార్థులకు చదువుతోపాటు ఉద్యోగ అర్హత పరీక్షలకు శిక్షణ ఇప్పించనున్నది. జాతీయ స్థాయిలో నిర్వహించే ఐఏఎస్, ఐపీఎస్ లాంటి సివిల్ సర్వీసెస్ ఉద్యోగ రాతపరీక్షలతోపాటు ఎంబీబీఎస్, ఐఐటీ, ఎన్‌ఐటీలలో ప్రవేశాల కోసం నిర్వహించే నీట్, ఐఐటీ-జేఈఈ వంటి ప్రవేశపరీక్షలపై గ్రామీణ, పేద విద్యార్థులకు పాఠశాల దశనుంచే అవగాహన కల్పించాలని సీఎం కేసీఆర్ సంకల్పించారు. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా సివిల్స్‌కు సిద్ధమవుతున్న ఎంతో మంది విద్యార్థులు లక్షల రూపాయలు చెల్లించి ఐఏఎస్ కోచింగ్ సెంటర్లలో శిక్షణ పొందుతున్నారు. అయితే గ్రామీణ ప్రాంతాలకు చెందిన నిరుపేదలకు అంత స్తోమత లేకపోవడంతో వారికి కూడా ఈ అవకాశాన్ని కల్పించాలని సీఎం కేసీఆర్ సంకల్పించారు. దీంతో అన్ని ప్రభుత్వ డిగ్రీ కాలేజీల్లోని విద్యార్థులందరికీ సివిల్స్‌లో శిక్షణ ఇచ్చేందుకు రాష్ట్ర కళాశాలల విద్య కమిషనరేట్ ప్రణాళికను రూపొందిస్తున్నది. దీనిని వచ్చే విద్యా సంవత్సరం నుంచి అమలుచేయాలని ఆ శాఖ నిర్ణయించింది.

ఈ నిర్ణయం వలన దాదాపు 50 వేల మంది విద్యార్థులకు ప్రయోజనం చేకూరుతుంది. రాష్ట్రంలోని 404 ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో చదువుతున్న విద్యార్థులకు కూడా నీట్, ఐఐటీ-జేఈఈ, ఎంసెట్ తదితర ప్రవేశ పరీక్షలకు ఉచితంగా శిక్షణ ఇప్పించాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీంతో రోజువారీ తరగతులతోపాటు ఈ ప్రవేశ పరీక్షలకు సంబంధించిన శిక్షణ తరగతులను కూడా నిర్వహించేందుకు ఇంటర్ బోర్డు ఇప్పటికే ప్రణాళికలు రూపొందించింది. ప్రస్తుత విద్యా సంవత్సరంలో దాదాపు రెండు లక్షల మంది విద్యార్థులకు ఈ శిక్షణ ఇవ్వనున్నారు. అలాగే రాష్ట్ర స్థాయిలో ప్రతిభావంతులైన విద్యార్థులకు ఎంపికచేసి, రెసిడెన్షియల్ తరహాలో ఇంటర్ తరగతులతోపాటు జాతీయ స్థాయి ప్రవేశ పరీక్షలకు శిక్షణ ఇవ్వాలని నిర్ణయించామని ఇంటర్ బోర్డు కార్యదర్శి ఏ అశోక్ వెల్లడించారు.

2549
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles