తెలంగాణలో నివసిస్తున్న ఏపీ ప్రజల జీవితాలతో ఆడుకోవద్దు!

Sun,March 24, 2019 11:04 AM

హైదరాబాద్‌: జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ అనుచిత వ్యాఖ్యలపై ప్రముఖ సినీ రచయిత చిన్నికృష్ణ మండిపడ్డారు. తెలంగాణ, ఆంధ్రా ప్రజల బంధం 70ఏళ్లుగా బలపడింది. మేమంతా ఇక్కడ హ్యాపీగా బతుకుతున్నామని మీడియా సమావేశంలో చిన్నికృష్ణ పేర్కొన్నారు. పవన్‌ వ్యాఖ్యలపై చిన్నికృష్ణ ఆగ్రహం వ్యక్తం చేశారు. పవన్‌ కల్యాణ్‌ అర్థం లేకుండా మాట్లాడుతున్నాడు. పవన్‌ నీ సిద్ధాంతమేంటో ముందే చెప్పాలి. మీ రాజకీయాల కోసం మా జీవితాలతో ఆడుకోవద్దు. నేను నోరు తెరిస్తే పవన్‌ కల్యాణ్‌ నవరంధ్రాలు మూసుకోవాల్సి వస్తుంది. రాజకీయమంటే త్రివిక్రమ్‌ రాసిన డైలాగులు అనుకుంటున్నావా? పవన్‌ ఒక్కడే కాదు.. నా కొడుకు కూడా ఆవేశంగా మాట్లాడుతాడు. పుష్కరాల్లో సినిమా షూటింగ్‌ చేసి ఆడపడుచుల ఉసురు పంచుకొని.. ఇప్పుడు పసుపు కుంకుమలు పంచుతున్నారని చిన్నికృష్ణ ఆరోపించారు.


కాపు కులస్థులకు మెగాస్టార్‌ ఫ్యామిలీ ప్రతినిధి కాదు. కేవలం మీ అందరి వల్లే.. ఆంధ్రప్రదేశ్‌కు వెళితే ఇప్పుడు ఇబ్బందిగా ఫీలవుతున్నాను. భారతదేశంలో అత్యుత్తమమైన సీఎం.. కేసీఆర్‌. అన్ని వర్గాల ప్రజలు తెలంగాణలో సంతోషంగా ఉన్నారు. ఉద్యమం సమయంలో కేసీఆర్‌ చెప్పినట్లుగానే ఆంధ్రా ప్రజలతో పాటు అన్ని రాష్ర్టాల ప్రజలను కడుపులో పెట్టుకొని చూసుకుంటున్నారు. రాజకీయాలు చేస్తున్నప్పుడు రాష్ట్రాలను విడదీయకండి. కేసీఆర్‌ రిటర్న్‌ గిఫ్ట్‌ ఇస్తానని చెప్పింది పవన్‌కు కాదు. రాజకీయాల పేరుతో తెలుగు రాష్ర్టాలను విడదీయవద్దు. తెలంగాణలో నివసిస్తున్న ఏపీ ప్రజల జీవితాలతో ఆడుకోవద్దు. పవన్‌ కల్యాణ్‌ మోసానికి ఎవరూ గురికావొద్దు. పవన్‌ కల్యాణ్‌కు రాజకీయ పరిజ్ఞానం లేదు. కాపులకు చిరంజీవి కుటుంబం ప్రతినిధులు కారు. కాపులకు వంగవీటి రంగా, ముద్రగడ పద్మనాభం ప్రతినిధులు. నేను కూడా కాపు బిడ్డనే.. పవన్‌ కల్యాణ్‌ జాగ్రత్తగా మాట్లాడండి.అని హెచ్చరించారు.

హైదరాబాద్‌లో మాకు ఏమైనా అయితే.. మీ అన్న నాగబాబు వచ్చి మమ్మల్ని కాపాడతాడా? ఎన్నో రికార్డ్స్‌ సృష్టించిన ఇంద్ర వంటి సినిమా ఇస్తే.. మీ అన్న చిరంజీవి కనీసం భోజనం కూడా పెట్టలేదు. చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ పెట్టి మోసం చేశారు.. కాంగ్రెస్‌లో కలిపారు. చిరంజీవి వెళ్లి తనకు ఓట్లు వేసినవారిని కలిశారా? వచ్చే ఎన్నికల్లో వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి కచ్చితంగా సీఎం అవుతారు. వైఎస్‌ జగన్‌ను ఒక్కడిని చేసి ఇబ్బందులు పెట్టాలని చూస్తున్నారు. ఇదే చంద్రబాబు.. బాబ్లీ ప్రాజెక్టు సమస్య వస్తే తేల్చుకోలేక, పరిష్కరించలేక పక్కన పడేస్తే తెలంగాణ సీఎం కేసీఆర్‌ మహారాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందం చేసుకొని ప్రాజెక్టులు నిర్మిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్‌లో ఫీజు రీయింబర్స్‌మెంట్‌ రాక అక్కడి విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారు. వారంతా హైదరాబాద్‌కు వచ్చి పనులు చేసుకుంటున్నారు. ఆరోగ్యశ్రీ పథకం సరిగ్గా అమలు చేయలేకపోవడంతో ఎంతోమంది పేదలు అవస్థలు పడుతున్నారని చిన్నికృష్ణ వివరించారు.

6372
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles