విలీనం మినహా మిగిలిన డిమాండ్లు పరిశీలించాలని ప్రభుత్వం నిర్ణయం

Tue,October 22, 2019 10:19 PM

హైదరాబాద్‌: ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలనే డిమాండ్‌ను కార్మిక సంఘాలు తమంతటా తాము వదులుకున్న నేపథ్యంలో ఇతర డిమాండ్లను పరిశీలించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. డిమాండ్లను పరిశీలించడానికి ఆర్టీసీ ఎండీ, ఈడీలతో కమిటీ నియమించింది. కమిటీ ఇచ్చిన నివేదిక ఆధారంగా హైకోర్టుకు నివేదిక సమర్పించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఆర్టీసీ సమ్మెపై హైకోర్టు ఆదేశాలిచ్చిన నేపథ్యంలో ఉన్నతాధికారులతో సీఎం కేసీఆర్‌ సమీక్ష నిర్వహించారు. ఆర్టీసీ సమ్మెతో ప్రజలు ఇబ్బంది పడకుండా చేసిన ప్రత్యామ్నాయ ఏర్పాట్లను ముఖ్యమంత్రి కేసీఆర్‌ అడిగి తెలుసుకున్నారు. తక్షణమే వెయ్యి బస్సులను అద్దెకు తీసుకోవడానికి నోటిఫికేషన్‌ ఇవ్వాలని సీఎం ఆదేశించారు. సమీక్షలో మంత్రి పువ్వాడ అజయ్ కుమార్, ముఖ్య కార్యదర్శులు సునీల్ శర్మ, నర్సింగ్ రావు, ప్రభుత్వ సలహాదారులు రాజీవ్ శర్మ, అనురాగ్ శర్మ, రవాణా కమిషనర్ సందీప్ సుల్తానియా, ఆర్టీసీ ఈడీలు పాల్గొన్నారు.


'ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తున్నట్లు ప్రకటిస్తేనే చర్చలు జరుపుతామని కార్మిక సంఘాల నాయకులు మొదట ప్రకటించారు. చట్ట వ్యతిరేకంగా జరుగుతున్న సమ్మెకు కాంగ్రెస్‌, బీజేపీలు మద్దతు పలకడం అనైతికం. తెలంగాణలో కార్మికులు చేస్తున్న డిమాండ్లను కాంగ్రెస్‌, బీజేపీ పాలిత రాష్ర్టాల్లో అమలు చేస్తున్నారా?. ఆర్టీసీ విషయంలో కాంగ్రెస్‌, బీజేపీ వాదనలు విచిత్రంగా ఉన్నాయి. రోడ్డు ట్రాన్స్‌పోర్టు కార్పొరేషన్‌ను, రూట్లను ప్రైవేటు పరం చేయడానికి రాష్ట్ర ప్రభుత్వాలకు పూర్తి అధికారం కల్పిస్తూ నరేంద్రమోదీ సర్కార్‌ చట్టం చేసింది. కేంద్రానికి వ్యతిరేకంగా రాష్ట్ర బీజేపీ నాయకులు మాట్లాడుతున్నారు. మధ్యప్రదేశ్‌లో దిగ్విజయ్‌సింగ్‌ సీఎంగా ఉన్నప్పుడే ఆర్టీసీని మూసేసింది. తెలంగాణ విషయంలో మాత్రం కాంగ్రెస్‌ విచిత్రంగా మాట్లాడుతోందని' ముఖ్యమంత్రి పేర్కొన్నారు.

'1950లో జవహర్ లాల్ నెహ్రూ ప్రధానిగా ఉన్నప్పుడు మోటార్ వెహికిల్ యాక్టును రూపొందించారు. దాని ప్రకారమే రాష్ట్రాల్లో ఆర్టీసీలు ఏర్పడ్డాయి. ఆర్టీసీ వాహనాలు నడిచే రూట్లలో ప్రైవేటు వాహనాలకు పర్మిట్లు ఇవ్వవద్దని కూడా ఆ చట్టంలో పేర్కొన్నారు. ఆ చట్టంలోని 3వ సెక్షన్ లో సవరణలు చేస్తూ నరేంద్ర మోడీ నాయకత్వంలోని బీజేపీ ప్రభుత్వం 2019 బడ్జెట్ సమావేశాల్లో సవరణ బిల్లు ఆమోదించి, చట్టం చేసింది. ‘మోటార్ వెహికిల్ (అమెండ్మెంట్) యాక్టు 2019’ పేరిట అమలవుతున్న చట్టంలో ఆర్టీసీలో ప్రైవేటు రంగానికి అవకాశం కల్పించాలని నిర్ణయించారు. ఆరోగ్యకరమైన పోటీని ప్రోత్సహించడానికి రాష్ట్ర ప్రభుత్వాలు అవసరమైన చర్యలు తీసుకోవాలని ఈ చట్టంలో పేర్కొన్నారు. ప్రజలకు మెరుగైన సౌకర్యం అందించడానికి, తక్కువ ధరల్లో ప్రయాణం సాగించడానికి పోటీ అనివార్యమని కూడా కేంద్రం పేర్కొంది. మొబైల్ రంగంలో, విమానయాన రంగంలో ప్రైవేటుకు అవకాశం కల్పించడం వల్ల ఆయా రంగాల్లో రేట్లు తగ్గాయని, సౌకర్యాలు పెరిగాయని కేంద్రం ప్రకటించింది. ప్రభుత్వ రంగ సంస్థల్లో పెట్టుబడులు ఉపసంహరించుకోవడం ద్వారా నిధులు సమకూర్చుకుంటామని కేంద్ర బడ్జెట్లోనే చెప్పారు. అలాంటిది బీజేపీ నాయకులు తెలంగాణలో మాత్రం ఆర్టీసీ విషయంలో విచిత్రమైన ఆరోపణలు చేస్తున్నారు’’ అని సీఎం కేసీఆర్ అన్నారు.

కేంద్రం తెచ్చిన చట్టాన్నే అమలు చేయడానికి తాము ప్రయత్నిస్తుంటే, స్థానిక బీజేపీ నాయకులు రాద్దాంతం చేస్తున్న విషయంపై ప్రధానికి, కేంద్ర ఉపరితల రవాణాశాఖ మంత్రికి లేఖ రాయాలనే విషయం కూడా సమీక్షలో చర్చకు వచ్చింది.

1812
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles