రేరా రిజిస్ట్రేషన్ చెక్ చేసుకోవాలి: దాన కిశోర్

Sat,February 23, 2019 12:51 PM

హైదరాబాద్: అపార్ట్‌మెంట్లలో ప్లాట్ కొనే ముందు అదేవిధంగా ఫ్లాట్లు కొనే ముందు రెరా రిజిస్ట్రేషన్ చెక్ చేసుకోవాల్సిందిగా వినియోగదారులకు జీహెచ్‌ఎంసీ కమిషనర్ దాన కిశోర్ తెలిపారు. ఇల్లు నిర్మాణ సందేహాలు-సమాధానాలు అన్న అంశంపై జీహెచ్‌ఎంసీ ప్రధాన కార్యాలయంలో నేడు అవగాహన సదస్సు జరిగింది. ఈ కార్యక్రమానికి జీహెచ్‌ఎంసీ కమిషనర్ దానకిషోర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ.. జీహెచ్‌ఎంసీ నిబంధనల ప్రకారం హైదరాబాద్‌లో ఇల్లు నిర్మించుకోవాల్సిన ఉంటుందన్నారు. ఇష్టం వచ్చినట్లుగా నిర్మాణాలు చేపడితే టౌన్ ప్లానింగ్ సమస్యలు వస్తాయన్నారు. అందుకే నేషనల్ బిల్లింగ్ కోడ్ ప్రకారం బల్దియా నిర్మాణ అనుమతులు ఇస్తుందన్నారు. ప్రమాదాలు, ఇబ్బందులు రాకుండా ఉండాలంటే భవన నిర్మాణాల్లో ప్రమాణాలు ఎంతో అవసరమని చెప్పారు. భవన నిర్మాణాలపై ఫిర్యాదులు ఎక్కువగా వస్తున్నాయి. పర్మిషన్‌కు మించి నిర్మాణాలు చేయడం మంచిది కాదు. మీరు ఇల్లు కట్టుకోవాలని, ఇల్లు కొనాలన్నా ఆసక్తి వ్యక్తీకరణ పత్రం ఇస్తే పూర్తి వివరాలు జీహెచ్‌ఎంసీ ఇస్తుందని తెలిపారు. అందుకోసం ప్రతి నెల ఇంటి నిర్మాణంలో, కొనుగోలు అంశంలో ప్రత్యేక అవగాహన కల్పిస్తామన్నారు. రేరా చట్టం ప్రకారం బిల్డర్స్ నిర్మాణానికి సంబంధించిన పూర్తి వివరాలను తెలియజేయాలన్నారు. బిల్డర్లు రేరాలో రిజిస్టర్ చేసుకోవాలని పేర్కొన్నారు. అలా అయితే కొనుగోలుదారులు మోసపోకుండా ఉంటారన్నారు. 500 చదరపు మీటర్లలోపు నిర్మాణం చేసుకునే వారికి.. 2 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలోని ఫ్లాట్ కొనుగోలు చేయాలనేవారికి ఈ అవగాహన ఉపయోగపడుతుందన్నారు.


జీవితకాలం కష్టపడి భూములు లేదా ఇల్లు కొంటారు. వాటికి సరైన అనుమతులు లేక తీవ్ర ఇబ్బందులు గురవుతున్నారు నగరవాసులు. అందుకే ఇలాంటి అవగాహన కార్యక్రమం చేపట్టాం. అక్రమ నిర్మాణాలపై కోర్టు కూడా సీరియస్‌గా ఉంది. అక్రమ నిర్మాణాలను ఉపేక్షించేది లేదు. టెక్నాలజీ ఉపయోగించి నిర్మాణం తీసుకున్న చోటే ఇల్లు నిర్మించారా? లేదా?. అనుమతి లేకుండా నిర్మాణాలు చేస్తే వాటిని కూలగొడతాం. 500 రకాల ఇళ్ల నిర్మాణం డిజైన్లు అందుబాటులో ఉంచుతాం. మీరు ఇంటి నిర్మాణం కోసం దరఖాస్తు చేసుకుంటే మీ పర్మిషన్ స్టేటస్ ఎలా ఉంది అనేది ఆయా కార్యాలయాల్లో తెలుసుకునేలా ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నాం. పర్మిషన్ ఇచ్చిన ప్రతి ఇంటిని మూడుసార్లు విజిట్ చేసి అధికారులు ధ్రువీకరణ చేస్తారు. ఆక్యుపెన్సీ సర్టిఫికెట్ లేని ఇళ్లకు నీళ్లు, విద్యుత్ బిల్లులు మూడింతలు వసూలు చేస్తారు. అపార్ట్‌మెంట్ కొనే ముందు రేరా రిజిస్ట్రేషన్ చెక్ చేసుకోండి. ప్లాట్లు అమ్ముతున్న ఏజెంట్‌కు కూడా రేరా రిజిస్ట్రేషన్ ఉండాలి. బ్రోచర్లలో ఉన్న ప్రతీ ఒక్క సదుపాయం కచ్చితంగా బిల్డర్ కల్పించాలి. బ్రోచర్లలో ఉన్న సదుపాయం కల్పించకపోతే రేరా చర్యలు తీసుకునే అవకాశం ఉందని కమిషనర్ పేర్కొన్నారు.

2819
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles