- వాటిపై నమ్మకంతో లక్షలు బదిలీ
- గిఫ్ట్ రాకపోవడంతో పోలీసులను ఆశ్రయిస్తున్న బాధితులు
- 30 రోజుల్లో అరకోటి మాయం..
- అప్రమత్తంగా ఉండాలంటున్న సైబరాబాద్ సైబర్ క్రైం పోలీసులు
హైదరాబాద్: మీకు గిఫ్ట్ పంపిస్తున్నాం.. అనగానే చాలా మంది విద్యావంతులకు ఏదో తెలియని అత్యాశ అవహిస్తుంది. కోట్లాది రూపాయలు, డైమండ్స్, ఖరీదైన సామగ్రి తమ చేతిలో పడిపోతుందని ఊహల సంబరంలో మునిగిపోతున్నారు. పంపిస్తున్న వ్యక్తి ఎవరు? నాకే ఎందుకు పంపిస్తున్నాడు? పంపించాల్సిన అవసరం ఏంటీ? తనకు ఇంత ఖరీదైన బహుమతులు పంపిస్తే అతనికి కలిగే లాభం ఏంటి.. అనే ప్రశ్నలు ఎదురు వేసుకోకుండా కేవలం మెయిల్స్, వాట్సాప్, వాట్సాప్ కాల్స్ ద్వారా మాట్లాడుకున్న మాటలకు, చేసిన చాటింగ్లకు బోల్తా పడి లక్షలాది రూపాయలను గుడ్డిగా మోసగాళ్ల చేతుల్లో పోస్తున్నారు. మరీ ఆశ కాకపోతే అప్పులు, రుణాలు తీసి కనిపించని వ్యక్తుల గిఫ్ట్‌ల ఆఫర్ల ముందు బొక్కాబొర్ల పడుతున్నారు.
గత నెల రోజుల్లో సైబరాబాద్ పోలీసు కమిషనరేట్ పరిధిలోని కొంత మంది అమాయక విద్యావంతులే ఇలాంటి ఆఫర్లకు చిక్కిపోయి అర కోటి రూపాయలను గల్లంతు చేసుకున్నారు. పోగొట్టుకున్న డబ్బును తలచుకుంటూ మానసిక గందరగోళానికి గురవుతున్నారు. ఆర్థిక నష్టాన్ని చేతుల్లారా నెత్తి మీద పెట్టుకుంటున్నారు. ఫిర్యాదుదారులను మీకు ఆఫర్ ఇచ్చిన వ్యక్తి పరిచయస్తుడా? అని ప్రశ్నిస్తే.. లేదు సార్ మెయిల్, వాట్సాప్, ఫేస్బుక్ ద్వారానే పరిచయమన్నారు. ఎలా నమ్మారని అడిగితే కనఫ్యూజ్ అయ్యామని బిక్కముఖం వేస్తున్నారు. బాధితుల ఫిర్యాదులను పరిశీలించిన సైబర్ క్రైం పోలీసులకు ఇది నైజీరియన్ మోసంగా తెలుస్తుంది. నగదు బదిలీ అయిన ఖాతాల పరిశీలన పనిలో పోలీసులు మునిగిపోయారు. ఒక వేళ బదిలీ అయిన ఖాతా విదేశాలకు సంబంధించింది అయితే ఆ డబ్బు బదిలీని తిరిగి రాబట్టడం సాధ్యం కాదని స్పష్టమవుతున్నది.
ఎయిర్‌పోర్టులో పరిచయం అయ్యాం..
ఓ సాఫ్ట్వేర్ ఉద్యోగినికి ఇటీవల మెయిల్ వచ్చింది. సార్ మీరు నన్ను గుర్తు పట్టరా. మనం ఫలానా విమానాశ్రయంలో కలిశాం. అప్పుడు మీరు నాకు కొంత నగదును సహాయం చేశారు... గుర్తుందా అంటూ మెయిల్లో వివరించారు. మీ సహాయాన్ని మరిచిపోను.. అందుకే మీకు నా తరఫున ఓ ఖరీదైన గిఫ్ట్‌ను పంపిస్తున్నానని తెలిపాడు. మీకు ఓకే అయితే నాకు రిైప్లె ఇవ్వండని చెప్పాడు. అసలు తాను ఎవరికి సహాయం చేశాను.. ఎక్కడ చేశాను అని ఆలోచించకుండా ఆమె గిఫ్ట్‌కు ఓకే అంది. అంతే రెండు రోజుల తర్వాత ఆమెకి మరో మెయిల్ వచ్చింది. మీకు విదేశాల నుంచి గిఫ్ట్ వచ్చింది. కస్టమ్స్ క్లియరెన్స్ చేయాలి.. మీరు మీ ధ్రువీకరణ పత్రాలతో పాటు ఫీజు చెల్లించాలని అడిగారు. అలా మొదటగా రూ.2.50 లక్షలను వేయించుకున్నారు. ఇలా పలు సర్టిఫికెట్ క్లియరెన్స్‌ల పేరుతో నాలుగు సార్లకు పైగా సాఫ్ట్వేర్ ఉద్యోగిని నుంచి రూ.10లక్షలకు పైగా గుంజేశారు. ఖరీదైన గిఫ్ట్ అనగానే ఎవరికీ చెప్పకుండా సొంత నిర్ణయం తీసుకుని రూ.10 లక్షలు వేసిన యువతి చివరకు మోసపోయానని గ్రహించి పోలీసుల సహాయాన్ని కోరింది.
వెబ్సైట్ ప్రొఫైల్ పరిచయంతో 14 లక్షలు లూటీ
ఓ సాఫ్ట్వేర్ సంస్థలో ఉద్యోగం చేస్తున్న యువకుడు తన వివాహానికి సంబంధించిన వ్యవహారంలో ఓ మ్యాట్రిమోని వెబ్సైట్లో నమోదు చేసుకున్నాడు. ఆ వెబ్సైట్లో సెర్చ్ చేయగా అతనికి ఓ ప్రొఫైల్ నచ్చింది. ఆ ప్రొఫైల్‌లో ఉన్న యువతి మెయిల్ ఐడీతోపాటు వాట్సాప్ నంబర్లో టచ్‌లోకి వెళ్లాడు. కొద్ది రోజులపాటు చాటింగ్ చేసుకున్నారు. అంతా సంతోషంగా గడిచింది. ఓ రోజు మన పరిచయానికి జ్ఞాపకంగా ఓ బహుమతిని పంపిస్తున్నానని వాట్సాప్ మెసేజ్ వచ్చింది. అంతే ఖుషిలో మునిగిపోయిన ఉద్యోగికి రెండు రోజుల తర్వాత ఢిల్లీ విమానాశ్రయం నుంచి ఫోన్ వచ్చింది. తాము కస్టమ్స్ అధికారులమంటూ ఫోన్లో పరిచయం చేసుకున్న వారు మీకు వచ్చిన గిఫ్ట్‌లో భారీగా విదేశీ కరెన్సీ ఉంది. ఇది చట్టరీత్యా నేరమని గదమాయించారు. అంతే ఉద్యోగికి చెమటలు పట్టాయి. ఇంతలోనే మిమ్మల్ని కాపాడాలంటే మాకు క్లియరెన్స్ సర్టిఫికెట్ కోసం ఫీజు కడితే సరిపోతుంది. మీకు కోట్లాది రూపాయల విలువ చేసే విదేశీ కరెన్సీని పంపిస్తామని చెప్పి నమ్మించేందుకు వాట్సాప్‌లో కూడా ఫొటోలు పెట్టారు. హమ్మయ్యా... అనుకున్న ఉద్యోగి వారు అడిగిన క్లియరెన్స్ ఫీజుల కోసం ఏకంగా రూ.14లక్షలు ఫోన్లో మాట్లాడిన వ్యక్తులు చెప్పిన ఖాతాల్లోకి పంపారు. కోట్లాది రూపాయలు గిఫ్ట్ ఇంకా రాకపోవడంతో అతనికి అంతా చీకటిగా మారింది. తనను ఆర్థిక సుడిగుండం నుంచి బయటపడేయాలని పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
ఫేస్బుక్ చాటింగ్‌తో గాలం..
మరో ఉద్యోగికి ఫేసుబుక్ చాటింగ్‌లో విదేశీ పౌరుడిగా చెప్పుకున్న వ్యక్తి పరిచయమయ్యాడు. ఆ చాటింగ్‌లో పెట్టే కామెంట్, పోస్టింగ్‌లతో ఇద్దరు మంచి స్నేహితులుగా మారారు. మనిషి కనిపించకపోయినా ఫేసుబుక్ చాటింగ్‌లోని రాతల మాటలతోనే ఎదుటి వ్యక్తిపై నమ్మకం పెంచుకున్నాడు. ఇంకేముందు అతను ఓ రోజు నా దగ్గర చాలా డబ్బుంది. సహాయం చేయాలనుకుంటున్నానని చెప్పి నీవే నా బెస్ట్ ఫ్రెండ్‌వు. నీకే ఓ ఖరీదైన గిఫ్ట్‌ను పంపిస్తున్నానని మిఠాయి తీపిని తలపించే మాటలను టైప్ చేశాడు. అయితే సరేననడంతో రెండు రోజులకు విమానాశ్రయం అధికారులమంటూ ఫోన్ అంతే.. క్లియరెన్స్‌ల పేరుతో రూ.10లక్షలకుపైగా దోచేశారు. కొద్ది రోజుల్లోనే కోటీశ్వరుడవుతానని కలలు కన్న ఉద్యోగికి గిఫ్ట్ ఇంకా రాకపోవడంతో కండ్ల ముందు చేసిన అప్పులు గిరగిరా తిరిగాయి. అంతే తనను మోసం చేశారని న్యాయం చేయమని పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేశాడు.
గిఫ్ట్‌లు వస్తున్నాయనగానే అంతా గప్‌చుప్..
గుర్తు తెలియని వ్యక్తుల నుంచి వస్తున్న ఆఫర్లకు బోల్తా పడుతున్న బాధితులు ఆశతో వారు జరుపుతున్న ఆర్థిక లావాదేవీలను అంతా గప్‌చుప్‌గా సాగిస్తున్నారు. తీరా మోసపోయాక పరేషాన్లో పడుతున్నారు. నెల రోజుల్లో మాకు ఐదు ఫిర్యాదులు అందాయి. ప్రతి ఫిర్యాదులు వారు రూ.10లక్షల పైనే మోసపోయామని పేర్కొనడం బాధాకరం. ఫోన్, ఫేస్బుక్, వాట్సాప్, మెయిల్స్ చాటింగ్‌లతోనే పరిచయమైన వ్యక్తులు గిఫ్ట్‌లు పంపిస్తామంటూ చెబితే అది మోసమని గ్రహించాలి. కస్టమ్స్ అధికారులమంటూ ఫోన్ వస్తే అది సైబర్ మాయగాళ్ల పనిగా అనుమానించాలి. మీ గిఫ్ట్‌లో విదేశీ కరెన్సీ అంటూ భయపెట్టించినా అది చీటింగ్ కింది భావించాలి. భయపడి వారి ఖా తాలో నగదును జమ చేయవ ద్దు. ఇలాంటి ఆఫర్లతో చాలా అప్రమత్తంగా ఉండాలి. వాటిపై ఒకటికి పదిసార్లు విచారించుకోవాలి. అత్యాశకు పోయి కోట్లాది రూపాయలు వస్తున్నాయనే ఊహలో గప్‌చుప్‌గా లక్షలాది రూపాయలను ఇతరుల ఖాతాలో వేయొద్దు. ఆ విషయాన్ని తెలిసిన వారితో చర్చించుకోవాలి. ఒక్కసారి సైబర్ మాయగాళ్ల ఖాతాలోకి నగదు బదిలీ అయితే వాటిని తిరిగి తీసుకురావడం చాలా కష్టం, అసాధ్యమని గుర్తుపెట్టుకోవాలి.
- రోహిణీ ప్రియదర్శిని, డీసీపీ సైబరాబాద్ సైబర్ క్రైం