HomeLATEST NEWSCheating cyber cheaters

భారీ ప్యాకేజీలతో నియామకాలు..నిరుద్యోగులే లక్ష్యంగా..

Published: Fri,November 2, 2018 07:38 AM
  Increase Font Size Reset Font Size decrease Font size   

హైదరాబాద్ : రాత్రిపూట వీధుల్లో తిరుగుతూ తాళం వేసిన ఇండ్లను వెతకాల్సిన పనిలేదు.. దొంగతనం చేస్తుంటే పట్టుబడుతామనే జంకు లేదు.. ఇప్పుడు పాత తరం దొంగతనాలు తగ్గుముఖం పట్టాయి. ఒకే ఒక్క ఫోన్ కాల్‌తో లక్షల రూపాయలు సైబర్‌చీటర్లు మోసం చేస్తున్నారు. కేవలం నమ్మకం, ఆశను కల్పించే వాక్ చాతుర్యంతో మోసం చేస్తున్నారు. మోసాలలో టార్గెట్లు పూర్తి చేస్తే వారికి భారీ ఎత్తున ఆయా సంస్థలు ఇన్సెటింవ్‌లు ఇస్తున్నాయి. కాల్‌సెంటర్లను ఏర్పాటు చేసుకొని ఇప్పుడు భారీస్థాయిలో ఢిల్లీ, ముంబయికి చెందిన సైబర్‌నేరగాళ్లు చెలరేగి పోతున్నారు. దేశవ్యాప్తంగా అనేకమందికి ఫోన్లు చేస్తూ కోట్ల రూపాయలను కొల్లగొడుతున్నారు. ఇలాంటి ముఠాలపై హైదరాబాద్ సీసీఎస్ సైబర్‌క్రైమ్ పోలీసులు ప్రత్యేక నిఘాపెడుతూ, ఢిల్లీలోని సైబర్‌చీటర్ల ఆటకట్టిస్తున్నారు. ఒక ముఠా పట్టుబడగానే మరో ముఠా రంగంలోకి దిగుతున్నది. ఈ కాల్‌సెంటర్లలో పనిచేసే వారే మరో కొత్త సంస్థను ఏర్పాటు చేస్తూ అమాయకులను నిండా ముంచేస్తున్నారు.

వేలాది జీతాలు..లక్షలాది ప్రోత్సాహకాలు : కాల్‌సెంటర్లను ఏర్పాటు చేస్తున్న ముఠాలు కంపెనీల పేరుతో కార్యాలయాలు ఢిల్లీ, నోయిడా, ముంబయి, కోల్‌కత్త వంటి ప్రాంతాల్లో ప్రారంభిస్తున్నారు. దేశవ్యాప్తంగా చాలామంది నిరుద్యోగులు ఉద్యోగాల కోసం ఇంటర్‌నెట్‌పై ఆధారపడుతూ జాబ్‌పోర్టల్స్‌లో తమ రెజ్యూమ్స్‌ను ఆప్‌లోడ్ చేస్తూ నిరంతరం ఉద్యోగ వేటలో ఉంటారు. ఇలాంటి వారినే సైబర్ నేరగాళ్లు లక్ష్యంగా చేసుకుంటున్నారు. నిరుద్యోగులు ఏ ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్నారనే విషయాన్ని గుర్తించి.. అలాంటిదే ఉద్యోగం ఉదంటూ నమ్మిస్తున్నారు. ఇలా వారి నుంచి ప్రాసెసింగ్ ఫీజంటూ రూ.2 వేల నుంచి రూ.5 వేల వరకు వసూలు చేస్తున్నారు. తరువాత డమ్మీ ఇంటర్వ్యూ పెట్టి సెలక్ట్ అయ్యావంటూ..వేల రూపాయలు దోచేస్తున్నారు. అదే విదేశాల్లో ఉద్యోగాలంటే ఇక లక్షల్లో దోపిడీ ఉంటుంది. ఇలా కాల్‌సెంటర్‌లో పనిచేసే ఉద్యోగులు రోజుకు కనీసం 5 గురినైనా మోసం చేయాలనే నిబంధనను ఆయా కాల్‌సెంటర్ నిర్వాహకులు పెడుతున్నారు. అందులో మాట్లాడే ఉద్యోగి..ఉద్యోగం కావాల్సిన వారి మధ్య జరిగే సంభాషణలు బట్టి డబ్బు వసూలవుతుంది. ఏదైనా అనుమానం వస్తే వెంటనే కాల్‌సెంటర్ ఉద్యోగి, తన టీమ్ లీడర్‌తో మాట్లాడంటూ వాళ్ల బాస్‌లతో మాట్లాడిస్తున్నారు. నెలకు రూ.10 వేల నుంచి రూ.15 వేల జీతం ఉంటే..నిరుద్యోగికి మాయమాటలు చెప్పి దోచేసే మొత్తం నుంచి 10శాతం వాటా ఉద్యోగులకు ఆయా సంస్థల నిర్వాహకులు ఇస్తున్నారు.

ఇలా సైబర్‌నేరాలు చేయడానికి ఆయా సంస్థలు నిర్వాహకులు ఇచ్చే అఫర్లకు అక్కడి ఉద్యోగుల నుంచి మంచి స్పందన ఉంటుందని పోలీసుల విచారణలో తేటతెల్లమవుతున్నది.
ఢిల్లీ కాల్ సెంటర్లపై సైబర్‌క్రైమ్ పోలీసుల దాడులు : ప్రతి రెండుమూడు నెలలకోసారైనా సీసీఎస్ సైబర్‌క్రైమ్ పోలీసులు ఢిల్లీలో ఇలాంటి సైబర్ నేరాలకు పాల్పడే కాల్‌సెంటర్లపై దాడులు నిర్వహిస్తున్నారు. గతనెలలో ఒక ఫిర్యాదుపై దర్యాప్తు చేపట్టిన హైదరాబాద్ సైబర్‌క్రైమ్ పోలీసులు ఢిల్లీకి వెళ్లారు. షైన్‌క్యారీర్.ఓఆర్‌జీ.ఇన్ నుంచి మాట్లాడుతున్నామని కెనడాతోపాటు మల్టీనేషనల్ కంపెనీలు, ఇతర దేశాల్లో ఉద్యోగాలున్నాయంటూ నమ్మిస్తూ ఈ ముఠా దేశవ్యాప్తంగా భారీ ఎత్తున మోసాలకు పాల్పడుతున్నట్లు దర్యాప్తులో వెల్లడయ్యింది. ఈ ముఠా మోసాలను పూర్తిస్థాయిలో దర్యాప్తు చేసిన సైబర్‌క్రైమ్ పోలీసులు ఈ కాల్‌సెంటర్‌పై దాడిచేసి నిర్వాహకులైన సుమంత్ భరద్వాజ్, ప్రదీప్‌గుప్త, సునీల్ రాణాలను అరెస్ట్ చేసి, అందులో పనిచేస్తున్న 19 మంది టెలీకాలర్స్‌కు సీఆర్‌పీ41 కింద నోటీసులు జారీ చేశారు.

డబ్బుల ప్రస్తావన ఉందంటే..నమ్మకండి:రఘువీర్, అదనపు డీసీపీ, సైబర్‌క్రైమ్స్, హైదరాబాద్
ఉద్యోగాలు కష్టపడితేనే వస్తాయి. ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థలు ఉద్యోగాలిచ్చే సమయంలో అభ్యర్థుల నుంచి ఎలాంటి రుసుములు తీసుకోరు. ఉద్యోగం కోసం డబ్బుల ప్రస్తావన వచ్చిందంటే మోసం జరుగుతుందని తప్పనిసరిగా అనుమానించండి. కన్సల్టెన్సీలు ఉద్యోగాలు ఇప్పిస్తాయి. ముందుగా డబ్బులు వసూలు చేయవు. నిరుద్యోగులు జాగ్రత్తగా ఉంటూ..సైబర్ నేరగాళ్ల చేతిలో చిక్కి మోసపోవద్దు.

3257
Tags

More News

NATIONAL-INTERNATIONAL

SPORTS

Health

Technology