ఫంక్షన్ హాల్‌లో వరుడు ఆత్మహత్య

Mon,November 11, 2019 06:52 AM

హైదరాబాద్ : నగర శివారులో వరుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన అందరినీ కంటతడి పెట్టించింది. వరుడు, వధువు కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు. స్థానికుల వివరాల ప్రకారం... దిల్‌సుఖ్‌నగర్ లలితానగర్‌కు చెందిన నక్కెర్తి శ్రీనివాస్‌చారి, దివంగత పద్మజారాణి దంపతులకు ఎన్‌ఎస్ సందీప్(24) ఒక్కడే కుమారుడు. గత 16 సంవత్సరాల క్రితం తల్లి మృతి చెందిన వెంటనే తండ్రి మరో వివాహం చేసుకోవడంతో సందీప్ సరూర్‌నగర్‌లోని అమ్మమ్మ తాతలైన వసంత, జంగేశ్వరరావుల వద్ద ఉంటూ బీటెక్ పూర్తి చేశాడు. అప్పుడప్పుడు మలక్‌పేటలోని చిన్నమ్మ, చిన్నాన్న భారతి, బ్రహ్మచారిల వద్దకు మాత్రమే వెళ్లేవాడు.


బీటెక్ పూర్తి చేసిన సందీప్ ప్రైవేట్ జాబ్ చేస్తూ మరో జాబ్ కోసం అన్వేషిస్తున్నాడు. పెండ్లి ఇష్టంలేకపోయినా కుటుంబ సభ్యులు పెండ్లి చేస్తున్నారని నిత్యం కుంగిపోయేవాడని స్థానికులు తెలియజేస్తున్నారు. ఇదిలా ఉండగా ఆదివారం ఉదయం 11 గంటలకు వివాహం జరుగాల్సి ఉండగా 4 గంటల ముందు వరుడు ఆత్మహత్య చేసుకోవడం వరుడు, వధువు ఇండ్లలో విషాదం నింపింది. సందీప్ ఒకే కుమారుడు కావడంతో ఆ తండ్రి పడుతున్న ఇబ్బందులు వర్ణనాతీతం.

ఇకపోతే కాసేపైతే పెండ్లి పీటలెక్కాల్సిన వధువు పరిస్థితి దారుణమైంది. ఆమెతో పాటు కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు. ఇదిలా ఉండగా సందీప్ మృతికి ఆర్థికపరమైన ఇబ్బందులు ఉన్నట్లు తెలుస్తోంది. తల్లి లేకపోవడం, ఇటీవలే తాత చనిపోవడంతో పాటు బంధువుల నుంచి వేధింపులకు మనోవేదనకు గురయ్యాడని సమాచారం. ఇద్దరు అత్తలతో పాటు వారి ఇద్దరు కుమారులే సందీప్ మృతికి కారణమై ఉండొచ్చని తండ్రి ఇచ్చిన ఫిర్యాదుతో ఆ కుటుంబంలో మరిన్ని కలతలు వచ్చే అవకాశాలున్నాయి.

34004
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles