ఇంటిపై వాలుతున్న గద్దలు.. పెరిగిపోతున్న బ్లాక్‌మెయిల్‌ రాయుళ్లు..!

Sun,May 19, 2019 12:11 PM

blackmailing gang hulchul in construction field in hyderabad

హైదరాబాద్: నగరంలో ఇంటి నిర్మాణ నిబంధనలు గ్రేటర్ ఏర్పాటు నుంచి కొంత కఠినంగా మారాయి. గతంలో నిబంధనలు ఉన్నప్పటికీ వాటి అమలు అంతంతమాత్రంగానే ఉండేది. అనుమతులు తీసుకుంటే చాలు, నిబంధనలు పెద్దగా పట్టించుకునేవారు కాదు. అధికారులు కూడా చూసీచూడనట్లు వ్యవహరించేవారు. గ్రేటర్‌లో విలీనమైన శివారు ప్రాంతాల్లోనైతే పరిస్థితి ఇంకా అధ్వానంగా ఉండేది. దీంతో గతంలో అందరూ తమకు ఎంత జాగా ఉంటే అంత తమకు అనుకూలంగా ఇళ్లను నిర్మించుకునేవారు. దీంతో గతంలో నిర్మించుకున్న ఇళ్లలో నూటికి నూరుశాతం సెట్‌బ్యాక్‌లతో నిర్మించుకున్న ఇళ్లు పెద్దగాలేవనే చెప్పవచ్చు. అటువంటివాటిని క్రమబద్ధీకరించుకునేందుకు గతంలో ఒకటి-రెండు సార్లు అవకాశం ఇచ్చినప్పటికీ చాలామంది నిర్లక్ష్యం వహించారు. కొందరు క్రమబద్ధీకరణకు ముందుకొచ్చినప్పటికీ అవినీతి అధికారులు దరఖాస్తుల్లో కొర్రీలు వేసి వాటిని తిరస్కరించారు. దీంతో చాలా ఇళ్లు క్రమబద్ధీకరణకు నోచుకోలేదు. రాష్ట్ర ఏర్పాటు అనంతరం ప్రభుత్వం క్రమబద్ధ్దీకరణ పథకాన్ని ప్రవేశపెట్టినప్పటికీ కొందరు కోర్టులో సవాల్‌ చేసి అడ్డుకున్నారు. దీంతో క్రమబద్ధీకరణ పథకం ముందుకు సాగడంలేదు. ఫలితంగా నగరంలో డీవియేషన్లతో కూడిన నిర్మాణాలు లక్షల సంఖ్యలో ఉన్నాయి. ఇటువంటి ఇళ్ల యజమానులు ఇప్పుడు అదనపు అంతస్తు నిర్మించుకోవాలంటే అనుమతులు రావడంలేదు. నిబంధనల పేరుతో అధికారులు లంచాలు వసూలుచేస్తున్నారు.

నిర్మాణ ఖర్చుకన్నా ఇలా అమ్యామ్యాల ఖర్చే తడిసి మోపెడవుతుంది. ఉదాహరణకు, ఖైరతాబాద్ ప్రాంతంలో ఓ వ్యక్తి గతంలో తన 200గజాల ఇంటికి రెండు అంతస్తుల అనుమతులు పొంది ఇల్లు నిర్మించుకున్నాడు. తాజాగా అతను మరో అంతస్తు నిర్మించుకోవాలంటే కింది అంతస్తుల్లో డీవియేషన్లు ఉన్నాయంటూ బల్దియా అధికారులు నిర్మాణ అనుమతిని నిరాకరించారు. అంతేకాదు, పాత ఇళ్లకు అనుమతులు రావని, ప్రస్తుతం దాన్ని క్రమబద్ధీకరించుకునే అవకాశం కూడా లేదని చెప్పారు. కిందిస్థాయిలో అధికారులను మ్యానేజ్ చేసుకొని అక్రమ నిర్మాణం చేసుకోవాలని అక్కడి టౌన్‌ప్లానిగ్ కిందిస్థాయి సిబ్బంది వారికి ఉచిత సలహా ఇచ్చారు. ఇక్కడే అసలు కథ మొదలైంది.

నిర్మాణం ఖర్చు 7.5 లక్షలు, పంపకాల ఖర్చు రూ.9 లక్షలు


సదరు ఇంటి యజమాని టౌన్‌ప్లానింగ్ సెక్షన్ అధికారిని కలవగా, అతను తనతోపాటు తనపై అధికారికి కలిపి రూ. 1.5 లక్షలు డిమాండ్ చేశారు. అంతేకాదు, ఫిర్యాదు రాకుండా చూసుకోవాలని, ఎవరైనా ఉన్నతాధికారులకు ఫిర్యాదుచేస్తే నిర్మాణాన్ని కూల్చడం మినహా తానేమీ చేయలేనని సదరు అధికారి పేర్కొనడం విశేషం. దీంతో టౌన్‌ప్లానిగ్ కిందిస్థాయి సిబ్బంది మళ్లీ రంగంలోకి దిగాడు. ముందుగా ఇంటి ఇరుగు, పొరుగు వారిని ఫిర్యాదుచేయకుండా చూసుకోవాలని, అనంతరం కార్పొరేటర్, ఓడిపోయిన కార్పొరేటర్, ఓ కుల సంఘం నేత, బస్తీ నాయకుడు, మీడియాని చూసుకోవాలని చెప్పాడు. కార్పొరేటర్‌కు రూ. రెండు లక్షలు, ఓడిపోయిన కార్పొరేటర్‌కు రూ. ఒక లక్ష, కుల సంఘం నాయకుడికి రూ. 50వేల నుంచి రూ. ఒక లక్ష, ఇరుగు, పొరుగును ఒప్పించేందుకు చెరో లక్ష, మీడియాకు మరో లక్ష చొప్పున మాట్లాడుకోవాలని సూచించాడు. వీరు కాకుండా తనకు రూ. 50వేలు ఇవ్వాలన్నారు. ఒక్కోసారి ప్రజాప్రతినిధుల అనుచరులమంటూ కొందరు వస్తారని, వారిని కూడా చూసుకోవాల్సి ఉంటుందన్నాడు. మొత్తం లెక్కిస్తే పంపకాల ఖర్చు రూ. తొమ్మిది లక్షలకు చేరింది. అతను తన 200 గజాల స్థలంపై స్లాబు ఏర్పాటుచేసుకునేందుకు కాంట్రాక్టర్ రూ. ఏడున్నర లక్షలు తీసుకుంటుండగా, పంపకాల ఖర్చు రూ. తొమ్మిది లక్షలకు చేరినట్లు సదరు యజమాని లబోదిబోమంటున్నాడు.

పంపకాల వ్యయం అనుమతి ఫీజుకన్నా.. 20 రెట్లు అధికం


నిబంధనల ప్రకారం 200 గజాల ఇంటిపై మరో అంతస్తు నిర్మించుకునేందుకు అనుమతి తీసుకోవాలంటే పర్మిట్ ఫీజు, బెటర్‌మెంట్ చార్జీలు కలిపి రూ. 30 వేల నుంచి రూ. 50వేల మధ్య అవుతుంది. కాగా, నిబంధనల పేరుతో అనుమతులు నిరాకరించడం మూలంగా రూ. తొమ్మిది లక్షల వరకు అమ్యామ్యాలు ముట్టజెప్పాల్సిన పరిస్థితి ఏర్పడింది. తనకు అనుమతి మంజూరు చేస్తే ఎంత ఫీజైనా చెల్లించేందుకు సిద్ధంగా ఉన్నట్లు, నిబంధనల ముసుగులో అనుమతులు నిరాకరిస్తూ, పరోక్షంగా అక్రమాలను ప్రోత్సహిస్తున్నారని వాపోయాడు. తాను ఎంతమందికి మామూళ్లు ఇవ్వాలని, అసలు తాను ఏమి నేరం చేశానని ఇంతమందికి అమ్యామ్యాలు సమర్పించాలని అతను ప్రశ్నిస్తున్నారు. గతంలో ఇల్లు నిర్మించినప్పుడు నిబంధనలపై పెద్దగా పట్టింపులేదని, దీంతో తన పూర్వీకులు వాస్తు ప్రకారం తమకు అనుకూలంగా నిర్మించుకున్నారని చెప్పారు. కాగా, అప్పట్లో వారు చేసిన డీవియేషన్లకు ఇప్పుడు ఏ పాపం తెలియని తాము మూల్యం చెల్లించుకోవాల్సి వస్తోందని పేర్కొన్నారు.

ఉన్న ఇల్లు కూల్చితేనే నిర్మాణ అనుమతి


నిబంధనల ప్రకారం అనుమతులు తీసుకొని పై అంతస్తు నిర్మించుకోవాలంటే ప్రస్తుతమున్న ఇంటిని కూల్చక తప్పదు. డీవియేషన్లు ఉన్నందున కొత్తగా పైఅంతస్తు నిర్మించుకునేదుకు అనుమతులు ఇవ్వలేమని అధికారులు చేతులెత్తేశారు. ప్రస్తుతమున్నదాన్ని కూల్చాలంటే ఎంతలేదన్నా తనకు రూ. 20లక్షల నష్టం జరుగుతుందని, ఇప్పుడున్నదానిపై మరో అం తస్తు నిర్మించుకుంటే అనుమతి ఫీజుకన్నా దాదాపు 20రెట్లు అధికంగా అమ్యామ్యాలు పంచాల్సివస్త్తుందని సదరు వ్యక్తి తన గోడును వినిపించాడు. ఇంటి నిర్మాణానికి నిబంధనలనే అడ్డుగా మారినట్లు, నిర్మాణమంటే నేరం చేసినట్లుగా భావించాల్సివస్తోందని వాపోయాడు.

4004
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles