బీజేపీ సీనియర్ నేత బద్దం బాల్‌రెడ్డి కన్నుమూత

Sat,February 23, 2019 06:43 PM

BJP senior leader baddam bal reddy is no more

హైదరాబాద్: బీజేపీ సీనియర్ నేత, కార్వాన్ మాజీ ఎమ్మెల్యే బద్దం బాల్‌రెడ్డి(73) కన్నుమూశారు. బంజారాహిల్స్‌లోని కేర్ ఆసుపత్రిలో ఆయన చికిత్స పొందుతూ మృతి చెందారు. ఈనెల 10 నుంచి ఆయనకు ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. బాల్‌రెడ్డి గత కొంతకాలంగా క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్నారు. ఈనేపథ్యంలో ఆయన కేర్ ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నారు. బాల్‌రెడ్డి భౌతికకాయాన్ని బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 12లో ఉన్న ఆయన నివాసానికి తరలించారు. రేపు సాయంత్రం 5 గంటలకు జూబ్లీహిల్స్‌లోని మహాప్రస్థానంలో బాల్‌రెడ్డి అంత్యక్రియలు జరగనున్నాయి.

రేపు మధ్యాహ్నం 2 గంటల వరకు బాల్‌రెడ్డి భౌతికకాయాన్ని తన స్వగృహంలో ఉంచనున్నారు. అనంతరం బీజేపీ కార్యాలయానికి తరలించనున్నారు. కార్యకర్తల కడచూపు కోసం బీజేపీ కార్యాలయంలో సాయంత్రం వరకు బాల్ రెడ్డి భౌతికకాయాన్ని ఉంచుతారు. బీజేపీ కార్యాలయం నుంచి మహాప్రస్థానం వరకు ఆయన అంతిమ యాత్ర కొనసాగనుంది. సాయంత్రం మహాప్రస్థానంలో బాల్ రెడ్డి అంత్యక్రియలను ఆయన కుటుంబ సభ్యులు నిర్వహిస్తారు.

సీఎం కేసీఆర్ సంతాపం


బద్దం బాల్‌రెడ్డి మృతి పట్ల సీఎం కేసీఆర్ సంతాపం ప్రకటించారు. బాల్‌రెడ్డి కుటుంబ సభ్యులకు సీఎం కేసీఆర్ ప్రగాఢ సానుభూతి తెలిపారు. ప్రజా జీవితంలో బాల్‌రెడ్డి చేసిన సేవలను సీఎం ఈసందర్భంగా కొనియాడారు.

బాల్‌రెడ్డి రాజకీయ ప్రస్థానం


1945 మార్చి 7న బాల్‌రెడ్డి పాతబస్తీలోని అలియబాద్‌లో జన్మించారు. ఆయనకు నలుగురు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. 1962లో బద్దం.. జనసంఘ్‌లో చేరారు. బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా పనిచేశారు. పాతబస్తీలోని అలియబాద్‌లో 55 ఏళ్లు నివాసమున్నారు. 2000 సంవత్సరంలో బాల్‌రెడ్డి బంజారాహిల్స్‌కు తన నివాసాన్ని మార్చారు. 1985, 1989, 1994లో వరుసగా మూడు సార్లు కార్వాన్ ఎమ్మెల్యేగా బాల్‌రెడ్డి గెలుపొందారు.

1820
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles