సైబర్ నేరాల్లో బ్యాంకు ఖాతాలే కీలకం!

Sat,August 18, 2018 07:51 AM

Bank accounts main role in cyber crime

హైదరాబాద్ : తార్నాకలో ఉండే ఒక రిటైర్డు ప్రభుత్వ ఉద్యోగిని.. ఉద్యోగం కోసం ఇంటర్‌నెట్‌లో వెతుకుతున్నది.. ఈ క్రమంలో ఉద్యోగం ఉందం టూ సైబర్‌చీటర్లు ఆమెకు ఫోన్ చేసి.. రిజిస్ట్రేషన్ ఫీజం టూ వల వేశారు.. సైబర్‌చీటర్ల బుట్టలో పడిపోవడంతో.. నెమ్మదిగా ఆమెకు వివిధ రకాలైన ఫీజులంటూ రూ. 1.50 లక్షల వరకు కాజేశారు.. బాధితురాలి ఫిర్యాదుతో సైబర్‌క్రైమ్ పోలీసులు ఆమె డబ్బులు డిపాజిట్ చేసిన బ్యాంకు ఖాతాల ఆధారంగా దర్యాప్తు చేపట్టారు. ఇందులో భాగంగా దర్యాప్తులోని ఒక బృందం మధ్యప్రదేశ్ బోఫాల్ నుంచి సుమారు 300 కిలోమీటర్ల దూరంలో ఉండే ఒక కుగ్రామంలో ఉన్న బ్యాం కుకు వెళ్లి అక్కడ ఖాతాదారుడి చిరునామాను తీసుకున్నారు. ఆ ఖాతాకు అనుసంధానమైన సెల్‌ఫోన్ నంబ ర్ భోపాల్‌కు మరో వైపు 300 కిలోమీటర్ల దూరంలో ఉండే గ్రామానికి చెందిన చిరునామ చూపించడంతో అక్కడకు మరో బృందం వెళ్లింది.

ఇంత దూరం వెళ్లినా ఫోన్ వాడుతున్న వ్యక్తి మరొకరు ఉండడం, బ్యాంకు ఖాతా ఉపయోగిస్తున్న వ్యక్తి ఆ ఖాతాను ఇతరులకు రూ. 4 వేల కమీషన్ తీసుకొని ఇచ్చేసినట్లు పోలీసులు గుర్తించారు. అంటే సైబర్‌నేరగాళ్లు తెలివిగా అమాయకులను బురిడీ కొట్టించి.. పోలీసుల దర్యాప్తును కూడా తప్పుదోవ పట్టిస్తున్నారు. నేరం చేసే వారు... ఆధారాలు దొరకకుండా జాగ్రత్తలు పడుతూ.. ఒక ప్రాంతం చిరునామాతో ఫోన్.. మరో కుగ్రామానికి చెందిన బ్యాంకు ఖాతాను బాధితులకు ఇస్తూ.. డబ్బులను అందులో డిపాజిట్ చేయిస్తున్నారు. సైబర్‌నేరగాళ్లు అంత తెలివిగా మోసం చేస్తుంటే.. బాధితులు అంతే అమాయకంగా మోసపోతున్నారు. కనీసం ఆ బ్యాంకు ఖాతా ఎక్కడిది.. ఫోన్ చేస్తున్న వాళ్లు ఎక్కడి వాళ్లు అనే విషయాన్ని కూడా పరిగణలోకి తీసుకోకుండా గుడ్డిగా బ్యాంకు ఖాతాల్లో డబ్బు డిపాజిట్ చేయడం, నగదు బదిలీ చేయడం చేస్తున్నారు.

కుగ్రామాల నుంచి ఖాతాల సేకరణ
మాయమాటలతో అమాయకులను నమ్మించి డబ్బు లు దోచేస్తున్న సైబర్‌నేరగాళ్లకు వివిధ రాష్ర్టాల్లోని మారుమూల పల్లెల్లో ఉన్న బ్యాంకు ఖాతాలే కీలక ఆదాయ మార్గాలుగా మారాయి. ఒకప్పుడు పట్టణాల్లో ఉండే వారి బ్యాంకు ఖాతాలపైనే ఆధారపడ్డ సైబర్‌చీటర్లు.. మరో అడుగు ముందుకేశారు. మారుమూలలో ఉండే పల్లెలు, కుగ్రామాలకు చెందిన వారి బ్యాంకు ఖాతాలను కమీషన్ పద్ధతిలో తీసుకుంటున్నారు. బ్యాంకు ఖాతాలు మారుమూల పల్లెల్లోనే ఉంటున్నా... అందు లో డిపాజిట్ అయ్యే డబ్బులు మాత్రం ప్రధాన పట్టణాల్లోనే విత్‌డ్రా జరుగుతున్నాయి. బ్యాంకు ఖాతాలు, సెల్‌ఫోన్ నంబర్ల ఆధారంగానే సైబర్‌నేరస్తులను పట్టుకుంటున్న సైబర్‌క్రైమ్ పోలీసులు మాత్రం ఆయా బ్యాంకు ఖాతా దారులను గుర్తించి, పట్టుకోవడం కోసం కొన్ని వేల కిలోమీటర్ల దూరం వెళ్తున్నారు. అయినా అప్పటికే కొందరు చిరునామాలు మార్చడం.. బ్యాంకు ఖాతా తెరిచే సమయంలో ఇచ్చిన చిరునామాలు మారడం, కొన్ని సందర్భాల్లో నకిలీవయి ఉండడం వంటి సంఘటనలు పోలీసుల విచారణలో ఎదురవుతున్నాయి. డెబిట్, క్రెడిట్ కార్డులను అప్‌డేట్ చేస్తామంటూ నమ్మించి బ్యాంకు ఖాతాల్లోని నగదు ఇతర ఖాతాల్లోకి బదిలీ చేసుకోవడం, ఉద్యోగాల పేరుతో నిరుద్యోగులకు వల వేసి డబ్బులు వసూలు చే యడంలో భాగంగా వివిధ బ్యాంకు ఖాతాలను ఇవ్వ డం, లాటరీ తగిలిందని.. ఆ డబ్బు డ్రా చేసుకోవడం కోసం సర్వీస్ చార్జీలంటూ లక్షల్లో దోచేయడం.. మ్యారేజీల పేరుతో నమ్మించి మోసం చేయడం ఇలా.. డబ్బు లావాదేవీలకు సైబర్‌నేరస్తులు ఇతరుల బ్యాంకు ఖాతాలపైనే ఆధారపడి ఉంటున్నారు. కేంద్ర ప్రభుత్వం జన్‌ధన్ పథకంతో బ్యాంకు ఖాతాలను ప్రతి ఒక్కరికి ఉం డాలనే లక్ష్యంతో బ్యాంకు ఖాతాలను తెరిపిస్తుంది. అయితే మధ్యప్రదేశ్, బీహార్, వెస్ట్‌బెంగాల్, మహారాష్ట్రతో పాటు ఈశాన్య రాష్ర్టాలైన సిక్కిం, మిజోరం వంటి తదితర రాష్ర్టాల్లోని మారుమూల ప్రాంతాల్లో ఉండే గ్రామాలకు సైబర్‌చీటర్లు తమ ఏజెంట్లను పంపించి అమాయకుల బ్యాంకు ఖాతాలను తీసుకొని వాడుకుంటున్నారు. ఢిల్లీ, ముంబై వంటి ప్రధాన పట్టణాల్లో ఉంటూ అమాయకులకు వివిధ రకాలుగా ఆశ చూపు తూ వలవేస్తూ .. దేశంలోని వివిధ ప్రాంతాల్లోని బ్యాంకు ఖాతాల్లో డబ్బులు డిపాజిట్ చేయిస్తున్నారు.

బ్యాంకు ఖాతా గుర్తించండి


అమాయకులను మోసం చేసే కేసుల్లో సైబర్‌నేరస్తులు ఒక బ్యాంకు ఖాతాను ఇచ్చి అందులో డబ్బు డిపాజిట్ చేయమని చెబుతుంటారు. అయితే సైబర్‌నేరస్తులు చెప్పే మాటలు నమ్మి.. వారి వలలో పడ్డవారు... బ్యాం కు ఖాతా ఎక్కడిది అనే విషయాన్ని గుర్తించరు. బ్యాం కులకు వెళ్లి డబ్బు డిపాజిట్ చేయడం, లేదంటే ఆన్‌లైన్‌లో ఆయా ఖాతాలకు బదిలీ చేయడం చేస్తుంటారు. ఇక్కడే మోసానికి అడ్డుకట్ట వేసేందుకు అవకాశముంటుంది. మీరు డిపాజిట్ చేస్తున్నది ఎవరి ఖాతా? ఏ ఊరిది? మీరు మాట్లాడుతున్న వ్యక్తికి.. ఆ ఖాతాకు ఏమి సంబంధం? అనే విషయాల గురించి ఆలోచించండి. బ్యాంకు ఐఎఫ్‌ఎస్సీ కోడ్‌ను గుర్తించి బ్యాంకు అధికారుల ద్వారానే, ఇంటర్‌నెట్‌లో స్వయంగానే ఆ బ్యాంకు ఖాతా ఏ ఊరిదో తెలుసుకోండి. బ్యాంకు ఖాతాకు ఫోన్ చేసే వ్యక్తికి సంబంధం లేదంటే తప్పని సరిగా అది మోసమని గుర్తించండి. కొన్ని సందర్భాల్లో ఫోన్ చేసే వ్యక్తులే ఆ బ్యాంకు ఖాతాదారుడి పేరును కూడా చెప్పుకుంటారు. ఫోన్, ఇంటర్‌నెట్‌లో అవతలి వ్యక్తులు మభ్యపెట్టి డబ్బు కాజేసే ప్రయత్నంలో తొందరపడ్డా.. బ్యాంకు ఖాతా విషయంలో మాత్రం జాగ్రత్తగా ఉంటే ఆ మోసం నుంచి బయట పడేందుకు పూర్తి అవకాశముంటుందనే విషయాన్ని ప్రతి ఒక్కరూ గుర్తించుకోవాలి.

1013
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles