పిల్లల అపహరణ.. ఆ తర్వాత బెగ్గింగ్

Wed,August 22, 2018 06:58 AM

Ayush Kidnap case deal by DCP Sumathi

హైదరాబాద్ : పిల్లలను ఎత్తుకెళ్లి భిక్షాటన చేయించడం.. లేదంటే అమ్మేయడం చేస్తున్న ఘరానా ముఠాను నార్త్‌జోన్ పోలీసులు పట్టుకున్నారు. పోలీసుల విచారణలో బొల్లారం, అల్వాల్ ప్రాంతాల అడ్డాగా అక్కడున్న ఒక బస్తీ కేంద్రంగా ఈ దందా సాగుతున్నట్లు గుర్తించారు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి సోమవారం నాలుగేండ్ల బాలుడు ఆయుష్‌ను ఇద్దరు మహిళలు కిడ్నాప్ చేశారు. రైల్వే పోలీసులతో పాటు నార్త్‌జోన్ పోలీసులు రంగంలోకి దిగి... 24 గంటల్లోనే కిడ్నాపర్లను గుర్తించి బాలుడిని సురక్షితంగా తల్లి వద్దకు చేర్చారు. బాలుడు దొరకడంతో అటూ రైల్వే పోలీసులు.. ఇటు నార్త్‌జోన్ పోలీసులు ఊపిరి పిల్చుకున్నారు.

ఇప్పటి వరకు పిల్లలను ఎత్తుకెళ్లి యాచక వృత్తిలోకి దింపుతున్నాయని అనుకోవడమే తప్పా.. ఆయా ముఠాలను పట్టుకున్న దాఖలాలు ఇటీవల లేవు. ఇప్పుడు తాజాగా దొరికిన ఈ ముఠాతో గత కొన్నేండ్లుగా అదృశ్యమైన చిన్నారుల ఆచూకీ తెలిసే అవకాశాలున్నాయని పోలీసులు భావిస్తున్నారు. తాజాగా అపహరించిన ఆయుష్‌ను ఎవరికైనా విక్రయించడం లేదంటే భిక్షాటన చేయించడమో చేయాలనే ఈ ముఠా ప్లాన్ అని పోలీసులు వెల్లడించారు.

ఆయుష్‌కు ఆడపిల్ల వేషం
సోమవారం సికింద్రాబాద్‌లో కిడ్నాప్ ఘటన వెలుగులోకి రావడంతోనే పోలీసులు బృందాలుగా విడిపోయి దర్యాప్తు ప్రారంభించారు. దర్యాప్తులో భాగంగా ఒక బృందం కిడ్నాప్ జరిగినప్పటి నుంచి నిందితులు ఎటు వెళ్లారనే కోణంలో వెళ్లగా.. మరో బృందం కిడ్నాప్‌నకు ముందు నిందితులు ఎక్కడి నుంచి వచ్చారనే కోణంలో రివర్స్ పద్ధతిలో దర్యాప్తు జరిపారు. ఇందులో రివర్స్ పద్ధతిలో జరిపిన కేసు దర్యాప్తులో కీలకమైన ఆధారాలు పోలీసులకు లభించాయి. సీసీ కెమెరాల్లో రికార్డయిన ఫొటోలను చూసిన ఆర్టీసీ డ్రైవర్, కండక్టర్ బొల్లారం ప్రాంతం నుంచి సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ వరకు ప్రయాణించారనే సమాచారం ఇవ్వడంతో పోలీసులు బొల్లారం, అల్వాల్ ప్రాంతంలోని అంబేద్కర్‌నగర్ బస్తీలో విస్తృతంగా గాలింపు చేపట్టడంతో నిందితులైన యాదమ్మ, జయల ఆచూకీ తెలిసింది. అయితే ఆయుష్‌ను ఎవరూ గుర్తించకుండా అమ్మాయి గౌన్ వేసినట్లు పోలీసులు పేర్కొన్నారు.

వారి వద్ద నుంచి కిడ్నాప్‌నకు గురైన ఆయూష్‌ను రక్షించడమే కాకుండా రెండున్నరేండ్ల క్రితం కిడ్నాప్‌నకు గురైన బుచ్చి (7), శేఖర్(5) అనే ఇద్దరు పిల్లలు కూడా ఉండడంతో పోలీసులు వారిని రక్షించారు. ఈ ఇద్దరు పిల్లలను కూడా మేడ్చల్, ఉందానగర్ రైల్వే స్టేషన్ల నుంచి కిడ్నాప్ చేశారు. అయితే ఆ పిల్లల తల్లిదండ్రులు ఎవరు అనే విషయాల్లో స్పష్టత రాలేదని, ఆ ఇద్దరు పిల్లలను బాలల సదనానికి తరలిస్తున్నామని రైల్వే పోలీసులు తెలిపారు. అయితే వీరిద్దరి అదృశ్యంపై ఒకటి కాచిగూడ, మరొకటి సికింద్రాబాద్ రైల్వే పోలీస్‌స్టేషన్లలో మిస్సింగ్ కేసులు నమోదయ్యాయి. వీటి ఆధారంగా ఇద్దరు పిల్లలను వారి తల్లిదండ్రుల వద్దకు చేర్చేందుకు రైల్వే పోలీసులు కసరత్తు ప్రారంభించారు.

అమ్మడం లేదంటే.. భిక్షాటన చేయించడం...
పోలీసులకు పట్టుబడ్డ యాదమ్మ, జయలను అరెస్ట్ చేయ గా అసక్తికరమైన విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఈ ముఠాలో మొత్తం ఆరు మంది ఉన్నట్లు పోలీసుల విచారణలో వెల్లడయ్యింది. ఇందులో మరో నిందితురాలు అంజమ్మ పరారయ్యింది. వీరంతా రైల్వే స్టేషన్లు, బస్‌స్టాండ్లలో తిరుగుతూ అమాయకంగా ఉండే మహిళలను లక్ష్యంగా చేసుకొని వారిని వెంబడిస్తుంటారు. అదను చూసి పిల్లలను ఎత్తుకెళ్తుంటారు. పిల్లలు అరవకుండా ఉండేందుకు వారికి చాక్లెట్లు, బిస్కెట్లు ఇప్పిస్తూ వారి గమ్యస్థానానికి చేరుకుంటారు. వీరంతా బొల్లారం, అల్వాల్ ప్రాం తంలోనే స్థిరపడ్డా.. వివిధ ప్రాంతాల్లో తిరుగుతూ ఉంటారని పోలీసులు పేర్కొంటున్నారు. కిడ్నాప్ చేసిన తరువాత ఎవరైనా పిల్లలు లేనివారికి విక్రయించడం, పార్టీలు దొరకకపోతే ఆ పిల్లల చేతులు, కాళ్లు విరగొట్టి భిక్షాటనకు పంపిస్తున్నట్లు పోలీసులకు ఆధారాలు లభించాయి.

అయితే పోలీసులకు దొరికిన ఈ ముగ్గురు పిల్లలకు ఎలాంటి హాని చేయలేదని తేలింది. పిల్లలను భిక్షాటన చేయించడం, చిత్తు కాగితాలను ఎరివేయించడం చేయిస్తున్నారని పోలీసులు తెలిపారు. అయితే ఆయుష్ ఆచూకీ లభ్యం కావడంతో బాబును సురక్షితంగా తల్లి వద్దకు చేర్పించామని, ఇక ఈ ముఠా గురించి ఆరా తీసి నిజనిజాలు వెలుగులోకి తెస్తామని నార్త్‌జోన్ డీసీపీ సుమతి వెల్లడించారు. యాదాద్రిలో పిల్లల అపహరణకు, ఈ ముఠాకు ఎలాంటి సంబంధం లేదని తెలిసిందని డీసీపీ తెలిపారు.

1644
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles