పైప్‌లైన్‌కు రంధ్రంచేసి డీజిల్ చోరీ కేసులో మరో ఇద్దరి అరెస్ట్

Thu,February 14, 2019 09:19 AM

Another two accused arrested in diesel theft case

రూ.4.29 లక్షల నగదు స్వాధీనం
వివరాలు వెల్లడించిన డీసీపీ ఉమామహేశ్వర శర్మ

హైదరాబాద్: చర్లపల్లిలో పైప్‌లైన్‌కు రంధ్రంచేసి డీజిల్‌ చోరీకి పాల్పడిన కేసులో మరో ఇద్దరు అంతర్రాష్ట్ర నిందితులను పోలీసులు అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు తరలించారు. ఈ కేసులో గతంలో నలుగురు నిందితులను అరెస్ట్ చేశారు. మరికొంతమంది పరారీలో ఉన్నారు. నేరేడ్‌మెట్‌లోని డీసీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మల్కాజిగిరి డీసీపీ ఉమామహేశ్వర శర్మ వివరాలను వెల్లడించారు.

ఘట్‌కేసర్, చర్లపల్లి మధ్య ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్, భారత్ పెట్రోలియం కార్పొరేషన్‌ల పైపులైన్ పక్కన ముంబైకి చెందిన సర్వర్ షేక్ అలియాస్ సజ్జు (52) స్క్రాప్ వ్యాపారం పేరుతో స్థలాన్ని లీజ్‌కు తీసుకుని షెడ్డును నిర్మించాడు. చుట్టూ ఇనుప షీట్లను ఏర్పాటు చేశారు. కొంతమందితో గ్యాంగ్‌ను ఏర్పాటు చేసి ఆయిల్ పైప్‌లైన్‌కు రంధ్రం చేసి డీజిల్‌ చోరీకి పాల్పడ్డారు. ఆయిల్ కార్పొరేషన్ అధికారుల ఫిర్యాదుతో రాచకొండ పోలీసులు రంగంలోకి దిగి డీజిల్‌ చోరీకి పాల్పడుతున్న నలుగురు నిందితులను గతంలో అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు తరలించారు. పరారీలో మరికొంతమంది ఉన్నారు.

కాగా.. నిందితులు ముంబైకి చెందిన సర్వర్ షేక్ అలియాస్ సజ్జు (52), సురేశ్‌కుమార్ ప్రజాపతి (38)లను ఘట్‌కేసర్ క్రాస్‌రోడ్డులో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారినుంచి రూ.4,29,878 నగదును స్వాధీనం చేసుకున్నారు. సురేశ్ కుమార్ ప్రజాపతి రెండు ట్యాంకర్ల డీజిల్‌ను మహారాష్ట్రలోని రెండు షుగర్ కంపెనీల్లో విక్రయించాడని వివరించారు. ట్యాంకర్‌ను సీజ్ చేసినట్టు డీసీపీ తెలిపారు.

ఈ కేసులో పరారీలో ఉన్న మరో ఐదుగురు నిందితుల కోసం పోలీసులు గాలిస్తున్నారని డీసీపీ తెలిపారు. ఈ ముఠా నుంచి 4,357 లీటర్ల డీజిల్‌ను రికవరీ చేయాల్సి ఉందని, వరంగల్‌లో డీజిల్ విక్రయం వివరాలపై విచారణ జరుపుతున్నామని చెప్పారు. సర్వర్ షేక్‌కు ముంబైలో నేరచరిత్ర ఉందని, పలు కేసులు నమోదై ఉన్నాయని తెలిపారు. ఈ కేసును విచారిస్తున్న సీసీఎస్, ఎస్‌ఓటీ, కీసర పోలీసులను డీసీపీ అభినందించారు. సమావేశంలో ఏసీపీ శివకుమార్, సీసీఎస్ మల్కాజిగిరి ఎస్.లింగయ్య, సీఐలు జగన్నాథ్‌రెడ్డి, రుద్ర భాస్కర్, ప్రకాశ్, ఎస్సైలు వెంకటేశ్వర్లు, పీఎం కృష్ణారావు, అచ్చయ్యలు పాల్గొన్నారు.

502
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles