ప్రైవేట్ విద్యాసంస్థల్లో టీచర్లపై అడ్మిషన్ల భారం

Mon,May 14, 2018 07:03 AM

Admissions Weight on teachers in private educational institutions

రసూల్‌పూర :మీ ఇంట్లో చదువుకునే విద్యార్థులున్నారా...? అయితే మా పాఠశాలకు పంపించండి ప్లీజ్ అంటూ ప్రైవేట్ స్కూళ్లు, కాలేజీల్లో పనిచేస్తున్న టీచర్లు, లెక్చరర్లు వీధివీధినా తిరుగుతున్నారు. ఇంటింటికీ తిరుగుతూ బతిమాలుతున్నారు. కొత్త అడ్మిషన్ల కోసం నానా తిప్పలు పడుతున్నారు. ఎండాకాలం కావడంతో సెలవులు వచ్చినా వారికి మాత్రం తీరిక లేకుండా పోయింది. నగరంలో ప్రైవేటు పాఠశాలలు, కళాశాలలు ఎక్కువగానే ఉన్నాయి. విద్యను వ్యాపారంగా మార్చుకుని విద్యార్థుల సంఖ్యను పెంచుకునేందుకు సంబంధిత యాజమాన్యాలు ఎవరికి వారు పోటీపడుతున్నారు. ప్రైవేట్ విద్యాసంస్థల యాజమాన్యాలు విద్యార్థుల నుంచి ఏ రకంగా అయితే అధిక ఫీజులు వసూలు చేస్తుంటారో ఆదే రకంగా అందులో పనిచేస్తున్న టీచర్లు, కాలేజీ లెక్చరర్లపై ఒత్తిడి చేసున్నారు. బీఈడీ చేసినా చదువు చెప్పే విషయంలో ఎన్ని సంవత్సరాల అనుభవం ఉన్నా పట్టించుకోవడం లేదు. యాజమాన్యాలు ఇచ్చిన ప్రతి లక్ష్యాన్ని చేరుకుంటేనే వారికి ఉద్యోగం ఉంటుంది. లేకుంటే యాజమాన్యాలు తీసుకునే నిర్ణయం మాత్రం వారిని ఇంటికి పంపివేయడమే..!

విద్యార్థులు సెలవుల్లో....టీచర్లు వీధుల్లో


ప్రైవేట్ విద్యా సంస్థల్లో పనిచేస్తున్న టీచర్లు, లెక్చరర్లు ప్రతి యేడూ సెలవుల్లోనూ పనిచేయాల్సిందే..! టీచర్లకు పని అంటే పాఠాలు చెప్పడం కాదు. ఆయా కాలనీల్లో ఇంటింటికీ తిరుగుతూ కొత్తగా విద్యార్థులను చేర్పించుకోవాలి. నగరంలో ఆయా ప్రాంతాలతో పాటు ప్రధానంగా సికింద్రాబాద్, కంటోన్మెంట్, ముషీరాబాద్, సనత్‌నగర్‌లతో పాటు శివారు ప్రాంతాల్లోని విద్యాసంస్థల్లో పనిచేస్తున్న టీచర్లు ఒక్కొక్కరు 15 మందికి తగ్గకుండా కొత్త విద్యార్థులను చేర్పించాలి. పరీక్షల ప్రారంభ సమయం నుంచే ప్రైవేట్ టీచర్లకు పని ఎక్కువవుతోంది. యాజమాన్యం వీరికి ఇచ్చిన టార్గెట్‌పైనే దృష్టి సారించడం జరుగుతుంది. స్కూళ్లు, కాలేజీల్లో చదువుతున్న విద్యార్థుల వివరాలు సేకరించడం ప్రారంభిస్తారు.

సెలవులు ప్రారంభమై నెల రోజులు కావస్తుండడంతో సేకరించిన వివరాలతో విద్యార్థులకు ఇండ్లకు వెళ్లి వారి తల్లిదండ్రులను ప్రాధేయపడుతున్నారు. మహిళా టీచర్లు, అధ్యాపకులు నెల రోజులకు పైగా వీధుల్లో తిరగడం కనిపిస్తోంది. చిన్న పిల్లలు ఉన్నా ప్రైవేట్ టీచర్లు ఇంటింటికీ తిరుగుతూ పాఠశాలల్లో చేర్పించాలని కోరుతున్నారు. మరోవైపు ఎండల తీవ్రతతో పాటు వానలు పడుతుండడంతో వీరి బాధలు వర్ణనాతీతం. కొంతమంది ఎండకు తాళలేక పలుచోట్ల సేదతీరడం కనిపిస్తోంది.

రెండు నెలల జీతాలు పెండింగ్‌లో...


ప్రైవేట్ విద్యాసంస్థల్లో పనిచేసే టీచర్లు, అధ్యాపకులు ఇచ్చిన టార్గెట్‌లు పూర్తి చేస్తేనే వేతనాలు ఇస్తామని రెండు నెలల జీతాలు ఇవ్వకుండా ఉన్నట్లు సమాచారం. కంటోన్మెంట్‌లోని ఓ ప్రైవేట్ స్కూల్‌లో పనిచేసే ఉపాధ్యాయురాలు 15 మంది విద్యార్థులను చేర్పించలేకపోవడంతో... మరో రెండు రోజుల్లో విద్యార్థులను చేర్పించాలని ఒకవేళ చేర్పించలేకపోతే స్కూలుకు రావాల్సిన అవసరం లేదని యాజమాన్యం చెప్పినట్లు సమాచారం. సదరు ఆదే స్కూల్‌లో ఏడేండ్లుగా ఉపాధ్యాయురాలుగా పనిచేస్తున్నది.

కొత్త అడ్మిషన్లు తీసుకురాలేదనే సాకుతో యాజమాన్యం అవమానకరంగా మాట్లాడినట్లు సన్నిహితుల వద్ద ఆమె కన్నీరుమున్నీరుగా విలపించింది. ప్రైవేట్ స్కూల్స్, కాలేజీల యాజమాన్యాలు నూతన అడ్మిషన్ల కోసం పెడుతున్న ఒత్తిడిపై ఎవరికి చెప్పుకోవాలో అర్థంకాక కొంతమంది మహిళా టీచర్లు లోలోన కుమిలిపోతుంటే ....మరి కొంతమంది మాత్రం కుటుంబ పోషణ కోసం తప్పనిసరి పరిస్థితుల్లో ఆదే స్కూల్స్, కాలేజీల్లో పనిచేస్తూ....వారు ఇచ్చేది తక్కువ వేతనమైనా తీసుకుని చెప్పినట్లు పనిచేస్తుండటం గమనార్హం.

మరోవైపు సెలవులు లేకున్నా పనిచేసుకుంటూ పోతున్నారు. ఇంటింటికీ తిరుగుతున్నా.. స్కూల్స్ ఎక్కువ కావడంతో విద్యార్థుల తల్లిదండ్రులు మాత్రం ఒకటికి పది సార్లు ఆలోచిస్తుండటంతో పలుమార్లు వారి ఇండ్లకు వద్దకు వెళ్లాల్సి వస్తుంది. ఆ విద్యార్థులను పాఠశాలల్లో చేర్పించకపోతే యాజమాన్యం నుంచి ఒత్తిళ్లు తప్పవని టీచర్లు పేర్కొంటున్నారు. దీంతో ప్రైవేట్ టీచర్ల బాధను చూస్తున్న విద్యార్థుల తల్లిదండ్రులు మాత్రం పాపం టీచర్లు అంటూ నిట్టూరుస్తున్నారు.

2214
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles