మద్యం మత్తులో డ్రైవింగ్.. అదుపుతప్పిన బైక్

Mon,November 11, 2019 06:58 AM

మేడ్చల్ : అతిగా మద్యం సేవించిన ముగ్గురు యువకులు (వలసకూలీలు) ఒకే ద్విచక్ర వాహనంపై వేగంగా ప్రయాణిస్తూ ప్రమాదానికి గురయ్యారు. అదుపు తప్పిన బైక్ రోడ్డుపై పడిపోవడంతో ముగ్గురికీ తీవ్ర గాయాలయ్యాయి. వారిలో చికిత్స పొందుతూ ఒకరు మృతి చెందగా, మిగిలిన ఇద్దరు ప్రాణాపాయ స్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు. ఈ ఘటన దుండిగల్ పోలీస్‌స్టేషన్ పరిధిలో శనివారం అర్ధరాత్రి చోటుచేసుకుంది.


ఎస్‌ఐ శేఖర్‌రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం...మధ్యప్రదేశ్ రాష్ర్టానికి చెందిన లోక్‌రాం బార్గయ కొడుకు శ్రవణ్ బార్గయ(24), రాజేశ్ కచ్‌వాయి, దీవానీ పిప్పేవర్ అనే యువకులు బతుకుదెరువు కోసం నగరానికి వలసవచ్చి మల్కాజిగిరి నియోజకవర్గం పరిధిలోని యాప్రాల్ బాలాజీ నగర్‌లో నివాసముంటున్నారు. రోజువారీ కూలీ పనులు చేస్తూ ఉపాధి పొందుతున్నారు.

ఈ క్రమంలో శనివారం మియాపూర్‌లో పనికి వెళ్లిన ముగ్గురు సాయంత్రం పని ముగిసిన అనంతరం అక్కడే మద్యం సేవించారు. రాత్రి 11 గంటల సమయంలో ద్విచక్ర వాహనంపై మియాపూర్ నుంచి గండిమైసమ్మ చౌరస్తా మీదుగా యాప్రాల్ బాలాజీనగర్‌కు బయలుదేరారు. ఈ నేపథ్యంలో ద్విచక్ర వాహనం బౌరంపేటలోని బంగారుమైసమ్మ ఆలయం సమీపంలోకి రాగానే అదుపుతప్పి రోడ్డుపై పడిపోయింది. వేగంగా ఉండటంతో బైక్‌పై ప్రయాణిస్తున్న శ్రవన్ బార్గయ, రాజేశ్ కచ్‌వాయి, దీవానీ పిప్పేవర్‌లు తీవ్రంగా గాయపడ్డారు.

గమనించిన ప్రయాణికులు 108 అంబులెన్స్‌లో చికిత్స నిమిత్తం సూరారంలోని మల్లారెడ్డి దవాఖానలో చేర్పించారు. కాగా, ఆదివారం శ్రవణ్ బార్గయ చికిత్స పొందుతూ మృతి చెందగా, మిగిలిన ఇద్దరు రాజేశ్ కచ్‌వాయి, దీవానీ పిప్పేవర్‌లు చికిత్స పొందుతున్నారు. మృతుడి బంధువు లలిత్ కచ్‌వాయి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

864
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles