గురువారం 02 ఏప్రిల్ 2020
Hyderabad-city - Jan 31, 2020 , 07:55:40

వివాదాలకు కేరాఫ్‌గా లిస్బన్‌ పబ్‌..షోకాజ్ నోటీసులు

వివాదాలకు కేరాఫ్‌గా లిస్బన్‌ పబ్‌..షోకాజ్ నోటీసులు

ఖైరతాబాద్‌ : గత ఏడాది మహిళపై దాడి..ఇటీవల అశ్లీల నృత్యాలు....తాజాగా డ్యాన్సర్‌పై లైంగిక వేధింపులు....వరుస వివాదాలకు బేగంపేట కంట్రీక్లబ్‌ ఆవరణలో ఉన్న లిస్బన్‌పబ్‌ కేరాఫ్‌ అడ్రస్‌గా నిలిచింది. ఐఏఎస్‌, ఐపీఎస్‌ అధికారులతో పాటు ప్రముఖ వీఐపీలు నివాసం ఉంటున్న సేఫ్‌ కాలనీగా పేరు తెచ్చుకున్న కుందన్‌ బాగ్‌లో ఈ పబ్‌ నిర్వహణ అనేక ఆరోపణలకు దారి తీసింది.  పబ్‌లో బినామీలో మరో పబ్‌ను నిర్వహిస్తూ అందులో అసాంఘిక కార్యకలాపాలు నిర్వహిస్తున్నట్లు పోలీసుల విచారణలో తేలినట్లు తెలిసింది.  గత రెండు సంవత్సరాలుగా పబ్‌పై వస్తున్న ఆరోపణల నేపథ్యంలో తాజాగా ఆర్టీఓ పబ్‌కు షోకాజ్‌ నోటీసు జారీ చేశారు.

సరైన వివరాలు ఇవ్వకుంటే పబ్‌ మూసివేస్తాం..

బుధవారం అర్ధరాత్రి ఓ డ్యాన్సర్‌ తనతో గడుపాలని ఒత్తిడి తెచ్చాడంటూ అందుకు నిరాకరించడంతో నిర్వాహకుడు మురళీ లైంగిక దాడికి యత్నించినట్లు పోలీసులకు ఫిర్యాదు అందింది. ఈ నేపథ్యంలో ఆర్డీఓ పబ్‌ నిర్వహణపై సీరియస్‌గా ఉన్నారు. లిస్బన్‌పబ్‌తో పాటు దానికి అనుసంధానంగా బినామీగా నడుస్తున్న పబ్‌లకు  సరైన లైసెన్సు లేవని స్వయంగా జీహెచ్‌ఎంసీ అధికారులు ధృవీకరించారు. కంట్రీక్లబ్‌ లైసెన్సునే పబ్‌లకు ఉన్నాయంటూ చూపిస్తూ వారి వ్యాపారాలను చక్కబెట్టుకుంటున్నారు. ఈనేపథ్యంలో పంజాగుట్ట పోలీసుల ద్వారా పంపించిన షోకాజ్‌ నోటీలకు సరైన సమాధానాలు చెప్పాలని,  లేనిపక్షంలో పబ్‌ను మూసివేస్తామని ఆర్డీఓ నోటీసులో పేర్కొన్నారు.


logo