శనివారం 04 ఏప్రిల్ 2020
Hyderabad-city - Jan 31, 2020 , 07:52:09

ఫైనాన్స్‌ తప్పించుకునేందుకు ఆటో నంబర్‌ మార్చి..

ఫైనాన్స్‌ తప్పించుకునేందుకు ఆటో నంబర్‌ మార్చి..

బాలానగర్‌ : ఆటో ఫైనాన్స్‌, ట్రాఫిక్‌ చలాన్ల నుంచి తప్పించుకునేందుకు...ఆటో నంబర్‌ మార్చి తిరుగుతున్న ఆటో డ్రైవర్‌తో పాటు దాని యజమానిని పోలీసులు పట్టుకున్నారు.  ఈ ఘటన బాలానగర్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో చోటుచేసుకుంది. సీఐ ఎండీ వహీదుద్దీన్‌ కథనం ప్రకారం...గాజులరామారం సర్కిల్‌, రోడా మిస్త్రీనగర్‌కు చెందిన ఆవుల అశోక్‌ (34) 2018 జూన్‌ 15న ప్యాసింజర్‌ ఆటో(టీఎస్‌ 06 యూబీ 7020) కొనుగోలు చేశాడు. అయితే సదరు ఆటోకు ఈఎంఐ, చలాన్ల నుంచి తప్పించుకోవడం కోసం..ఉప్పల్‌ చిలుకానగర్‌కు చెందిన రాం బాబుకు చెందిన మరో ప్యాసింజర్‌ ఆటో (టీఎస్‌ 07 యూసీ 0338 ) నంబర్‌ను  బిగించి... బాలానగర్‌ కోమటిబస్తీకి చెందిన జహంగీర్‌ (27) అనే డ్రైవర్‌కు అద్దెకు ఇచ్చాడు. అతను యథేచ్ఛగా ఆటోను నడుపుతున్నాడు.

ఇదిలా ఉండగా... చలాన్లు వస్తుండడంతో రాంబాబు.. పరిశీలించగా తన ఆటో నం బర్‌ను ఎవరో పెట్టుకుని తిరుగుతున్నట్లు గుర్తించి.. బాలానగర్‌ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు పోలీసులు కేసు  నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. గురువారం బాలానగర్‌ నర్సాపూర్‌ చౌరస్తాలో వాహనాల తనిఖీ చేపట్టారు. అదే సమయంలో ఆటో (టీఎస్‌ 07 యూసీ 0338) రాగా డ్రైవర్‌ జహంగీర్‌ను అదుపులోకి తీసుకొని విచారించగా.. నేరం అంగీకరించాడు. ఈ మేరకు డ్రైవర్‌ జహంగీర్‌తో పాటు యజమాని ఆశోక్‌పై 420 చీటింగ్‌ కేసు నమోదు రిమాండ్‌కు తరలించారు.


logo