శనివారం 04 ఏప్రిల్ 2020
Hyderabad-city - Feb 09, 2020 , 00:38:05

జీహెచ్‌ఎంసీ బడ్జెట్‌..6973 కోట్లు

జీహెచ్‌ఎంసీ బడ్జెట్‌..6973 కోట్లు

వచ్చే 202021ఆర్థిక సంవత్సరానికి గాను రూ. 6973.00 కోట్ల అంచనాతో రూపొందించిన బల్దియా వార్షిక బడ్జెట్‌ను జీహెచ్‌ఎంసీ సర్వసభ్య సమావేశం (కౌన్సిల్‌) ఏకగ్రీవంగా ఆమోదించింది. ఇందులో రూ. 1593.64కోట్లు రోడ్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌, హౌసింగ్‌ కార్పొరేషన్లకు సంబంధించిన నిధులు కాగా, మిగిలిన రూ. 5380.00 కోట్లు జీహెచ్‌ఎంసీ ఆదాయవ్యయాలకు సంబంధించిన నిధులు.

  • బల్దియా నిర్వహణకు 5380కోట్లు
  • వచ్చే ఆగస్టు నాటికి 65వేల ఇండ్లు పూర్తి చేస్తాం
  • మేయర్‌ బొంతు రామ్మోహన్‌
  • వ్యర్థాల నుంచి విద్యుత్‌ ఉత్పత్తికి కసరత్తు చేస్తున్నాం
  • రహదారులు, ‘డబుల్‌' ఇండ్లకు 1593 కోట్లు
  • వార్షిక బడ్జెట్‌ను ఆమోదించిన కౌన్సిల్‌
  • హరిత నగరంగా తీర్చిదిద్దుతాం

సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ :   వచ్చే 202021ఆర్థిక సంవత్సరానికి గాను రూ. 6973.00 కోట్ల అంచనాతో రూపొందించిన బల్దియా వార్షిక బడ్జెట్‌ను జీహెచ్‌ఎంసీ సర్వసభ్య సమావేశం (కౌన్సిల్‌) ఏకగ్రీవంగా ఆమోదించింది. ఇందులో రూ. 1593.64కోట్లు రోడ్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌, హౌసింగ్‌ కార్పొరేషన్లకు  సంబంధించిన నిధులు కాగా, మిగిలిన రూ. 5380.00 కోట్లు జీహెచ్‌ఎంసీ ఆదాయవ్యయాలకు సంబంధించిన నిధులు.


 శనివారం మేయర్‌ బొంతు రామ్మోహన్‌ అధ్యక్షతన జీహెచ్‌ఎంసీ ప్రత్యేక సర్వసభ్య సమావేశం జరిగింది. కమిషనర్‌ లోకేశ్‌కుమార్‌, నగర కార్పొరేటర్ల తో పాటు ఎక్స్‌అఫీషియో సభ్యులు ఎంపీలు ఎ. రేవంత్‌రెడ్డి, జి. రంజిత్‌రెడ్డి, ఎమ్మెల్సీలు ఎం.ఎస్‌. ప్రభాకర్‌రావు, సయ్యద్‌ అమినుల్‌ హసన్‌ జాఫ్రీ, మిర్జా రియాజ్‌ ఉల్‌ హసన్‌, ఎమ్మెల్యేలు కాలేరు వెంకటేశ్‌, జాఫర్‌ హుస్సేన్‌, కౌసర్‌ మొయినుద్దీన్‌, సయ్యద్‌ పాషా ఖాద్రీ, దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి, డిప్యూటీ మేయర్‌ బాబా ఫసియుద్దీన్‌ తదితరులు ఈ సమావేశానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా మేయర్‌ బడ్జెట్‌ను ప్రవేశపెడుతూ సభ్యులంతా ఆమోదించాలని కోరారు. అనంతరం మేయర్‌ మాట్లాడుతూ, ఎస్‌ఆర్‌డీపీ పథకానికి రూ. 3500 కోట్లు బాండ్లు, రుణం ద్వారా సేకరించాలని నిర్ణయించి, ఇందులో రూ. 2500 కోట్లు రుణం ద్వారా, మిగిలిన రూ. 1000 కోట్లు బాండ్ల జారీ ద్వారా సేకరించాలని నిశ్చయించామని మేయర్‌ పేర్కొన్నారు. అందులో ఇప్పటికే బాండ్ల జారీ ద్వారా మూడు దశల్లో రూ. 495.00కోట్లు సేకరించినట్లు తెలిపారు. ఈ పథకంలో భాగంగా చేపట్టిన పనుల్లో ఇప్పటికే నాలుగు ఫ్లైఓవర్లు సిద్ధంకాగా, మరికొన్నిచోట్ల పనులు చివరిదశలో ఉన్నాయన్నారు. కొన్ని ప్రాంతాల్లో పనులు కొనసాగుతున్నట్లు చెప్పారు. ఎస్‌బీఐ క్యాపిటల్‌ మార్కెట్స్‌ లిమిటెడ్‌ ద్వారా రూ. 2500 కోట్ల రుణం మంజూరైనట్లు తెలిపారు.


జూలై, ఆగస్టు నాటికి 65వేల ఇండ్లు

డబుల్‌ బెడ్‌రూం ఇండ్ల  పథకానికి ఇప్పటికే రూ. 1800 కోట్లు ఖర్చుచేసినట్లు, తుదిదశలో ఉన్న దాదాపు 65000 గృహాలను జూన్‌, జూలైఆగస్టు మాసాలకల్లాపూర్తిచేసి లబ్ధిదారులకు పంపిణీ చేస్తామన్నారు. హైదరాబాద్‌, రంగారెడ్డి, మేడ్చల్‌, సంగారెడ్డి జిల్లాల పరిధిలో ఇండ్లు నిర్మించగా, నలుగురు కలెక్టర్ల ఆధ్వర్యంలో లబ్ధిదారుల ఎంపిక జరుగుతున్నట్లు మేయర్‌ తెలిపారు. ఇప్పటికే 5700మంది లబ్ధిదారులను ఎంపికచేసి వారి వివరాలను ఆన్‌లైన్‌లో అప్‌లోడ్‌ చేసినట్లు వివరించారు. ఈ సమావేశం సందర్భంగా ఇటీవల డబీర్‌పుర వార్డు ఉప ఎన్నికలో కార్పొరేటర్‌గా గెలుపొందిన ఎంఐఎం సభ్యులు మీర్‌ బాసిత్‌ అలీ ప్రమాణ స్వీకారం చేశారు.  


logo