మంగళవారం 07 ఏప్రిల్ 2020
Hyderabad-city - Feb 09, 2020 , 00:28:37

10 నుంచి ఫ్యాన్సీ నంబర్లకు ఆన్‌లైన్‌ బిడ్డింగ్‌

10 నుంచి ఫ్యాన్సీ నంబర్లకు ఆన్‌లైన్‌ బిడ్డింగ్‌

సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ : ఫ్యాన్సీ నంబర్ల ఆన్‌లైన్‌ బిడ్డింగ్‌కు  హైదరాబాద్‌ జిల్లాను పైలట్‌ ప్రాజెక్టుగా ఎంపిక చేశారు. ఈ నెల 10 నుంచి కార్యాలయాలకు రాకుండానే వాహనదారులు బిడ్డింగ్‌ వేసుకుని రిజర్వ్‌ చేసుకునే విధానాన్ని అమల్లోకి తెస్తున్నారు. ఇక్కడ విజయవంతమైతే మేడ్చల్‌, రంగారెడ్డితోపాటు ఇతర జిల్లాలకు విస్తరించనున్నారు. ముఖ్యంగా హైదరాబాద్‌ జేటీసీ పరిధిలోని ఖైరతాబాద్‌ పరిధిలో విజయవంతమైతే పూర్తిస్థాయిలో సక్సెసవుతుందనే ఆలోచనతో హైదరాబాద్‌కు మార్చారు. చాలా మంది వాహనదారులు టీఎస్‌ 09 సీరీస్‌ను లక్కీ  సీరీస్‌గా భావించి లక్షల రూపాయలు చెల్లించి ఇక్కడి నుంచి ఫ్యాన్సీ నంబర్లు దక్కించుకుంటారు.  హైదరాబాద్‌ జాయింట్‌ ట్రాన్స్‌పోర్టు కమిషనర్‌ పరిధిలోని ఖైరతాబాద్‌, సికింద్రాబాద్‌, మలక్‌పేట, మెహిదీపట్నం, బండ్లగూడ కార్యాలయాల్లో ప్రయోగాత్మకంగా అమల్లోకి తేనున్నారు. బిడ్డింగ్‌ చేసే మొత్తాన్ని వాహనదారుడు మాత్రమే చూడగలడని అధికారులు తెలిపారు. నంబర్‌ రిజర్వేషన్‌ కోసం ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. మధ్యాహ్నం 2 నుంచి 4 గంటల వరకు బిడ్‌ మొత్తాన్ని చెల్లిస్తే 5 గంటల వరకు నంబరు ఖరారై ప్రింట్‌ వస్తుంది.  రిజిస్టర్‌ మొబైల్‌ నంబరుకు సందేశం వస్తుంది. ఏవైనా ఇబ్బందులు ఏర్పడితే ఉదయం  10 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు 04023370081/83/84 నంబర్లను సంప్రదించాలని అధికారులు సూచించారు.


logo