మంగళవారం 31 మార్చి 2020
Hyderabad-city - Feb 09, 2020 , 00:23:04

బ్లాక్‌మెయిల్‌.. ప్రాణం తీసింది

బ్లాక్‌మెయిల్‌.. ప్రాణం తీసింది
  • వివాహిత స్నానం చేస్తుండగా.. వీడియో
  • విషయం భర్తకు తెలియడంతో మనస్పర్థలు
  • తీవ్ర మనస్తాపంతో బాధితురాలు ఆత్మహత్య
  • సామాజిక మాధ్యమాల్లో పెడతానని బెదిరింపు
  • రూ.2లక్షలతోపాటు 3 తులాల బంగారం వసూల్‌

వెంగళరావునగర్‌: అగంతకుడి బ్లాక్‌ మెయిల్‌.. వివాహిత ప్రాణం తీసింది.. గతంలో స్నానం చేస్తుండగా వీడియోతీసి.. డబ్బుల కోసం బ్లాక్‌మెయిల్‌కు పాల్పడ్డాడు ...  భయంతో డబ్బులు, బంగారం ఇచ్చింది.. విషయం భర్త కు తెలియడంతో దంపతుల మధ్య మనస్పర్థలు తలెత్తాయి...దీంతో తీవ్ర మనస్తాపానికి గురై గతంలో ఆత్మహత్యాయత్నానికి పాల్పడి కోలుకుంది.. అయితే భర్త  రాకపోవడం, ఆ వీడియోలతో కుంగిపోయి తల్లిగారింట్లో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఈ సంఘటన ఎస్సార్‌ నగర్‌ పోలీస్‌ పరిధిలో చోటు చేసుకుంది.  ఎస్సై భాస్కర్‌రావు తెలిపిన వివరాల ప్రకారం...పాతబస్తీ, ఉప్పగూడ హనుమాన్‌నగర్‌కు చెందిన అరుణ్‌, స్వప్న (26) భార్యాభర్తలు. వీరికి 4 సంవత్సరాల కూతురు . అరుణ్‌ వస్ర్తాల దుకాణంలో సేల్స్‌మెన్‌గా పనిచేస్తున్నాడు. కాగా.. గత సంవత్సరం మే నెలలో స్వప్న ఇంట్లో స్నానం చేస్తుండగా ఉప్పుగూడకు చెందిన గుర్తు తెలియని వ్యక్తి రహస్యంగా వీడియో తీశాడు. స్వప్నకు ఫోన్‌ చేసి.. డబ్బు లు ఇవ్వాలని.. లేకపోతే ఆ వీడియోలను సామాజిక మాధ్యమాల్లో పెడతానని బెదిరించాడు. భయపడిన స్వప్న.. పోస్టాఫీసులో దాచుకున్న రూ.1.92 లక్షలను అతనికి ఇచ్చేసింది. అగంతకుడు చెప్పినట్లుగానే చెత్త కుండీ వద్ద డబ్బు పెట్టగా.. అతను తీసుకెళ్లేవాడు. 


అలాగే  3 తులాల బంగారు ఆభరణాలను కూడా అగంతకుడికి ఇచ్చింది. చివరకు విషయం భర్తకు తెలియడంతో డిసెంబర్‌ 19న ఛత్రినాక పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఈ మేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేపట్టారు. తీవ్ర మనస్తాపానికి గురైన స్వప్న డిసెంబర్‌ 31న విషంతాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. వెంటనే బాధితురాలిని సనత్‌నగర్‌లోని ఈఎస్‌ఐతో పాటు స్థానిక ఓ ప్రైవేటు దవాఖానలో  చికిత్స చేయించారు. కోలుకున్న అనంతరం స్వప్న  కైలాస్‌నగర్‌లోని తల్లి అరుణ వద్ద ఉం టుంది. కాగా.. భర్త తన వద్దకు రాకపోవడం, ఆ వీడియో లతో తీవ్ర మనస్తాపానికి గురై కుంగిపోయింది. శనివారం ఉదయం తల్లి బయటకు వెళ్లగా.. ఇంట్లో సీలింగ్‌ ఫ్యాన్‌కు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది.  తల్లి అరుణ వచ్చి చూడగా కూతురు ఫ్యాన్‌కు వేలాడుతూ ఉంది. వెంటనే ఎస్సార్‌నగర్‌ పోలీసులకు సమాచారం అందించింది.  పోలీసులు  మృత దేహాన్ని పోస్టుమార్టం కోసం గాంధీ మార్చురీకి తరిలించారు. మృతురాలి తల్లి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు  దర్యాప్తు చేస్తున్నారు.


logo
>>>>>>