ఆదివారం 24 మే 2020
Hyderabad-city - Feb 07, 2020 , 01:46:11

11 కిలోమీటర్లు..16 నిమిషాలు

11 కిలోమీటర్లు..16 నిమిషాలు
 • సర్వహంగులతో సిద్ధమైన జేబీఎస్ టూ ఎంజీబీఎస్ మెట్రో
 • కారిడార్1, 2తోపాటు జంటనగరాల అనుసంధానం
 • వివిధ అంతస్తుల్లో రైళ్ల ప్రయాణం
 • నేడు ప్రారంభానికి ఏర్పాట్లు పూర్తి
 • జేబీఎస్‌లో ప్రారంభించనున్న ముఖ్యమంత్రి కేసీఆర్

సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ/సుల్తాన్‌బజార్: జేబీఎస్ పరేడ్ గ్రౌండ్ నుంచి ఎం జీబీఎస్ మెట్రో స్టేషన్ వరకు 11 కిలోమీటర్ల మేర 9 స్టేషన్‌లను ఏర్పాటు చేశారు. మహాత్మాగాంధీ బస్‌స్టేషన్, సుల్తాన్‌బజార్, నారాయణగూడ, చిక్కడపల్లి, ఆర్టీసీ క్రాస్‌రోడ్స్, ముషీరాబాద్, గాంధీ దవాఖాన, సికింద్రాబాద్ వెస్ట్, సికింద్రాబాద్ ఈస్ట్ మీదుగా జూబ్లీ బస్‌స్టాండ్ పరేడ్ గ్రౌండ్స్ మెట్రో స్టేషన్ వరకు రైలు మార్గాన్ని నిర్మించారు. దేశంలోనే అతిపెద్ద ఇంటర్‌ఛేంజ్ స్టేషన్‌గా ఎంజీబీఎస్ సిద్ధమైంది. కారిడార్ 1, కారిడార్ 2తోపాటు సికింద్రాబాద్, హైదరాబాద్ జంటనగరాలను కలుపుతూ ప్రయాణ సౌకర్యాన్ని అందించనుంది.  ఎంజీబీఎస్ స్టేషన్ నిర్మాణం పలు ప్రత్యేకతలతో నిర్మించారు.  58 పిల్లర్లు, 6 గ్రిడ్స్‌తో పూర్తిస్థాయి స్టీల్, నాణ్యమైన సిమెంట్ కాంక్రీట్‌తో స్టేషన్‌ను నిర్మించారు. ఎల్బీనగర్ నుంచి మియాపూర్ మార్గంలో ప్రయాణించే కారిడార్-1కు సంబంధించిన రైళ్ల రాకపోకలు ఇంటర్‌ఛేంజ్ మెట్రోస్టేషన్ కింది అంతస్తుల ద్వారా ప్రయాణించగా, కారిడార్2 జేబీఎస్ నుంచి ఫలక్‌నుమా మార్గంలో సాగించే రైలు పైఅంతస్తుల ద్వారా రాకపోకలు సాగిస్తాయి. ఐతే ఒక మార్గం నుంచి మరో మార్గం మారడానికి సులభమైన సౌకర్యాలు ఏర్పాటు చేశారు. రాబోయే 100 సంవత్సరాల అవసరాలను దృష్టిలో ఉంచుకుని ప్రత్యేకంగా నిర్మించారు. రిటైల్ అవుట్‌లెట్లు, ఎంటర్‌టైన్‌మెంట్ జోన్స్ , కన్వీయెన్స్ అవుట్‌లెట్స్‌ను కాంకర్స్ లెవెల్‌లో నిర్మించారు.

ఇంజినీరింగ్ అద్భుతం

 • 140 మీటర్ల పొడవుతో, 60 మీటర్ల వెడల్పుతో నిర్మించే ఈ ఇంటర్‌ఛేంజ్ స్టేషన్ మూసీనది భాగంలో నిర్మించబడి ప్రత్యేకతగా నిలుస్తున్నది.
 • రెండు వైపులా రాకపోకలు సాగించే విధంగా దీనిని నిర్మించారు. ఈ స్టేషన్ నుంచి ఒక వైపున ఎంజీబీఎస్ బస్‌స్టేషన్‌లో నేరుగా ప్రయాణికులు దిగేందుకు వీలుండగా, మరోమార్గం మూసీ నదిదాటుతూ చాదర్‌ఘట్ వైపు స్టేషన్ నుంచి దిగేలా ఏర్పాట్లు చేశారు. వీటి కోసం రెండు స్కైవేలు ఏర్పాటు చేస్తున్నారు.
 • మెట్రోస్టేషన్ నుంచి చాదర్‌ఘట్ వైపు నిర్మించే స్కైవాక్ అతిపెద్దదిగా ఉండనుంది. 600 అడుగుల పొడవుతో 20 అడుగుల వెడల్పుతో దీనిని నిర్మిస్తున్నారు. రాబోయే రెండు దశాబ్దాల ట్రాఫిక్‌ను అంచనా వేసుకుని దీనిని స్కైవేను ఏర్పాటు చేస్తున్నట్లు మెట్రోరైలు ఎండీ ఎన్వీఎస్ రెడ్డి తెలిపారు.
 •  స్ట్రీట్ లెవెల్‌లో ఎంజీబీఎస్, చాదర్‌ఘూట్ వైపు ప్రత్యేక రాళ్లతో నిర్మిస్తున్నా రు. కాబుల్, తాండూర్, షాబాద్ రాళ్లను ఇందుకోసం ప్రత్యేకంగా నిర్మిస్తున్నారు. హెరిటేజ్‌లుక్‌తో దీనిని నిర్మిస్తున్నారు. ఈ మార్గంలో వారసత్వ నిర్మాణాలతో సమానంగా 5 కిలోమీటర్ల మార్గాన్ని అభివృద్ధి చేసేందుకు నిర్ణయించగా ఇంటర్‌ఛేంజ్ స్టేషన్ కూడా దీనిలోభాగం కానుంది. అందులోభాగంగా అసెంబ్లీ, ఎంజీబీఎస్, నాంపల్లి, ఎంజే మార్కెట్, జాంబాగ్, ఉస్మానియా మెడికల్ కాలేజ్, రంగ్‌మహల్ ఏరియాలు హెరిటేజ్‌లుక్‌ను సంతరించుకోనున్నాయి. 
 • u అంతర్జాతీయ పర్యాటకులను ఆకర్షించేలా ఈ ప్రాంతాల్లో మౌలిక సౌకర్యాలు ఏర్పాటు చేయనున్నారు.
 •  ఎస్కలేటర్లను 12 ఏర్పాటు చేయడమే కాకుండా సరిపడా మెట్ల మార్గాలను ఏర్పాటు చేశారు.
 • అరవై వేల మంది ప్యాసింజర్లు రాకపోకలు సాగించే సామర్థ్యంతో నిర్మించారు.అలాగే ప్రయాణికుల రక్షణ కోసం 150 సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు.
 • ప్రయాణికులు ఇబ్బంది పడకుండా దిగి ఎక్కేందుకు ఈ స్టేషన్లలో రైలును  2 నిమిషాలు ఆపనున్నారు. దీని కోసం 2వేల మంది నిపుణులు ఈ నిర్మాణంలో పాల్గొన్నారు.

మెట్రో కారిడార్-2 ప్రారంభానికి అన్ని ఏర్పాట్లు పూర్తి

ఆసియాఖండంలోనే అతిపెద్దదైన మహాత్మాగాంధీ బస్‌స్టేషన్ నుంచి జూబ్లీ బస్‌స్టేషన్ వరకు మెట్రో రైలు క్యారిడార్-2 రైలు మార్గం ప్రారంభమవుతున్న తరుణంలో ఎంజీబీఎస్ మెట్రో స్టేషన్‌లో అధికారులు అన్ని ఏర్పాట్లను పూర్తి చేశారు. ఎంజీబీఎస్ నుంచి జేబీఎస్ పరేడ్ గ్రౌండ్ వరకు శుక్రవారం ప్రారంభమయ్యే మెట్రో రైలుతో ప్రయాణికులు తక్కువ సమయంలో తమ గమ్యాన్ని చేరుకోవడానికి అవకాశం ఉంది. ఇప్పటికే నగరంలో మియాపూర్ నుంచి ఎల్‌బీనగర్ వరకు, నాగోల్ నుంచి రాయదుర్గం(హైటెక్ సిటీ)వరకు రెండు మెట్రో క్యారిడార్‌లను ప్రారంభమైన విషయం విదితమే. కాగా ఎంజీబీఎస్‌లో జేబీఎస్ నుంచి ఎంజీబీఎస్ మెట్రో క్యారిడార్‌ను మిగతా క్యారిడార్‌ల కంటే ఎత్తులో నిర్మించారు. ఎంజీబీఎస్ నుంచి సికింద్రాబాద్ వైపు ప్రయాణించే వారికి ఈ మెట్రో రైలు శుక్రవారం అందుబాటులోకి రానుండడంతో ప్రజలతోపాటు సుల్తాన్‌బజార్ వ్యాపారులు ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

ప్రారంభించనున్న సీఎం కేసీఆర్

ఎంజీబీఎస్ నుంచి జేబీఎస్ మెట్రో క్యారిడార్-2 రైలు మార్గం ప్రారంభోత్సవం సందర్భంగా ఏర్పాట్లు పూర్తయ్యాయి. రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు ప్రారంభిస్తున్న తరుణంలో రాష్ట్ర పశు సంవర్థక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ నేతృత్వంలో పలు శాఖల అధికారులు, మెట్రో రైలు ఉన్నతాధికారులు, సిబ్బంది ఎంజీబీఎస్ మెట్రో స్టేషన్‌తోపాటు పరిసర ప్రాంతాల్లో నెలకొన్న చెత్తను, మట్టిని తొలగించారు. నేటి ప్రారంభానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు.


logo