గురువారం 02 ఏప్రిల్ 2020
Hyderabad-city - Feb 07, 2020 , 01:44:30

టీడీఆర్ బ్యాంకు ప్రారంభం

టీడీఆర్ బ్యాంకు ప్రారంభం

సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ: ఆన్‌లైన్‌లో ఆస్తిహక్కు ల బదలాయింపు (టీడీఆర్...ట్రాన్స్‌ఫరబుల్ డెవలప్‌మెంట్ రైట్స్) సర్టిఫికెట్ల క్రయవిక్రయాలకు సంబంధించిన బ్యాంకును గురువారం పురపాలక శాఖ మంత్రి కే.టీ.రామారావు నగరంలోని మర్రి చెన్నారెడ్డి మానవవనరుల అభివృద్ధి కేంద్రం(ఎంసీహెచ్‌ఆర్‌డీ)లో ప్రారంభించారు. జీహెచ్‌ఎంసీ, హెచ్‌ఎండీఏకు చెందిన ప్లానిం గ్ అధికారులతో నిర్వహించిన సమావేశం సందర్భంగా మంత్రి దీనిని ప్రారంభించారు. మేయర్ బొంతు రామ్మోహన్‌తోపాటు మున్సిపల్‌శాఖ అధికారులు కూడా కార్యక్రమంలో పాల్గొన్నారు. నిబంధనల ప్రకా రం అదనపు అంతస్తుల నిర్మాణానికి అనుమతులు రానివారు టీడీఆర్ సర్టిఫికెట్లు కొనుగోలు చేసి నిర్మాణా లు చేసుకునే వీలుంది. ఇంతకాలం జీహెచ్‌ఎంసీ పరిధి వరకు మాత్రమే ఉన్న వీటి వినియోగ పరిధిని తాజాగా హెచ్‌ఎండీఏలోని ఔటర్ రింగురోడ్డు వరకు విస్తరించా రు. అంతేకాదు, స్థలాలు కోల్పోయి టీడీఆర్ సర్టిఫికెట్లు పొందినవారు వాటిని విక్రయించుకునేందుకు ప్రత్యేకంగా ఎక్కడికో వెళ్లాల్సిన అవసరం ఉండదు. టీడీఆర్ సర్టిఫికెట్లు కావాల్సినవారు ఆన్‌లైన్ ద్వారానే వాటిని కొనుగోలు చేసేందుకు సంప్రదిస్తారు. జీహెచ్‌ఎంసీ కొం తకాలంగా రోడ్ల విస్తరణ, ఇతర ప్రాజెక్టుల్లో భూములు కోల్పోయేవారికి నష్టపరిహారం కింద డబ్బుకు బదులు టీడీఆర్ సర్టిఫికెట్లను అందిస్తున్న విషయం విదితమే. వాస్తవానికి 2000వ సంవత్సరంలోనే ఈ విధానాన్ని ప్రవేశపెట్టినప్పటికీ భూయజమానులు దీనిపై ఆసక్తి చూపకపోవడంతో 2017లో ప్రభుత్వం నిబంధనలు సవరించింది. ఇందులోభాగంగా డిసెంబర్ 2017లో వెల్లడించిన ఉత్తర్వుల ప్రకారం, మాస్టర్‌ప్లాన్ రోడ్ల విస్తరణలో భూములు సేకరిస్తే బాధితులకు 400శాతం, చెరువులు, నాలాలు, ఇతర నీటి వనరుల సంరక్షణ, అభివృద్ధిలో భాగంగా సేకరించే స్థలాలకు 200శాతం టీడీఆర్‌లు ఇవ్వాలని నిర్ణయించారు. దీంతో టీడీఆర్‌లకు గిరాకీ పెరిగింది. ముఖ్యంగా వ్యూహాత్మక రోడ్ల అభివృద్ధి ప్రణాళిక(ఎస్‌ఆర్‌డీపీ)లో భాగంగా చేపట్టిన రోడ్ల విస్తరణ, లింకురోడ్ల నిర్మాణం తదితరవాటికి ఎక్కువగా టీడీఆర్‌లే జారీచేశారు. దీనివల్ల భూయజమానులకు ప్రయోజనం కలగడమే కాకుండా జీహెచ్‌ఎంసీపై ఆర్థికభారం కూడా పడలేదు. ఇప్పటివరకు 550టీడీఆర్ సర్టిఫికెట్లు జారీ చేసినట్లు అధికారులు వెల్లడించారు. వీటిని కొందరు సొంతానికి వాడుకోగా, మరికొందరు ఇతరులకు విక్రయించుకున్నారు. అవసరంలేనివారు ఇతరులకు విక్రయించుకునేందుకు ఆన్‌లైన్ టీడీఆర్ బ్యాంకు ఓ వేదికగా చెప్పవచ్చు. టీడీఆర్ సర్టిఫికెట్ల క్రయవిక్రయాలకోసం ఈ ఆన్‌లైన్ అప్లికేషన్ ఎంతగానో దోహదపడుతుందని అధికారులు తెలిపారు. ఈ ఆన్‌లైన్ అప్లికేషన్ లో ఎవరివద్ద ఎంత విలువైన టీడీఆర్ సర్టిఫికెట్లు ఉన్నా యో తెలుసుకునే వీలుంది. అంతేకాదు, ఎవరైనా వాటి ని విక్రయిస్తే ఆ వివరాలు కూడా ఆన్‌లైన్‌లో నమోదవుతాయి. టీడీఆర్ బ్యాంకు అప్లికేషన్ కోసం http:// tdr.ghmc.telangana.gov.in:8080/ లింకును సంప్రదించవచ్చని అధికారులు చెప్పారు. లేకుంటే జీహెచ్‌ఎంసీ హోమ్‌పేజ్‌లో ఆన్‌లైన్ సర్వీసుల ఆప్షన్‌లోకి వెళ్లి టీడీఆర్ బ్యాంకు వివరాలు తెలుసుకోవచ్చని చెప్పారు.


logo