సోమవారం 30 మార్చి 2020
Hyderabad-city - Feb 07, 2020 , 01:32:12

వేలల్లో కొంటారు.. లక్షల్లో అమ్మేస్తారు

వేలల్లో కొంటారు.. లక్షల్లో అమ్మేస్తారు

దళారీ నుంచి అక్రమ రవాణాకు... 

  ఆంధ్రప్రదేశ్ కడప జిల్లా ప్రాంతానికి చెందిన వేముల బాబురెడ్డి, తూర్పు గోదావరి జిల్లాకు చెందిన గంగాధర్‌రెడ్డి హైదరాబాద్‌లోని అమీర్‌పేట్, హబ్సిగూడ, బేగంపేట్, పంజాగుట్ట, సికింద్రాబాద్, కింగ్ కోఠి, హైటెక్ సిటీ ప్రాంతాల్లో ఉన్న పలు ప్రముఖ సంతాన సాఫల్య కేంద్రాలకు బ్రోకర్‌లుగా పనిచేస్తున్నారు. కమీషన్లు తీసుకుని ఎగ్ డోనర్స్‌తో పాటు అదె ్దగర్భంకు సిద్ధంగా ఉన్న మహిళలను ఈ కేంద్రాలకు తీసుకువస్తారు. వీరు సంతాన సాఫల్య కేంద్రాల నిర్వాహకుల నుంచి కమీషన్ తీసుకుంటూ దందా నడిపిస్తున్నారు. 

దందాకు డిమాండ్ పెరుగడంతో..

ఇదిలా ఉండగా... ఈ దందాకు   డిమాండ్ పెరుగడంతో బాబురెడ్డి, గంగాధర్‌రెడ్డి పేదరికంలో ఉన్న చాలా మంది మహిళలను కలిశారు. ఈ విధంగా అనేక ప్రాంతాల్లో పరిచయాలను పెంచుకున్నారు. సంతాన సాఫల్య కేంద్రాలకు వచ్చి కూడా గర్భం దాల్చని వారిని, జీవితంలో సంతానం కారు... అని  కృంగిపోయి ఎట్టి పరిస్థితుల్లో శిశువులు కావాలనే వారిని టార్గెట్ చేసుకున్నారు. పిల్లలు కావాలన్న  ఆశలో ఉన్న దంపతులు.. పిల్లల కోసం లక్షలు చెల్లించడానికి సిద్ధంగా ఉన్న విషయాన్ని బాబురెడ్డి, గంగాధర్‌రెడ్డి గుర్తించారు. 

నెట్‌వర్క్ అప్రమత్తం

దీంతో వీరిద్దరూ తమ నెట్‌వర్క్‌ను అప్రమత్తం చేశారు. సంతానం లేనివారి కోసం పిల్లలను అక్రమ రవాణా చేద్దామని వివరించారు. దీని కోసం ఇతర రాష్ట్రాల నుంచి వచ్చి పనిచేసే మహిళలను ఎంచుకోవాలని సూచించారు. అంతేకాకుండా తండాల్లో పేదరికంలో ఉండే మహిళలను కలువాలని సూచించారు. ముఖ్యంగా అక్రమంగా గర్భం దాల్చి పిల్లలు వద్దనుకుని అబార్షన్‌కు సిద్ధమయ్యే వారిని గుర్తించాలని ప్రధాన సూత్రదారులు తమ నెట్‌వర్క్‌ను ఆదేశించారు. అలాంటి వారి నుంచి పిల్లలను ఎత్తుకొచ్చినా, డబ్బు ఆశపెట్టి తీసుకువచ్చినా భారీగా కమీషన్ ఇస్తామని నెట్‌వర్క్‌ను పురమాయించారు. 

రూ.మూడు నుంచి ఏడు లక్షలకు విక్రయం

తల్లులకు వేల రూపాయలు ఇచ్చి పిల్లలను తీసుకుంటున్న వీరు మాత్రం సంతానం లేనివారికి లక్షల రూపాయలకు విక్రయిస్తారు. ప్రధాన నిందితులిద్దరూ పిల్లల తల్లులకు రూ. 20 నుంచి 30 వేలు, మధ్యవర్తిగా ఉన్న మనుషులకు రూ. 30 వేల వరకు ఇస్తున్న బాబురెడ్డి, గంగాధర్‌రెడ్డి సంతానం లేని దంపతుల నుంచి రూ. 3 లక్షల నుంచి రూ.7 లక్షలు తీసుకుని పిల్లలను అమ్మేశారు. ఈ ముఠా అమ్మేసిన ఇద్దరు (15 నుంచి 20 రోజుల వయస్సు ) పసి పిల్లలను కాపాడిన పోలీసులు.. ఆ ఇద్దర్ని సఖీ కేంద్రానికి తరలించారు. 

తొమ్మిది మందిలో ఒకరు పరారీలో..

ఈ కేసులో తొమ్మిది మంది నిందితులుండగా ఎనిమిది మందిని అరెస్టు చేశారు. నిందితుల్లో ఒకరైన సీతారాం పరారీలో ఉన్నాడు. బాబురెడ్డిపై సికింద్రాబాద్ రైల్వే పీఎస్‌లో కేసు ఉండగా, గంగాధర్‌రెడ్డి పై చాంద్రాయణగుట్ట, బాలాపూర్, మాదన్నపేట్, ఛత్రినాక, శంషాబాద్, ఎస్‌ఆర్‌నగర్, గుంటూరు జిల్లాలోని  బండ్లమోటు పీఎస్ పరిధిలో పిల్లల అక్రమ రవాణపై కేసులు ఉన్నాయి. సమావేశంలో అల్వాల్ ఇన్‌స్పెక్టర్ యాదగిరి, ఎస్‌ఓటీ బాలానగర్ ఇన్‌స్పెక్టర్ సుధీర్, ఎస్‌ఐ వరప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.


logo