గురువారం 09 ఏప్రిల్ 2020
Hyderabad-city - Feb 07, 2020 , 01:21:53

పది విద్యార్థుల పాస్ బాధ్యత నాదే..

పది విద్యార్థుల పాస్ బాధ్యత నాదే..

సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ : అక్షరాభ్యాసంతో ఓనమాలు నేర్పిన పంతుళ్లు ఇప్పుడు కొత్త బాధ్యతను నెత్తికెత్తుకోబోతున్నారు. విద్యార్థులను ఎస్సెస్సీలో గట్టెక్కించే బాధ్యతను సవాల్‌గా స్వీకరించబోతున్నారు. నారుపోసిన వాడు నీరు పోయకమానడన్నట్లే పదో తరగతి గండం గట్టెక్కించేందుకు విద్యార్థులను దత్తత తీసుకోవడానికి సిద్ధమవుతున్నారు. నా వంతుగా నేను కొంత మందిని దత్తత తీసుకుంటున్నా.. వారిని పాస్ చేయించే బాధ్యత నాదేనంటూ డిక్లరేషన్‌ను ఇవ్వబోతున్నారు. ఇలా నెమ్మదస్తులను ఉత్తీర్ణులు చేసేందుకు జిల్లా విద్యాశాఖ సరికొత్త ప్రయోగానికి శ్రీకారం చుడుతున్నది. ఉపాధ్యాయులు ఐచ్చికంగా కొంత మందిని ఎంపిక చేసుకుని ఇలా చేయాలని పిలుపునిస్తున్నది. ఉపాధ్యాయుల్లో బాధ్యత పెంచేందుకు జిల్లా విద్యాశాఖ ఈ ప్రయోగాన్ని ఎంచుకున్నది. ప్రభుత్వ పాఠశాలల్లో చాలా మంది విద్యార్థులు ఫెయిల్ అవుతున్నారు. ఇలా ఏండ్లకేండ్లుగా జరుగుతున్నది. వాస్తవంగా ఉపాధ్యాయులు బాధ్యతగా వ్యవహరిస్తేనే ఫలితాల్లో పురోగతి సాధించగలమని గుర్తించిన విద్యాశాఖ వారి నుంచే ప్రయోగాలు మొదలుపెట్టింది. ఉపాధ్యాయులు తలచుకుంటే ఫలితాల్లో పురోగతి సాధించగలమని భావించిన అధికారులు, వారు శాయశక్తులా కృషి చేసి విద్యార్థులను సన్నద్ధం చేస్తే కాస్త మెరుగయ్యే అవకాశముండటంతో ఈ ప్రయోగాలను ఎంచుకున్నది.  ఇక పిల్లలు చేస్తున్న లోటుపాట్లను వాటిని సరిచేసి, అంతిమంగా విద్యార్థులను ఉత్తీర్ణులను చేయించాలన్న సంకల్పంతో అడుగులేస్తు న్నారు. 

కలెక్టర్ సమీక్ష..

జిల్లా కలెక్టర్‌గా బాధ్యతలు స్వీకరించిన శ్వేతా మహంతి విద్యాశాఖ నుంచే తన పనిని ప్రారంభించారు. ఎస్సెస్సీ ఫలితాలు జిల్లాలో అధ్వానంగా ఉండటంతో విద్యాశాఖ నుంచే గాడినపెట్టేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇందులో భాగంగా గురువారం విద్యాశాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారు. నాంపల్లిలోని కలెక్టరేట్‌లోని తన ఛాంబర్‌లోనే జిల్లా విద్యాశాఖాధికారి వెంకటనర్సమ్మ సహా ఇతర డిప్యూటీ ఈవోలతో సమీక్ష నిర్వహించారు. ఉత్తమ ఫలితాలు సాధించేందుకు విద్యాశాఖ అధికారులు ప్రత్యేక దృష్టిపెట్టి, గతేడాదికంటే మెరుగ్గా ఉండేలా కృషి చేయాలని ఆదేశించారు. సబ్జెక్ట్‌ల వారీగా నెమ్మదస్తులను గుర్తించి ప్రత్యేకంగా శిక్షణ ఇవ్వాలన్నారు. సబ్జెక్ట్‌ల ఉపాధ్యాయులు నెమ్మదస్తులను ఆయా సబ్జెక్ట్‌ల్లో ఉత్తీర్ణత సాధించేలా శిక్షణ ఇవ్వాలన్నారు.ప్రధానోపాధ్యాయుడి స్థాయిలో సూక్ష్మప్రణాళికలు తయారు చేసి, కచ్చితంగా అమలు చేయాలన్నారు. సీఆర్‌పీలు బాధ్యతలు తీసుకుని సత్ఫలితాలు సాధించేలా తర్పీదునివ్వాలన్నారు. పరీక్షలను పారదర్శకంగా నిర్వహించాలని, ఉపాధ్యాయులు చదువులో వెనుకబడిన విద్యార్థులను గుర్తించడమే కాకుండా వారికి సబ్జెక్ట్‌లలో ఉన్న సందేహాలను నివృత్తి చేసి మంచి ఫలితాలు వచ్చేలా చూడాలన్నారు. వివిధ స్వచ్ఛంద సంస్థలు సీఎస్‌ఆర్ కింద చేపడుతున్న పనులకు సంబంధించి సమగ్ర నివేదికను సమర్పించాలని డీఈవోను ఆదేశించారు. శాలసిద్ది కార్యక్రమానికి ప్రాధాన్యతనిచ్చి త్వరితగతిన అప్ లోడింగ్ పూర్తి చేయాలన్నారు.


logo