ఆదివారం 24 మే 2020
Hyderabad-city - Feb 06, 2020 , 02:24:49

నగరంలో కరోనా లేదు

నగరంలో కరోనా లేదు
  • 9మంది అనుమానితులకు ముందస్తు పరీక్షలు
  • గాంధీలో ముగ్గురు, కోరంటిలో నలుగురు చేరిక

నమస్తే తెలంగాణ-సిటీబ్యూరో: కరోనా వైరస్‌ విజృంభించిన నాటి నుంచి బుధవారం వరకు నగరంలో కరోనా వైరస్‌ నమోదు కాలేదు. అనుమానం తో పరీక్షలు చేయించుకున్న 25 మందికి ఎలాంటి వైరస్‌ లేదని వైద్యపరీక్షల ద్వారా ఇప్పటికే తేలిపోయింది. ఇదిలా ఉండగా జనవరి మాసంలో చైనా నుంచి భారత్‌కు వచ్చిన ఇండిగో విమానంలో ప్రయాణించిన వారిలో ఇద్దరు కేరళ వాసులు కరోనా పాజిటివ్‌కు గురైన విషయం తెలిసిందే. దీంతో సదరు విమానంలో వచ్చిన ప్రయాణికులందరికీ ముందుజాగ్రత చర్యగా కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు కేరళ బాధితులతో పాటు ఇండిగో విమానంలో ప్రయాణించిన వారి లో నలుగురు బుధవారం గాంధీకి చేరుకుని కరోనా పరీక్షలు చేయించుకున్నారు. వారిలో ఇద్దరు మహిళలు పరీక్షకు రక్తనమూనాలు ఇచ్చి వెళ్లిపోగా మరో ఇద్దరు దవాఖానలోని ప్రత్యేక వార్డులో చికిత్స పొందుతున్నారు. 


వీరితో పాటు మరో అనుమానిత రోగి సైతం గాంధీ ప్రత్యేక వార్డులో చేరి ముందస్తు చికిత్స పొందుతున్నాడు.  ఇదిలా ఉండగా ఫీవర్‌ హాస్పిటల్‌లో బుధవారం నలుగురు అనుమానిత రోగులు చేరి చికిత్స పొందుతున్నారు. వీరికి కూడా కరోనా వైరస్‌ నిర్ధారణ పరీక్షలు జరపనున్నట్లు వైద్యులు తెలిపారు. ఈనెల 4వరకు నగరంలో మొత్తం 25మంది అనుమానిత రోగులకు వైరస్‌ నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా అన్ని కేసులు నెగెటివ్‌గా వచ్చినట్లు వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి కార్యాలయం వెల్లడించింది. బుధవారం గాంధీ, ఫీవర్‌ హాస్పిటల్స్‌లో చేరిన 9మంది నివేదికలు రావల్సి ఉంది.  


logo