మంగళవారం 07 ఏప్రిల్ 2020
Hyderabad-city - Feb 06, 2020 , 02:08:12

‘బల్దియా’లో సోలార్‌ విద్యుత్‌

‘బల్దియా’లో సోలార్‌ విద్యుత్‌

 సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ/జీడిమెట్ల : శివారు జీహెచ్‌ఎంసీ సర్కిల్‌ కార్యాలయాలు కొత్తకొత్త ఆలోచనలతో ముందుకు సాగుతున్నాయి. కుత్బుల్లాపూర్‌, గాజులరామారం జంట సర్కిల్‌ కార్యాలయాలు టీఎస్‌ఎస్‌పీడీసీఎల్‌ నుంచి విద్యుత్‌ పొందుతూ ఏటా రూ.6 లక్షల విద్యుత్‌ బిల్లులు చెల్లిస్తున్నారు. అయితే బిల్లులకు స్వస్తి పలికేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు. 33 కిలో వాట్స్‌ సామర్థ్యంతో 13  లక్షల వ్యయంతో కుత్బుల్లాపూర్‌ సర్కిల్‌ కార్యాలయం భవనంపై  సోలార్‌ ప్యానెళ్ల ఏర్పాటు చేశారు.దీనిద్వారా ప్రతి నెలా 4వేల యూనిట్ల విద్యుత్‌ ఉత్పత్తి అవుతుందని ఇది జంట సర్కిళ్ల అవసరాలకు వాడుకున్నప్పటికీ ఇంకా మిగిలిపోతుందని అధికారులు పేర్కొంటున్నారు.


దశల వారీగా 

దశలవారీగా బల్దియాకు చెందిన మొత్తం 42భవనాల్లో సోలార్‌ విద్యుత్‌ను ఉత్పత్తి చేయాలని కార్యప్రణాళిక రూపొందించి అమలుచేస్తున్నారు.  గ్రీన్‌ అండ్‌ క్లీన్‌ పవర్‌ కార్యక్రమంలో భాగంగా తమకు సంబంధించిన అన్ని భవనాలపై సోలార్‌ విద్యుత్‌ వ్యవస్థను ఏర్పాటుచేయాలని నిర్ణయించిన జీహెచ్‌ఎంసీ, దీని సాధ్యాసాధ్యాలతోపాటు సమగ్ర ప్రాజెక్టు నివేదిక రూపకల్పన కోసం గతంలో ‘ది ఎనర్జీ అండ్‌ రిసోర్సెస్‌ ఇనిస్టిట్యూట్‌(టీఈఆర్‌ఐ)ను కన్సల్టెంటుగా నియమించింది. వారిచ్చిన నివేదిక ప్రకారం జీహెచ్‌ఎంసీకి చెందిన 58 కార్యాలయ భవనాలకుగాను 42 భవనాలపై సోలార్‌ విద్యుత్‌ వ్యవస్థ నెలకొల్పేందుకు అవకాశమున్నట్లు తేలింది. మొత్తం 42 భవనాలపై 15,557 చరదపు మీటర్ల విస్తీర్ణంగల జాగా ఉన్నట్లు గుర్తించిన టీఈఆర్‌ఐ, 941కేడబ్ల్యూపీ (కిలో వాట్‌ పవర్‌) సామర్థ్యంతో ఏడాదికి 15,60,000 యూనిట్ల విద్యుత్‌ను ఉత్పత్తి చేయవచ్చని నివేదికలో పేర్కొంది. 


టీఈఆర్‌ఐ నివేదిక ఆధారంగా తెలంగాణ రాష్ట్ర రెన్యువబుల్‌ ఎనర్జీ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌(టీఎస్‌ఆర్‌ఈడీసీఓ) ఆధ్వర్యంలో బల్దియాకు చెందిన 42 భవనాలపై సోలార్‌ విద్యుత్‌ వ్యవస్థను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఏర్పాటుతోపాటు ఐదేండ్లపాటు నిర్వహణ బాధ్యత కూడా ఈ సంస్థకే అప్పగిస్తున్నారు. మొత్తం భవనాలపై 25శాతం రాయితీపోగా 3.49కోట్లు ఖర్చవుతుందని అంచనా కాగా, దాని ద్వారా ఉత్పత్తి అయ్యే విద్యుత్‌ ద్వారా 30 నెలల్లోనే పెట్టుబడి తిరిగి వస్తుందని అధికారులు తెలిపారు.  25ఏండ్ల పాటు నిరంతరాయంగా విద్యుత్‌ ఉత్పత్తి జరుగుతుందని, మూడేండ్లలో పెట్టుబడి తీరిపోగా మిగిలిన 22 సంవత్సరాలపాటు రూ.1.40కోట్ల చొప్పున ఏటా విద్యుత్‌ చార్జీలు ఆదా అవుతాయన్నారు. నగరంలోని 12 రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వ కార్యాలయాల్లో టీఎస్‌ఆర్‌ఈడీసీఓ ఆధ్వర్యంలో ఇప్పటికే సోలార్‌ విద్యుత్‌ వ్యవస్థను ఏర్పాటుచేశారు. 


 వారంలో సోలార్‌ వెలుగులు.. 

కుత్బుల్లాపూర్‌ సర్కిల్‌ కార్యాలయంపై సోలార్‌ ప్లేట్స్‌ ఏర్పాటు పూర్తయింది. మీటర్ల కోసం దరఖాస్తు చేసుకున్నాం. మీటర్లు వచ్చిన వెంటనే ఇన్‌స్టాలేషన్‌ చేసి సోలార్‌ విద్యుత్‌ సరఫరా మొదలవుతుంది. సోలార్‌ విద్యుత్‌ ఉత్పత్తితో ప్రతి నెలా సుమారు రూ.50 వేల విద్యుత్‌ బిల్లులు సర్కిల్‌కు మిగులుతాయి. 

- రఘుపతి రెడ్డి, ఈఈ, ఎలక్ట్రికల్‌ విభాగం, జీహెచ్‌ఎంసీ


logo