శుక్రవారం 03 ఏప్రిల్ 2020
Hyderabad-city - Feb 06, 2020 , 02:05:10

కఠిన శ్రమతో.. ఏదైనా సాధించవచ్చు

కఠిన శ్రమతో.. ఏదైనా సాధించవచ్చు

ఉస్మానియా యూనివర్సిటీ, ఫిబ్రవరి 5 : విద్యార్థినులు విద్యను కష్టంతో కాకుండా ఇష్టంతో నేర్చుకోవాలని, కఠిన శ్రమతో ఏదైనా సాధించవచ్చని రాష్ట్ర గవర్నర్‌ డాక్టర్‌ తమిళిసై సౌందర్‌రాజన్‌ అన్నారు. ఉస్మానియా యూనివర్సిటీ క్యాంపస్‌లోని ఆంధ్ర మహిళా సభ ఆర్ట్స్‌ అండ్‌ సైన్స్‌ మహిళా కళాశాల 5వ స్నాతకోత్సవాన్ని బుధవారం ఘనంగా నిర్వహించారు. ఈ కళాశాల స్వతంత్ర ప్రతిపత్తి కలిగినది కావడంతో స్నాతకోత్సవాన్ని ప్రత్యేకంగా నిర్వహించి పట్టాలను ప్రదానం చేస్తారు. ఈ స్నాతకోత్సవంలో 2016-17, 2017-18, 2018-19 విద్యాసంవత్సరాలలో ఉత్తీర్ణత సాధించిన వారికి పట్టాలతో పాటు అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన వారికి బంగారు పతకాలను అందజేశారు. మొత్తం 401 మందికి డిగ్రీ పట్టాలు, 84 మందికి పీజీ పట్టాలు అందజేయగా, వారిలో డిగ్రీ వారికి 75, పీజీ వారికి తొమ్మిది బంగారు పతకాలు ప్రదానం చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర గవర్నర్‌ డాక్టర్‌ తమిళిసై సౌందర్‌రాజన్‌ హాజరై పట్టాలు అందుకున్న విద్యార్థులను అభినందించారు. మహిళా విద్య, సామాజిక విలువల కోసం పాటుపడుతున్న స్వచ్ఛంద సంస్థ అయిన ఏఎంఎస్‌ కళాశాల స్నాతకోత్సవానికి హాజరవ్వడం పట్ల ఆనందం వ్యక్తం చేశారు. విద్యార్థినుల భవిష్యత్తుకు తల్లిదండ్రుల ప్రోత్సాహం ఎంత అవసరమో గురువుల ప్రోత్సాహం కూడా అంతే అవసరమని చెప్పారు. తన ఉన్నత వెనుక కూడా గురువుల ప్రోత్సాహం ఎంతో ఉందని గుర్తు చేసుకున్నారు. 

మహిళలు అన్ని రంగాల్లో రాణించినప్పుడే దేశం అభివృద్ధి చెందుతుందని అభిప్రాయపడ్డారు. యువతులు వివాహం అనంతరం చదువును ఆపివేయకుండా కొనసాగించాలని, అప్పుడే వారు అనుకున్న లక్ష్యాలను నెరవేర్చుకోగలుగుతారని వివరించారు. ఇటీవల నగర శివారులో చోటు చేసుకున్న దిశ ఘటన తనను ఎంతో కలిచివేసిందన్నారు. స్త్రీల రక్షణ కోసం మార్షల్‌ ఆర్ట్స్‌ ఎంతో ఉపయోగపడుతాయని, విద్యార్థినులు చిన్న వయసులోనే దానిని నేర్చుకోవాలని సూచించారు. రాష్ట్రంలో ప్రాథమిక విద్య నుంచే పిల్లలకు మార్షల్‌ ఆర్ట్స్‌ నేర్పించేలా తగిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వానికి సూచించారు. 

ఈ కార్యక్రమంలో డీడీఎంఎస్‌ అధ్యక్షురాలు ఎన్‌.ఉషారెడ్డి, ఉపాధ్యక్షురాలు ఉషా కందా, ప్రధాన కార్యదర్శి లక్ష్మిసుందరి, కళాశాల చైర్‌పర్సన్‌ ప్రొఫెసర్‌ ఎం.ఉషా, సెక్రెటరీ కమ్‌ కరస్పాండెంట్‌ ప్రొఫెసర్‌ ఎం.శ్రీనివాస్‌, ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ డి.రాజేశ్వరి, వైస్‌ ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ పి.రాజ్యలక్ష్మి, కంట్రోలర్‌ ఆఫ్‌ ది ఎగ్జామినేషన్స్‌ డాక్టర్‌ కె.కిరణ్మయి, ఐక్యూఏసీ కోఆర్డినేటర్‌ డాక్టర్‌ కరుణాదేవి, అధ్యాపకులు, ఉద్యోగులు, విద్యార్థినులు, వారి తల్లిదండ్రులు హాజరయ్యారు.


logo