శనివారం 04 ఏప్రిల్ 2020
Hyderabad-city - Feb 05, 2020 , 02:04:19

మూడు మార్గాలు.. 69 కిలోమీటర్లు

మూడు మార్గాలు.. 69 కిలోమీటర్లు
  • ఎంజీబీఎస్‌ నుంచి జూబ్లీ వరకు రైలు సౌకర్యంతో దేశంలోనే రెండో అతిపెద్ద మెట్రోగా అవతరణ
  • మూడు కారిడార్లు అనుసంధానం మెట్రో ప్రాజెక్టులో మొదటి దశ పూర్తి
  • రోజువారీ సేవలకు 7.63 లక్షల యూనిట్ల విద్యుత్తు

సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ : హైదరాబాద్‌  ప్రజారవాణా ముఖ చిత్రాన్ని మార్చేసిన మెట్రోరైలు నిర్మాణం పూర్తికావస్తున్నది. 7న సాయంత్రం 4 గంటలకు జేబీఎస్‌ నుంచి ఎంజీబీఎస్‌ వరకు సీఎం కేసీఆర్‌ చేతులమీదుగా ప్రారంభానికి సన్నద్ధం చేస్తుండటంతో దాదాపు మొదటిదశ మెట్రోరైలు ప్రాజెక్టు పూర్తవుతుంది. ప్రపంచంలో అతిపెద్ద పబ్లిక్‌ ప్రైవేట్‌ ప్రాజెక్టు (పీపీపీ) ప్రాజెక్టుగా నిర్మించబడిన హైదరాబాద్‌ మెట్రోరైలు అనేక అవాంతరాల మధ్య సవాళ్లను ఎదుర్కొని ప్రయాణికులకు సేవలందిస్తున్నది. దేశంలో అతిపెద్ద రెండో మెట్రోరైలు ప్రాజెక్టుగా ఖ్యాతి దక్కించుకుంది. ఢిల్లీ మొదటి స్థానంలో ఉండగా హైదరాబాద్‌ మెట్రోరైలు రెండో స్థానంలో ఉన్నది. డిజైన్‌, బిల్డ్‌, ఫైనాన్స్‌, ఆపరేట్‌, ట్రాన్స్‌ఫర్‌ (డీబీవోటీ) విధానంలో నిర్మించిన హైదరాబాద్‌ మెట్రో పీపీపీ విధానంలో ప్రపంచంలో 200 మెట్రోరైలు ప్రాజెక్టులు నిర్మించగా అందులో ఏడు మాత్రమే విజయవంతమయ్యాయి. అందులో హైదరాబాద్‌ మెట్రోరైలు ఉండటం విశేషం. జేబీఎస్‌-ఎంజీబీఎస్‌ మెట్రో మార్గం అందుబాటులోకి రావడం ద్వారా కారిడార్‌ 1, కారిడార్‌ 3 మార్గాలకు అనుసంధానం కావడంతో నగర ప్రయాణికులకు సులభతరమైయ్యింది. 

 మెట్రోరైలు మొదటిదశ పూర్తి..

జూబ్లీబస్‌స్టేషన్‌ నుంచి ఎంజీబీఎస్‌  మార్గంలో 11 కిలోమీటర్ల దూరంతో ప్రయాణిస్తుంది కారిడార్‌ 2 రూట్‌. రోడ్డు మార్గం ద్వారా అనేక అవాంతరాలతో  ప్రయాణిస్తే ఒక గంట 10 నిమిషాలు ప్రయాణం పడుతుంది. అదే మెట్రో మార్గం పూర్తయి మెట్రోరైలులో ప్రయాణిస్తే  11 కిలోమీటర్ల దూరాన్ని కేవలం  16 నిమిషాల్లో చేరుకుంటాం. ఈ మార్గంలో 9 స్టేషన్లుంటాయి.


స్టేషన్లు : జేబీఎస్‌, సికింద్రాబాద్‌ వెస్ట్‌, గంధీ దవాఖాన, ముషీరాబాద్‌, ఆర్టీసీ ఎక్స్‌ రోడ్స్‌, చిక్కడపల్లి, నారాయణగూడ, సుల్తాన్‌ బజార్‌, ఎంజీబీఎస్‌ స్టేషన్లు. 


కారిడార్‌ 1 (29 కిలోమీటర్లు) - స్టేషన్లు (27)

మియాపూర్‌ నుంచి ఎల్బీనగర్‌ మధ్య ప్రయాణిస్తుంది. నగరంలో ట్రాఫిక్‌ చిక్కుల మధ్య ఒక గంట 45 నిమిషాలు ప్రయాణ సమయం తీసుకుంటుందని అంచనా వేశారు. మెట్రోలో ప్రయాణిస్తే ఈ దూరాన్ని కేవలం 52 నిమిషాల వ్యవధిలో చేరుకోవచ్చు. ఎటువంటి ట్రాఫిక్‌ చిక్కులు లేకుండా కాలుష్యం బారిన పడకుండా. సమయం వృథాకాకుండా నిర్ణీత సమయంలోగా గమ్యస్థానం చేరవచ్చు.

స్టేషన్లు : మియాపూర్‌, జేఎన్‌టీయూ కాలేజీ, కేపీహెచ్‌బీ కాలనీ, కూకట్‌పల్లి, బాలనగర్‌ అంబేద్కర్‌ స్టేషన్‌, ముసాపేట్‌, భరత్‌నగర్‌, ఎర్రగడ్డ, ఐఎస్‌ఐ దవాఖాన, ఎస్‌ఆర్‌నగర్‌, అమీర్‌పేట్‌, పంజాగుట్ట, ఖైరతాబాద్‌, లక్డీకాపూల్‌, అసెంబ్లీ, నాంపల్లి, గాంధీ భవన్‌, ఉస్మానియా మెడికల్‌ కాలేజీ, ఎంజీ బస్‌స్టేషన్‌, మలక్‌పేట్‌, న్యూమర్కెట్‌, ముసారాంబాగ్‌, దిల్‌సుఖ్‌నగర్‌, చైతన్యపురి, విక్టోరియా మెమోరియల్‌, ఎల్బీనగర్‌.

 కారిడార్‌ 3 (29 కి.మీటర్లు)- స్టేషన్లు (24)

నాగోల్‌ నుంచి రాయదుర్గం వరకు 29 కిలోమీటర్ల మేర ప్రయాణించనున్న ఈ మార్గం ఇప్పటికే  నాగోల్‌ నుంచి అమీర్‌పేట వరకు పూర్తి కాగా ప్రయాణికులను గమ్యస్థానాలకు చేర్చుతున్నది,  29 కిలోమీటర్ల ప్రయాణాన్ని రోడ్డు మార్గం ద్వారా రెండు గంటల్లో బస్సు ద్వారా చేరుకుంటుంది. ఇదే దూరాన్ని మెట్రో ప్రయాణంలో 50 నిమిషాల్లో చేరవచ్చు.

స్టేషన్లు :  రాయదుర్గ్‌, హైటెక్‌సిటీ, దుర్గం చెరువు, మాదాపూర్‌, పెద్దమ్మగుడి, జూబ్లీహిల్స్‌ చెక్‌పోస్టు, రోడ్‌నంబర్‌ 5 జూబ్లీహిల్స్‌, యూసుఫ్‌గూడ, మధురానగర్‌, అమీర్‌పేట్‌, బేగంపేట, ప్రకాశ్‌నగర్‌, రసూల్‌పుర, ప్యారడైజ్‌, సికింద్రాబాద్‌ ఈస్ట్‌, మెట్టుగూడ, తార్నాక, హబ్సిగూడ, ఎన్‌జీఆర్‌ఐ, స్టేడియం, ఉప్పల్‌, నాగోల్‌.

మెట్రోరైలుకు  ప్రతిరోజు 7.63 లక్షల యూనిట్ల విద్యుత్‌..

మెట్రోరైలు ప్రయాణానికి విద్యుత్‌ భారీగా అవసరముంటుంది. అందుకోసం ప్రభుత్వం ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. మెట్రోరైలుకు కావాల్సిన విద్యుత్‌ అవసరాల కోసం ప్రతిరోజు 7.63 లక్షల యూనిట్ల విద్యుత్‌ అవసరముంటుంది. దీనికోసం  ఉప్పల్‌, మియాపూర్‌, యూసుఫ్‌గూడ, ఎంజీబీఎస్‌  ప్రాంతాల్లో 220/ 132 కేవీ సామర్థ్ధ్యం గల సబ్‌స్టేషన్లను ఏర్పాటు చేశారు. అక్కడి నుంచి మెట్రో కు ప్రత్యేక లైన్లు వేసి రిసీవింగ్‌ సబ్‌స్టేషన్లలో ఏయిర్‌ ఇన్సులేటెడ్‌ సబ్‌స్టేషన్లు, మెట్రోరైలు ఆపరేషన్స్‌తోపాటు, స్టేషన్లు, డిపోలు, వ్యాపార సముదాయాల నిర్వహణకు విద్యుత్‌ సరఫరా చేస్తున్నారు. మెట్రోరైలు పరుగులకు ఎటువంటి అంతరాయం లేకుండా టీఎస్‌ఎస్‌పీడీసీఎల్‌ ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. ప్రత్యేక లైన్ల ద్వారా విద్యుత్‌ను రిసీవింగ్‌ సబ్‌స్టేషన్లకు పంపించి అక్కడి నుంచి మెట్రోస్టేషన్లకు సరఫరా చేస్తారు. ఒక సబ్‌స్టేషన్‌ నుంచి సాంకేతిక సమస్య తలెత్తినా మరో సబ్‌స్టేషన్‌ నుంచి విద్యుత్‌ సరఫరా అయ్యేలా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేశారు. రోజుకు 7.63 లక్షల యూనిట్ల విద్యుత్‌ ఖర్చయ్యే మెట్రోరైలు నెలకు 22.9 కోట్ల యూనిట్లను ఖర్చు చేయనున్నది. రైళ్ల ఆపరేషన్స్‌ కోసం ఒక్కో యూనిట్‌ కరెంటుకు రూ.3.95కు ప్రభుత్వం సబ్సిడీతో అందిస్తుండగా, స్టేషన్ల నిర్వహణ, మెట్రోషాపింగ్‌ మాల్స్‌కు మాత్రం యూనిట్‌కు రూ.10కి అందిస్తున్నది. ఖర్చయ్యే విద్యుత్‌ను ఆటోమేటిక్‌ మీటర్లతో రికార్డు చేస్తున్నారు.

మైలురాళ్లు

ఏప్రిల్‌ 19, 2012 :హైదరాబాద్‌ మెట్రోరైలు నిర్మాణంలో భాగంగా పిల్లర్ల నిర్మాణానికి ప్రథమంగా ఏప్రిల్‌ 19,2012లో ఉప్పల్‌ సమీపంలో భూమి పూజ  జరిగింది. ఉమ్మడి రాష్ట్రంలో అప్పటి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పంకజ్‌ ద్వివేది మొదటి పిల్లర్‌ నిర్మాణానికి పూజ చేశారు.  మే 17, 2019 నాటికి ఎంజీబీఎస్‌లో 2599 పిల్లర్‌ నిర్మాణం చేసుకోవడంతో మూడు కారిడార్లకు సంబంధించి 69 కిలోమీటర్ల మెట్రో మార్గానికి సంబంధించి పిల్లర్లు పూర్తయ్యాయి. గత 7 సంవత్సరాల్లో సగటున రోజుకో పిల్లరును పూర్తిచేశారు. ఇందులో సాధారణ పిల్లరు 1569 కాగా 224 కాంటీలివర్‌ నిలంలకంలె, 602 స్టేషన్‌ పిల్లర్లు, 51 హేమర్‌హెడ్‌ పిల్లర్లు, 153 పోర్టల్‌ పిల్లర్లను నిర్మించారు.

నవంబర్‌ 28,2017 : నవంబర్‌ 28,2017న సీఎం కేసీఆర్‌తో కలిసి ప్రధానమంత్రి నరేంద్రమోడీ మియాపూర్‌ నుంచి అమీర్‌పేట వరకు 13 కిలోమీటర్లు, అమీర్‌పేట నుంచి నాగోల్‌ వరకు (17) కిలోమీటర్లు మొత్తం 30 కిలోమీటర్ల మార్గాన్ని మియాపూర్‌ స్టేషన్‌ వద్ద ప్రారంభించారు. అనంతరం మంత్రి కేటీఆర్‌, సీఎం కేసీఆర్‌, ప్రధానమంత్రి మోడీ మెట్రోరైలులో ప్రయాణించారు.

సెప్టెంబర్‌ 24, 2018 :సెప్టెంబర్‌ 24,2018న అమీర్‌పేట నుంచి ఎల్బీనగర్‌ వరకు పట్టణాభివృద్ధి మంత్రి కేటీఆర్‌తో కలిసి అప్పటి గవర్నర్‌ ఈఎస్‌ఎల్‌ నరసింహన్‌ ప్రారంభించారు. ఎల్బీనగర్‌ వరకు మెట్రోలో ప్రయాణించారు.


మార్చి 20,2019 :మార్చి 20,2019న అమీర్‌పేట నుంచి హైటెక్‌సిటీ వరకు గల 10 కిలోమీటర్ల మార్గాన్ని అప్పటి గవర్నర్‌ ఈఎస్‌ఎల్‌ నరసింహన్‌ చేతుల మీదుగా ప్రారంభించారు.

నవంబర్‌ 29,2019 :నవంబర్‌ 29,2019న హైటెక్‌సిటీ నుంచి రాయ్‌దుర్గ్‌ 1.5 కిలోమీటర్ల మార్గాన్ని పట్టణాభివృద్ధిశాఖ మంత్రి కేటీఆర్‌, రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌ కలిసి ప్రారంభించారు. హైటెక్‌సిటీ నుంచి రాయదుర్గ్‌ వరకు మెట్రోరైలు అధికారులతో కలిసి ప్రయాణించారు

ఫిబ్రవరి 7, 2020 :ఫిబ్రవరి 7,2020న సీఎం కేసీఆర్‌ చేతుల మీదుగా జేబీఎస్‌ నుంచి ఎంజీబీఎస్‌ వరకు మెట్రో రాకపోకలు సాగించడానికి నిర్మించిన కారిడార్‌ 2ను సాయంత్రం 4 గంటలకు ప్రారంభిస్తారు. 11 కిలోమీటర్ల పొడవు ఉన్న ఈ కారిడార్‌లో మంత్రి కేటీఆర్‌, ఇతర మంత్రులు కలిసి ప్రయాణించనున్నారు.


logo