ఆదివారం 24 మే 2020
Hyderabad-city - Feb 05, 2020 , 02:00:25

సుపరిపాలనే నా కర్తవ్యం

సుపరిపాలనే నా కర్తవ్యం

  పారదర్శకమైన పరిపాలన..

 జిల్లా ప్రజలకు పారద్శకమైన పరిపాలన అందించడమే తన ధ్యేయం. మేడ్చల్‌ జిల్లాపై సంపూర్ణ అవగాహన ఉందని అయితే ప్రధానంగా ప్రజల సమస్యల పరిష్కారం,ప్రభుత్వ భూముల పరిరక్షణ వంటి అంశాలపై దృష్టి సారిస్తానని కలెక్టర్‌ తెలిపారు. 

అర్హులకే సంక్షేమ ఫలాలు...

ప్రభుత్వ సంక్షేమ ఫలాలను అర్హులకు అందించేందుకు కృషి చేస్తాను. అవినీతికి తావులేకుండా ప్రభుత్వ పథకాలను విజయవంతంగా పూర్తి చేస్తాను. విద్యావ్యవస్థను  గాడిలో పెట్టి, పాఠశాల విద్యలో మెరుగైన ఫలితాలు సాధించేందుకు కృషి చేస్తాను. ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు మౌలిక వసతులు కల్పిస్తా. జిల్లాలో కలెక్టరేట్‌తో పాటు ఇతర శాఖల పనితీరును ఎప్పటికప్పుడు పరిశీలించి చర్యలు తీసుకొంటా. జిల్లాలో అడ్మిస్ట్రేషన్‌పై దృష్టి సారించాను.ప్రస్తుతం జిల్లా పరిధిలోని అన్ని శాఖల పనితీరుపై వరుస సమీక్షలుంటాయి. 

ప్రగతి బాటలు వేస్తాం...

నూతనంగా ఆవిర్భవించిన మేడ్చల్‌ జిల్లాను అభివృద్ధి పథంలో రాష్ట్రంలోనే మేటిజిల్లాగా నిలిపేందుకు శాయశక్తులా కృషిచేస్తాను. జిల్లాలో ఉన్న వనరులను సద్వినియోగం చేసుకుంటూ.. ప్రగతి బాటలు నిర్మిస్తాం.జిల్లా భౌగోళిక స్థితిగతులపై సంపూర్ణ అవగాహన ఉంది. అధికారుల, ప్రజల,ప్రజాప్రతినిధులతో మమేకమై పనిచేస్తా.  

పుష్కలంగా అవకాశాలు...

మేడ్చల్‌ జిల్లా పల్లె, పట్టణ, నగర ప్రాంతాలతో మిళితమై ఉంది. అలాగే పారిశ్రామిక రాజధానిగా కీర్తించబడుతోంది. జిల్లా పరిధిలో వనరులకు కొదువలేదు. అనేకనేక పరిశ్రమలు, పారిశ్రామికవాడలు, ఐటీరంగం, సెజ్‌లుఇలా.. అనేక రంగాల్లో మేడ్చ ల్‌ జిల్లా ప్రగతి పథంలో దూసుకుపోతుంది. ఈ రంగాలకు సమ ప్రాధాన్యతనిచ్చి మరింతగా అభివృద్ధి చేసేందుకు ప్రయత్నిస్తా. పారిశ్రామిక రంగం విస్తరణను మరిన్ని చర్యలు తీసుకుంటాం.

ప్రభుత్వ సేవలను విస్తరిస్తాం..

జిల్లాలో విద్య, వైద్య రంగాలను మరింత విస్తరిస్తాం. ముఖ్యం గా ఈరంగాలకు అత్యంత ప్రాధాన్యతనిస్తాం.ప్రభుత్వ నిర్ణయాలకు అనుగుణంగానే మారుమూల ప్రాంతాలకు చెందిన నిరుపేదల పక్షాన ఉండేందుకు ప్రయత్నిస్తాం. 

జన సాంధ్రత ఎక్కువ

జిల్లా నూతనంగా ఆవిర్భవించినా నగర శివారులో ఎక్కువ జనసాంద్రతతో వైవిధ్యాన్ని కనబరుస్తోంది. సంక్షేమ పథకాల అమలులో లబ్ధ్దిదారులు పోటీపడే అవకాశాలున్నాయి.అర్హులకు న్యాయం జరిగేలా చూస్తా.ఇక్కడ వ్యవసాయం, హార్టికల్చర్‌, పశుపోషణతో జీవనం సాగించే వారు ఎక్కువ.ఈరంగాలను పొత్సహించేందుకు ప్రభుత్వం నుంచి ప్రొత్సాహాకాలు అందేలా చర్యలు తీసుకుంటాను.  

పేదలకు డబుల్‌ ఇండ్లు...

ప్రభుత్వం మేడ్చల్‌ జిల్లాలో సుమారు 40వేల డబుల్‌ బెడ్‌రూం ఇండ్లను నిర్మిస్తోంది. ఇందులో కొన్ని ప్రాంతాల్లో దాదాపుగా ఇండ్ల నిర్మాణాలు పూర్తయ్యాయి.ప్రాధాన్యత క్రమంలో అర్హులైన పేదలకు డబుల్‌ బెడ్‌రూం ఇండ్లను కేటాయించేందుకు చర్యలు తీసుకుంటాం. 


logo