గురువారం 09 ఏప్రిల్ 2020
Hyderabad-city - Feb 05, 2020 , 01:53:58

రోడ్ల నాణ్యతలో తేడావస్తే బ్లాక్‌ లిస్టే..

రోడ్ల నాణ్యతలో తేడావస్తే బ్లాక్‌ లిస్టే..

సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ : రోడ్ల రూపురేఖలు మార్చాలనే సంకల్పంతో ప్రభుత్వం ప్రైవేటు ఏజెన్సీలకు నిర్వహణ బాధ్యతలు అప్పగించింది. అయినా పరిస్థితిలో మార్పు రాకుంటే కఠినంగా వ్యవహరించాలని నిర్ణయించింది. కాంట్రాక్టు ఏజెన్సీని బ్లాక్‌లిస్టు చేయడంతోపాటు సంబంధిత ఇంజినీర్‌పై కూడా కఠిన చర్యలు తీసుకోవాలని, అవసరమైతే విధుల నుంచి సస్పెండ్‌ చేయాలని నిర్ణయించారు. ఈ క్రమంలోనే తాజాగా పనుల నాణ్యతను పరిశీలించే బాధ్యతను ఇంజినీరింగ్‌ కాలేజీల ఆధ్వర్యంలో థర్డ్‌పార్టీ ఏజెన్సీకి అప్పగించేందుకు సన్నాహాలు చేస్తున్నారు.

సమగ్ర రోడ్ల నిర్వహణ కార్యక్రమం(సీఆర్‌ఎంపీ)కింద ఐదేండ్లపాటు ప్రైవేటు ఏజెన్సీల ఆధ్వర్యంలో నగరంలోని ప్రధాన రోడ్లను నిర్వహించాలని నిర్ణయించి టెండర్ల పద్ధతిలో గత ఏడాది డిసెంబర్‌లోనే వారికి బాధ్యతలు అప్పగించిన విషయం తెలిసిందే. కాగా, ఫిబ్రవరి మొదటివారం నుంచి వారు పనులు ప్రారంభించారు. రోడ్ల పరిస్థితిలో కచ్చితంగా మార్పు కనబడాలని, నాణ్యత విషయంలో రాజీపడరాదని  పురపాలక శాఖ మంత్రి కేటీఆర్‌ పలు దఫాలు జీహెచ్‌ఎంసీ అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. దీంతో వారు నాణ్యతా ప్రమాణాలపై ప్రత్యేక దృష్టి కేంద్రీకరించారు. థర్డ్‌పార్టీ నాణ్యతా పరీక్షల బాధ్యతను వివిధ ఇంజినీరింగ్‌ కాలేజీలకు అప్పగించాలని నిర్ణయించారు. జోన్‌కి ఒకటి చొప్పున ఇంజినీరింగ్‌ కాలేజీని ఎంపిక చేసేందుకు టెండర్లు పిలుస్తున్నారు. కాలేజీకి కచ్చితంగా సకల సౌకర్యాలతో కూడిన ల్యాబ్‌ ఉండడంతోపాటు కనీసం పదేండ్ల అనుభవం ఉండాలని షరతు విధిస్తున్నారు. మొదలు సంబంధిత ఏజెన్సీ ఆధ్వర్యంలోని నాణ్యతా పరీక్షల విభాగం, అనంతరం జీహెచ్‌ఎంసీ ఇంజినీర్లు నాణ్యతా పరీక్షలు నిర్వహిస్తారు. ఆ థర్డ్‌పార్టీ ఆధ్వర్యంలో రోడ్లను పరిశీలించి నాణ్యతను పరిశీలిస్తారు. ఈ క్రమంలో ఎక్కడ నాణ్యతలేనట్లు తేలినా మొదటిసారి సంబంధింత ఇంజినీర్‌కు, అలాగే ఏజెన్సీకి షోకాజ్‌ నోటీసు జారీ చేస్తారు. రెండోసారి తప్పుదొర్లితే ఇంజినీర్‌ను సస్పెండ్‌ చేయడంతోపాటు సంబంధిత ఏజెన్సీని బ్లాక్‌ లిస్టులో పెడుతారు. 

నాణ్యతపై ప్రజలూ ఫిర్యాదు చేయవచ్చు 

 రోడ్ల నిర్వహణపై ప్రజలకు ఏమైనా ఫిర్యాదులుంటే వెంటనే వాటిని తెలియజేసేందుకు తగిన ఏర్పాట్లు చేయాలని నిర్ణయించారు. ఫిర్యాదు చేసేందుకు వీలుగా కూడళ్లలో ఆయా ఏజెన్సీల పేర్లు, పర్యవేక్షకుల ఫోన్‌ నంబర్లతో కూడిన సైన్‌బోర్డులను ఏర్పాటు చేస్తారు. ఎక్కడైనా రోడ్డు పాడైనా, డ్రైనేజీ దెబ్బతిన్నా, సెంట్రల్‌ మీడియన్‌ బాగలేకున్నా, ఇతరత్రా ఏ విధమైన సమస్య తలెత్తినా వెంటనే స్థానికులు ఆ నంబర్‌ ఆధారంగా వారిని సంప్రదించి ఫిర్యాదు చేయవచ్చు. లేకుంటే జీహెచ్‌ఎంసీకి కూడా ఫోన్‌ చేయవచ్చు. ప్రజల నుంచి వచ్చే ఫిర్యాదులు కూడా రికార్డు అవుతాయి. రోడ్ల నిర్వహణ బాధ్యతలు చేపట్టే ఏజెన్సీలు తప్పనిసరిగా తమ సిబ్బంది ద్వారా ఆయా రోడ్లను ఎప్పటికప్పుడు పర్యవేక్షించే విధంగా ప్రణాళికలు రూపొందించారు. పర్యవేక్షకులకు ప్రత్యేకంగా డ్రెస్‌ కోడ్‌ను కూడా నిర్ధారించారు. 


logo