గురువారం 02 ఏప్రిల్ 2020
Hyderabad-city - Feb 05, 2020 , 01:31:55

ఆధునిక టాయిలెట్లు రాబోతున్నాయ్‌!

ఆధునిక టాయిలెట్లు రాబోతున్నాయ్‌!

సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ : నగరంలో అత్యాధునిక నమూనాలతో టాయిలెట్లు నిర్మించనున్నారు. దీనికోసం మంగళవారం పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి అరవింద్‌కుమార్‌ జీహెచ్‌ఎంసీ అధికారులతో కలిసి తమ కార్యాలయంలో టాయిలెట్లకు సంబంధించిన పది రకాల నమూనాలను పరిశీలించారు. ముంబైకి చెందిన ఆర్కిటెక్ట్‌ కల్పిత్‌ ఆశర్‌ వీటిని రూపొందించారు. ప్రస్తుతం ఈ నమూనాలను రాజస్థాన్‌లోని జైపూర్‌, ఉదయ్‌పూర్‌, అజ్మీర్‌, బికనేర్‌, కోటా తదితర ఏడు పట్టణాల్లో 34 ప్రదేశాల్లో నిర్మిస్తున్నట్లు ఆయన తెలిపారు. ప్రయాణికులు, మహిళలు, వికలాంగులు, పిల్లలు తదితర వర్గాలకు చెందిన వారికి అనువుగా ఉండే నమూనాలు ఇందులో ఉన్నట్లు తెలిపారు. పోర్టబుల్‌ టాయిలెట్స్‌, బస్టాప్‌, రైల్వేస్టేషన్‌, పేవ్‌మెంట్‌, హై-వే, అర్బన్‌, అంగన్‌వాడీ, కమ్యూనిటీ, పార్కు తదితర నమూనాలు ఇందులో ఉన్నాయన్నారు. పర్యావరణహితమైన అంశాలను దృష్టిలో ఉంచుకొని శానిటేషన్‌, టెక్నాలజీ, రీసైక్లింగ్‌, నిర్వహణ, నిర్మాణశైలి తదితర అంశాలను వీటిల్లో పొందుపర్చినట్లు ఈ సందర్భంగా ఆర్కిటెక్ట్‌ అధికారులకు వివరించారు. నగరంలో జోన్‌కు 500 చొప్పున 3000 టాయిలెట్లు నిర్మించాలని పురపాలకశాఖ మంత్రి కే.టీ. రామారావు ఇటీవలే జీహెచ్‌ఎంసీ అధికారులకు లక్ష్యాన్ని నిర్ధారించారు. ఈ నేపథ్యంలో ఆయా టాయిలెట్ల నమూనాలను పరిశీలించిన అరవింద్‌కుమార్‌ సాధ్యమైనంత వరకు త్వరగా స్థలాల ఎంపిక పూర్తిచేసి ఆయా ప్రాంతాలకు అనుగుణంగా నిర్మించే టాయిలెట్ల నమూనాలను ఎంపిక చేయాలని అధికారులను ఆదేశించారు. ఇంజినీరింగ్‌ అధికారులందరినీ ఇందులో భాగస్వాములను చేయాలని ఆయన కోరారు. జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ లోకేశ్‌కుమార్‌తోపాటు ఇతర అధికారులు ఈ టాయిలెట్‌ నమూనాలను పరిశీలించారు. logo