సోమవారం 06 ఏప్రిల్ 2020
Hyderabad-city - Feb 04, 2020 , 04:07:56

‘ఆయుష్‌' విభాగాన్ని బలోపేతం చేస్తాం

‘ఆయుష్‌' విభాగాన్ని  బలోపేతం చేస్తాం
  • గాంధీలో త్వరలో మాతా శిశుసంరక్షణ కేంద్రం
  • ఐదు వైద్యశాలల్లో రూ.43.24కోట్లతో అభివృద్ధి పనులు
  • ఎంఎన్‌జే కాన్సర్‌ దవాఖానలో రూ. 13 కోట్లతో పెట్‌-సిటీ స్కాన్‌
  • ప్రారంభించిన మంత్రి ఈటల రాజేందర్‌


సిటీబ్యూరో, నమస్తేతెలంగాణ/ బన్సీలాల్‌పేట్‌/ వెంగళ్‌రావునగర్‌: ఆయుష్‌ విభాగాన్ని పూర్తి స్థాయిలో బలోపేతం చేస్తామని మంత్రి ఈటల రాజేందర్‌ పేర్కొన్నారు. గాంధీ దవాఖానలో మాతా శిశు సంరక్షణ కేంద్రాన్ని నెలకొల్పుతామన్నారు. నగరంలోని గాంధీ, ఎంఎన్‌జే, ఉస్మానియా, సుల్తాన్‌బజార్‌ మెటర్నరీ హాస్పిటల్‌, ఎర్రగడ్డలోని ఆయుర్వేద దవాఖానలను మంత్రి సోమవారం సందర్శించారు. ఈ వైద్యశాలల్లో మొత్తం రూ.43. 24కోట్ల వ్యయంతో అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవం చేశారు. తొలుత గాంధీ దవాఖానలో వైద్య విద్యార్థుల కోసం రూ.10.64 కోట్లతో నిర్మించిన లైబ్రరీ, పరిక్షా హాలును ప్రారంభించారు. 


నగరంలోని గాం ధీ, ఎంఎన్‌జె, ఉస్మానియా, సుల్తాన్‌బజార్‌ మెటర్నరీ హాస్పిటల్‌, ఎర్రగడ్డలోని ఆయుర్వేద దవాఖానల్లో వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్‌ సోమవారం ఉద యం నుంచి సాయంత్రం వరకు పర్యటన చేశారు. ఐదు దవాఖానల్లో మొత్తం రూ.43.24కోట్ల వ్యయంతోఅభివృద్ధి పనులను ప్రారంభించారు. గాంధీ వైద్య కళాశాలలోని వైరాలజీ ల్యాబ్‌ను సందర్శించి అక్కడ తీసుకుంటున్న చర్యలను పరిశీలించారు. దవాఖానలకు మరిన్ని సదుపాయలు కల్పిస్తామని చెప్పారు.


గాంధీలో రూ.10.64లక్షలతో...

గాంధీ దవాఖానలో రూ.10.64 కోట్లతో నిర్మించిన ఈ-అకడమిక్‌ భవనంలో వైద్య విద్యార్థుల కోసం లైబ్రరీ, పరీక్షాహాలును ప్రారంభించారు. వైద్య కళాశాలలోని నాలుగో అంతస్తులోని వైరాలజీ ల్యాబోరేటరిని సందర్శించారు. అనంతరం ఓపిలోని ఈఎన్‌టీ విభాగం ఆధ్వర్యంలో ‘మీనాక్షి వెంకట్రామన్‌ ఫౌండేషన్‌' సహకారంతో ఏర్పాటు చేసిన పిలల్లో వినికిడి సమస్యలను గుర్తించే ‘ఇయర్‌ టు హియర్‌' కేంద్రం తోపాటు చర్మవ్యాధుల చికిత్సా విభాగంలో అత్యాధునిక లేజర్‌ చికిత్సాయంత్రాలను ప్రారంభించారు. త్వరలో గాంధీ దవాఖానలో మాతా,శిశు సంరక్షణాకేంద్రం నిర్మాణాన్ని ప్రారంభిస్తామన్నారు. అప్పుడే పుట్టిన చిన్నారులకు వినికిడి సమస్యలు ప్రారం భ దశలోనే గుర్తిస్తే, చికిత్స సులభంగా చేయవచ్చని, అందుకే నూతన ‘ఇయర్‌ టు హియర్‌' కేంద్రం ఎంతో ఉపయోగపడుతుందన్నారు. గాంధీ దవాఖానలో ఉన్న పలు సమస్యలను తెలుసుకున్నామని, రెండు,మూడు నెలల్లోగా వాటిని పరిష్కరించడానికి కృషి చేస్తామని తెలిపారు. కార్యక్రమంలో టీఎస్‌ఎంఐడీసీ చైర్మన్‌ పర్యాద కృష్ణమూర్తి, బన్సీలాల్‌పేట్‌ కార్పొరేటర్‌ కె.హేమలత, గాంధీ వైద్య కళాశాల వైస్‌ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ నాగమణి, డాక్టర్‌ సులేమాన్‌, గాంధీ దవాఖాన సూపరింటెండెంట్‌ డాక్టర్‌ పి.శ్రావణ్‌కుమార్‌, డిప్యూటీ సూపరింటెండెంట్‌ డాక్టర్‌ జీ.నర్సింహారావు నేత, ఆర్‌ఎంఓలు డాక్టర్‌ జయకృష్ణ తదితరులు పాల్గొన్నారు.  


ఎంఎన్‌జె క్యాన్సర్‌ దవాఖానలో..

ఎంఎన్‌జె క్యాన్సర్‌ దవాఖానలో మంత్రి ఈటల స్థానిక ఎమ్మెల్యే జాఫర్‌ హుస్సేన్‌, ఎమ్మెల్సీ ప్రభాకర్‌,డిప్యూటీ మేయర్‌ బాబా ఫసీయుద్దీన్‌, దవాఖాన డైరెక్టర్‌ డా.జయలత, ఆర్‌ఎంఒ డా.శ్రీనివాస్‌లతో కలిసి వార్డులను పరిశీలించారు. పిల్లల వార్డును సందర్శించి వారిని పలకరించారు. వారికి అందుతున్న వైద్యసేవలను చిన్నారుల తల్లిదండ్రులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం రూ.13కోట్లతో ఏర్పాటు చేసిన పెట్‌-సిటీ స్కాన్‌ యంత్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ నిరుపేదలకు రూపాయి ఖర్చులేకుండా ఎంఎన్‌జెలో క్యాన్సర్‌ వ్యాధులకు చికి త్స చేస్తున్నారని, పెట్‌-సిటీ స్కాన్‌తో రోగిలో క్యాన్సర్‌ పుట్టుక, అది శరీరంలో ఎక్కడెక్కడ వ్యాపించింది తదితర విషయాలను తెలుసుకోవచ్చన్నారు. బయట ఈ స్కాన్‌ ఖరీదు రూ.25వేల వరకు ఉంటుందని ఎంఎన్‌జెలో రూపాయి ఖర్చులేకుండా ఉచితంగా చేయనున్నట్లు మంత్రి వెల్లడించారు. క్యాన్సర్‌ రోగులకు ఎంఎన్‌జె ఆపద్భాందువులా ఆదుకుంటుందన్నారు. అరబిందో ఫార్మ సహకారంతో రూ.40కోట్లతో నూతనంగా అంకాలజి బ్లాక్‌ను నిర్మిస్తున్నామని సంవత్సరంలోపు ఈ బ్లాక్‌ అందుబాటులోకి తీసుకురానున్నట్లు తెలిపారు. దేశంలో నాన్‌ కమ్యూనికేబుల్‌ డెత్స్‌ 60శాతం పెరిగిపోతున్నట్లు మంత్రి ఆవేదన వ్యక్తం చేశారు. అందుకే రోగం వచ్చిన తర్వాత చికిత్స అందించడంతోపాటు వ్యాధులు రాకుండా ముందస్తు జాగ్రతలు పాటించేలా ప్రజలకు అవగాహన కల్పిస్తున్నట్లు తెలిపారు.  


ఆయుర్వేద దవాఖానలో పంచకర్మ బ్లాక్‌ 

ఎర్రగడ్డలోని ప్రభుత్వం ఆయుర్వేద దవాఖాన నగర ప్రజలకే కాకుండా పక్క రాష్ర్టాలకు చెందిన వేలాదిమంది రోగులకు ఉచిత వైద్యాన్ని అందిస్తున్నట్టు మంత్రి ఈటల రాజేందర్‌ అన్నారు. వెంగళరావునగర్‌ డివిజన్‌ పరిధిలోని ఎర్రగడ్డ ప్రభుత్వ ఆయుర్వేద వైద్యశాలలో నూతనంగా నిర్మించిన వీఐపీ పంచకర్మ బ్లాకు, మినీ ఫార్మసీ విభాగాలను సోమవారం జూబ్లీహిల్స్‌ ఎమ్మెల్యే మాగంటి గోపీనథ్‌తో కలిసి మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఓల్డ్‌ ఈజ్‌ గోల్డ్‌ అన్నట్లుగా మన పురాతన ఆచారాలు వ్యవహారాలు, వైద్యాలను ప్రజలు ఆదరిస్తున్నారని తెలిపారు. ముఖ్యంగా ఆయుర్వేదం అంటే దర్ఘకాలిక రోగాలకు సైతం అతితక్కువ ఖర్చుతో పూర్తిగా నయం అవుతుందని నమ్ముతుననారని పేర్కొన్నారు. అల్లోపతిలో పూర్తిగా నయం కాకపోయినా, ఆయుర్వేదం ద్వారా తప్పకుండా తగ్గిపోతుందని ప్రజ లు నమ్ముతున్నట్టు తెలిపారు. ముఖ్యంగా కీళ్లనొప్పు లు, మోకాళ్ల నొప్పులు, వెన్నెపూస సమస్యలు, పక్షవాతం లాంటి రోగాలకు ప్రజలు ఆయుర్వేదం వైదాన్ని ఎక్కువగా విశ్వసిస్తున్నారన్నారు. ముఖ్యమంత్రి ఆదేశాల మేర కు ఆయూష్‌ విభాగాన్ని పూర్తిస్థాయిలో బలోపేతం చేయడానికి అన్ని రకాల చర్యలు తీసుకంటున్నట్లు తెలిపారు. 


ఇందులోభాగంగానే ఎర్రగడ్డ ప్రభుత్వ ఆయుర్వేద దవాఖానలో రూ.60 లక్షలతో కొత్త వీఐపీ పంచకర్మ బ్లాక్‌, మినీ ఫార్మాసీని ఏర్పాటు చేశామన్నారు. భవిష్యత్తులో దవాఖానకు ఎంతమంది రోగులు వచ్చినా అందరికీ ఇక్కడే సదుపాయాలు కల్పించి, చికిత్స అందించడానికి అన్ని చర్యలు తీసుకుంటామని హామీనిచ్చారు. దవాఖానలో కావాల్సిన మేర వైద్య, వైద్యేతర సిబ్బంది మందులు, ఇత మౌలిక సదుపాయాలు కల్పనకు విశేష కృషి చేస్తున్నట్టు తెలియజేశారు. కార్యక్రమంలో జీహెచ్‌ఎంసీ డిప్యూటీ మేయర్‌ బాబాఫసియుద్దీన్‌, స్థానిక కార్పొరేటర్‌ కిలారి మనోహర్‌, డివిజన్‌ టీఆర్‌ఎస్‌ పార్టీ అధ్యక్షురాలు దేదీప్యరావు, ఆయుర్వేద వైద్య కళాశాల ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ చిలువూరి రవీందర్‌, దవాఖాన సూపరింటెండెంట్‌ డాక్టర్‌ ఏ. పరమేశ్వర్‌నాయక్‌, లే సెక్రటరీ బి.స్వరూపారాణి, సీనియర్‌ మెడికల్‌ ఆఫీసర్‌ రామచంద్రారెడ్డి, అర్‌ఎంఓ డాక్టర్‌ శివరామన్‌, డాక్టర్‌ సూర్యప్రకాశ్‌,  డాక్టర్‌ యశోద, తదితరులు పాల్గొన్నారు.


సుల్తాన్‌బజార్‌ దవాఖానలో రూ.17కోట్లతో... 

సుల్తాన్‌బజార్‌ ప్రసూతి దవాఖానలో రూ.17కోట్లతో 150 పడకల సామర్థ్ధ్యం గల నూతన భవనానికి మంత్రి ఈటల ప్రారంభోత్సవం చేశారు. ఈ సందర్భగా దవాఖానలో తిరిగి వార్డులను పరిశీలించారు. logo