గురువారం 02 ఏప్రిల్ 2020
Hyderabad-city - Feb 04, 2020 , 03:56:07

పల్లె ప్రజలకు ఓ ‘హెల్త్‌ ప్రొఫైల్‌'

పల్లె ప్రజలకు ఓ ‘హెల్త్‌ ప్రొఫైల్‌'

మేడ్చల్‌ జిల్లా, నమస్తే తెలంగాణ ప్రతినిధి: ఆరోగ్య తెలంగాణకు ఇప్పుడే బీజం వేయాలనే రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌ వ్యాఖ్యలను స్పూర్తిగా తీసుకొని టీఆర్‌ఎస్‌  నాయకులు మర్రి రాజశేఖర్‌ రెడ్డి మేడ్చల్‌ జిల్లాలో వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. జిల్లా పరిధిలోని మేడ్చల్‌ మండల పరిధిలోని సుమారు 14 గ్రామాలను, ఆ ప్రాంతంలోని 49 ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు ఉచితంగా వైద్య పరీక్షలు నిర్వహించడంతో పాటు ప్రత్యేకంగా గ్రామాల్లో ప్రతి వ్యక్తికి, ప్రతి విద్యార్థికి హెల్త్‌ ప్రొఫైల్‌ను రూపొందిస్తున్నారు. వీర హెల్త్‌కేర్‌ సొల్యూషన్స్‌ సహాకారంతో, నిపుణులైన వైద్య బృందం సమక్షంలో ఎంఎల్‌ఆర్‌ ఫార్మసీ కళాశాల విద్యార్థులు ప్రత్యేక మోబైల్‌ వాహనంలో గ్రామాల్లో గడప గడపకు వెళ్లి ప్రజలకు వైద్య పరీక్షలను నిర్వహించడంతో పాటు సుమారు 36 ఆరోగ్యపరమైన అంశాలపై వివరాలను సేకరించి హెల్త్‌ప్రొఫైల్‌లో పొందుపరుస్తున్నారు. 


అత్యవసర సమయాల్లో....

సాధారణంగా గ్రామాల్లో నిత్యం వైద్య పరీక్షలు చేయించుకునే వారి సంఖ్య చాలా తక్కువగా ఉంటుంది. దీంతో ఏదేని పెద్ద అనారోగ్య సమస్య వచ్చినప్పుడు ఆ వ్యక్తులకు చాలా రకాల వైద్య పరీక్షలు చేయాల్సి ఉంటుంది. అలాగే రోడ్డు ప్రమాదాలు జరిగినప్పుడు అత్యవసర సమయాల్లో రక్తం ఎక్కిద్దామంటే అతని బ్లడ్‌ గ్రూపుకు సంబంధించిన వైద్య పరీక్షలు చేయాల్సిందే. దీంతో కొంత వరకు అత్యవసర చికిత్సకు ఆటంకం కలుగుతుంది. అయితే ఒక వ్యక్తి సాధారణ ఆరోగ్య అంశాలు హెల్త్‌ ప్రొఫైల్‌లో ఉండటం వలన ఎమర్జెన్సీ వైద్యంను సులభంగా అందించవచ్చని వైద్యులు పేర్కొంటున్నారు. విద్యార్థులు, వారి తల్లిదండ్రుల అనారోగ్య అంశాలు, వాటిని నివారించేందుకు తీసుకోవల్సిన అంశాలపై ఒక అవగాహనకు వచ్చే అవకాశం ఉంటుందని వారు పేర్కొంటున్నారు. ఇందులో ముఖ్యంగా ఒక గ్రామంలో చాలా మంది విద్యార్థులకు చర్మ సమస్యలుంటే అక్కడి నీరు, వారు తీసుకుంటున్న ఆహారంలో మార్పులు వంటివి చేయోచ్చని, ఎక్కవ మందిలో రక్తహీనత ఉంటే వారికి ఇవ్వాల్సిన మెడిసిన్‌తో పాటు రక్తహీనతను నివారించేందుకు తీసుకోవల్సిన ఆహారంపై వారికి అవగాహన కల్పించడం జరుగుతుందని శాంపిల్‌ సేకరిస్తున్న ప్రతినిధులు తెలిపారు. అలాగే గ్రామంలో చాలా మందిని అనారోగ్య సమస్యలుంటే ఆ గ్రామంలో పారిశుద్ధ్యం, తాగునీటి సరఫరా, ఆహార కల్తీ వంటి అంశాలపై దృష్టి సారించేలా పాలకవర్గాలకు సూచనలు చేయనున్నట్లు వారు ‘నమస్తే తెలంగాణ’కు తెలిపారు. 


ప్రత్యేక యాప్‌లో నిక్షిప్తం...

గ్రామ ప్రజల నుంచి, ప్రభుత్వ పాఠశాలల విద్యార్థుల నుంచి సేకరించిన అంశాలపై ప్రత్యేకంగా రూపొందించిన యాప్‌లో భద్రపరుస్తామని, ఇది పూర్తిగా వ్యక్తిగతమని మర్రి రాజశేఖర్‌ రెడ్డి ‘నమస్తే తెలంగాణ’తో తెలిపారు. ప్రభుత్వ నిబంధనలు, వ్యక్తిగత సమాచార రక్షణ చట్టం-2018 నిబంధనలకు లోబడి ఈ హెల్త్‌ ప్రొఫైల్‌ను రూపొందిస్తున్నామని, ఈ వివరాలను చాలా గోప్యంగా ఉంచుతామని ఆయన తెలిపారు. వీర హెల్త్‌కేర్‌ సొల్యూషన్స్‌, మర్రి లక్ష్మారెడ్డి గ్రూప్‌ ఆఫ్‌ ఇనిస్టిట్యూషన్స్‌, అధ్యాపకులు, విద్యార్థుల సహాకారంతో శాంపిల్స్‌ను సేకరించి యాప్‌లో భద్రపరుస్తామని ఆయన తెలిపారు. అనారోగ్య అంశాలతో పాటు కుటుంబ జీవన ప్రమాణాలు, ఆర్థిక వ్యవహారాలపై కూడా పలు వివరాలను సేకరిస్తున్నామని, ఇలా అన్ని రకాల అంశాలను సేకరించి గ్రామ, మండల, జిల్లా స్థాయి ప్రజా ప్రతినిధులు, అధికారుల దృష్టికి తీసుకెళ్లి సమస్యల పరిష్కారం కొరకు ప్రయత్నం చేస్తామని రాజశేఖర్‌ రెడ్డి తెలిపారు. మేడ్చల్‌లో 20వేల మంది విద్యార్థుల హెల్త్‌ప్రొఫైల్‌ను తయారు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామని, ఇందులో ఇప్పటి వరకు 6వేల మంది విద్యార్థుల హెల్త్‌ప్రొఫైల్‌ను రూపొందించామని తెలిపారు. అలాగే మొత్తం 14 గ్రామాల్లో 6 గ్రామాల్లో హెల్త్‌ప్రొఫైల్‌ను రూపొందించినట్లు మర్రి రాజశేఖర్‌ రెడ్డి తెలిపారు. 


logo