బుధవారం 01 ఏప్రిల్ 2020
Hyderabad-city - Feb 03, 2020 , 04:36:33

ఎండల్లో నీటి ఎద్దడి రానివ్వం

ఎండల్లో నీటి ఎద్దడి రానివ్వం
  • నీటి ఎద్దడి నివారణకు జలమండలి సమ్మర్‌యాక్షన్‌ ప్లాన్‌
  • డివిజన్‌ల వారీగా ప్రత్యేక నిధులు కేటాయింపు
  • గతేడాది కంటే ఆశాజనకంగా గోదావరి, కృష్ణా నీటి నిల్వలు
  • సమ్మర్‌ తాగునీటికి ఎలాంటి ఢోకా ఉండదనిప్రజలకు అధికారుల భరోసా
  • బోర్‌వెల్స్‌, చేతిపంపుల పునరుద్ధరణకు చర్యలు

సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ : రాబోయే వేసవిలోనూ సమృద్ధిగా నీరందించేందుకు సిద్ధంగా ఉన్నామని ప్రజలకు జలమండలి భరోసానిస్తున్నది. నగరానికి నీరందించేందుకు ముఖ్యభూమిక పోషిస్తున్న కృష్ణా, గోదావరి జలాశయాల్లో నీటి నిల్వలు పుష్కలంగా ఉన్నాయని, సింగూరు, మంజీరా జలాలపై ఆధారపడిన ప్రాంతాల్లోనూ పానీ పరేషాన్‌ ఉండబోదని స్పష్టం చేస్తున్నది. కృష్ణా, గోదావరితో పాటు జంట జలాశయాలు ఉస్మాన్‌సాగర్‌, హిమాయత్‌సాగర్‌లో నీటి నిల్వలు ఆశాజనకంగా ఉన్నాయని, సమ్మర్‌ను సమర్థవంతంగా ఎదుర్కొనేలా అవసరమైన సమ్మర్‌యాక్షన్‌ఫ్లాన్‌ను సిద్ధం చేశామని అధికారులు  పేర్కొంటున్నారు. గ్రేటర్‌ హైదరాబాద్‌ ప్రజలకు ప్రస్తుతం రోజూ అందిస్తున్న 460 మిలియన్‌ గ్యాలన్ల (ఎంజీడీ)ను వేసవిలోనూ అందిస్తామని,  ఎక్కడ నీటి కోతలు విధించకుండా నీటి ఎద్దడిని ఎదుర్కొంటామని అధికారులు తెలిపారు. ఈ మేరకు బోర్‌వెల్స్‌, చేతిపంపుల పునరుద్ధరించి తిరిగి వాటిని వినియోగంలోకి తీసుకురావడం, సమస్యాత్మక ప్రాంతాలను గుర్తించి ట్యాంకర్ల ద్వారా దాహార్తి తీర్చేందుకు కార్యాచరణ ప్రణాళికలను సిద్ధం చేశారు. 


ఈ క్రమంలోనే ప్రతి ఏడాది తరహాలోనే ఈ సారి డివిజన్‌ల వారీగా రూ.10లక్షల చొప్పున ప్రత్యేక బడ్జెట్‌ సమకూర్చారు. సీజీఎం పరిధిలో రూ.7.50లక్షల నిధులు ప్రత్యేకంగా అందుబాటులో ఉంచారు. అత్యవసర మరమ్మతులకు తక్షణమే నిధులు మంజూరు చేస్తూ నీటి సరఫరాలో ఎలాంటి కొరత రాకుండా పకడ్బందీ చర్యలు తీసుకోవాలని ఈ మేరకు ఉన్నతాధికారులకు ఎండీ దానకిశోర్‌ ఆదేశాలు జారీ చేశారు. వేసవిలో కలుషిత నీటి సమస్య ఎక్కువ అవకాశం ఉన్న నేపథ్యంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలని, ఫిర్యాదు వచ్చిన క్షణాల్లో సంబంధిత సమస్యకు పరిష్కారం చూపాలని, ఈ విషయంలో ఎన్ని నిధులైన వెచ్చించేందుకు వెనుకాడవద్దని అధికారులకు ఆదేశాలు అందాయి. కాగా గతేడాది కంటే కృష్ణా జలాలు పుష్కలంగా ఉండడంతో అత్యవసర పంపింగ్‌ అవసరం లేకుండా నీటి సరఫరా జరుగనుంది. 


ట్రాన్స్‌కో అధికారుల సమన్వయంతో పంపింగ్‌ 

సుదూర ప్రాంతాల నుంచి పంపింగ్‌ ద్వారా జంట నగరాలకు నీటి సరఫరా జరుగుతుంది. అయితే పంపింగ్‌ సమయంలో విద్యుత్తు సరఫరా కీలకం. అందుకే ట్రాన్స్‌కో అధికారుల సమన్వయంతో నీటి పంపింగ్‌ జరిపేందుకు అధికారులు ప్రత్యేక చర్యలు చేపడుతున్నారు. ఎక్కడ అవాంతరాలు లేకుండా ముందస్తు చర్యలు చేపట్టి నీటి సరఫరా ప్రక్రియ సజావుగా సాగేలా చర్యలు తీసుకుంటామని ట్రాన్స్‌మిషన్‌ విభాగం అధికారులు తెలిపారు. సంస్థ మెట్రో కస్టమర్‌ కేర్‌ (ఎంసీసీ 155313)కి ఫోన్‌ చేసి ట్యాంకర్‌ బుకింగ్‌ చేసుకున్న వారికి మాత్రమే ట్యాంకర్‌ నీరు చేరుతుందని, వినియోగదారులు సైతం ఎంసీసీలో బుకింగ్‌ చేసుకున్నప్పటి నుంచి ఏ దశలో ట్యాంకర్‌ ఉందో సమగ్ర వివరాలను నేరుగా వినియోగదారుడికే సమాచారం అందజేసి ట్యాంకర్‌ సరఫరాలో ఇబ్బందులు లేకుండా చూస్తామని అధికారులు పేర్కొన్నారు. సింగూరు, మంజీరా జలాలపై ఆధారపడిన ప్రాంతాల్లో ప్రత్యేకంగా దృష్టి సారిస్తామని, అవసరమైన చోట్ల అదనపు ట్యాంకర్ల ద్వారా నీరు అందిస్తామని అధికారులు తెలిపారు.


నీటి వృథాపై విస్తృత అవగాహన 

జలమండలి సరఫరా చేస్తున్న మంచినీటిలో 170 మిలియన్‌ గ్యాలన్లు (77కోట్ల లీటర్ల) వృథాను అరికట్టడానికి జలమండలి చేపట్టిన వాక్‌ కార్యక్రమం నగరవ్యాప్తంగా చేపడుతున్నారు. ఈ వేసవిలో నీటి అవసరంపై ప్రజల్లో చైతన్యం తీసుకువచ్చేందుకుగానూ రెండు రోజుల కిందట 16 ఎన్జీవోలు, 300 మంది ఎన్జీవోల ప్రతినిధులు రంగంలోకి దిగారు. నీటి సంరక్షణలో భాగంగా అవగాహనకు సంబంధించిన కరపత్రాలు, సామగ్రిని అందజేశారు. వేసవి వరకు కొంత మేరకు మంచినీరు పొదుపు చేసి పెడితే వేసవిలో నీటి ఇక్కట్లు తగ్గుతాయని వివరించనున్నారు. మంచినీరు అధికంగా వృథాగా అవుతున్న ప్రాంతాల్లో ఇంటింటికీ వెళ్లి వీరు మంచినీటి ప్రాముఖ్యతను వివరించి నీటి వృథాను అరికట్టడానికి ప్రజల్లో చైతన్యం కలిగిస్తారని అధికారులు తెలిపారు. 


logo
>>>>>>