బుధవారం 01 ఏప్రిల్ 2020
Hyderabad-city - Feb 03, 2020 , 04:31:38

వన జాతరకు ఆర్టీసీ సిద్ధం

వన జాతరకు ఆర్టీసీ సిద్ధం
  • నగరం నుంచి మేడారానికి 500 ప్రత్యేక బస్సులు
  • ఫిబ్రవరి 2 నుంచి 8 వరకుఅందుబాటులో బస్సులు
  • అమ్మవార్ల గద్దెల వరకు ఆర్టీసీ బస్సులు
  • రంగారెడ్డి రీజియన్‌ రీజనల్‌ మేనేజర్‌ వరప్రసాద్‌

సుల్తాన్‌బజార్‌, ఫిబ్రవరి 2 : ఆసియాలోనే అతిపెద్ద జాతర అయిన సమ్మక్క, సారలమ్మ జాతరకు రంగారెడ్డి రీజియన్‌ నుంచి భక్తులను చేరవేసేందుకు ఏర్పాట్లు పూర్తి చేశారు. రంగారెడ్డి రీజియన్‌ ఆధ్వర్యంలో 500 ప్రత్యేక బస్సులను గిరిజన జాతరకు సిద్ధం చేసినట్లు రంగారెడ్డి రీజియన్‌ రీజనల్‌ మేనేజర్‌ వరప్రసాద్‌ పేర్కొన్నారు. ఈ మేరకు ఆదివారం ఎంజీబీఎస్‌లోని కాన్ఫరెన్స్‌ హాల్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ మేడారం జాతరకు గత యేడాది 375 బస్సులను నడిపించి 35 వేల మంది భక్తులను చేరవేయగా ఈ యేడాది ఫిబ్రవరి 2వ తేదీ నుంచి 8వ తేదీ వరకు 500 ప్రత్యేక బస్సులను నడిపించి 50 వేల మంది భక్తులను చేరవేసే విధంగా అన్ని ఏర్పాట్లు పూర్తి చేయడం జరిగిందన్నారు.


రంగారెడ్డి రీజియన్‌ నుంచి 500 బస్సులు

గిరిజన జాతరకు రంగారెడ్డి రీజియన్‌ పరిధిలోని ఏడు ప్రాంతాల నుంచి 500 బస్సులను నడిపేందుకు ఇప్పటికే ఆర్టీసీ ఉద్యోగులకు శిక్షణ కార్యక్రమాన్ని పూర్తి చేయడం జరిగిందన్నారు. ప్రధానంగా ఎంజీబీఎస్‌ నుంచి 267, జేబీఎస్‌ నుంచి 94, దిల్‌సుఖ్‌నగర్‌, ఉప్పల్‌ క్రాస్‌ రోడ్‌, జగద్గిరిగుట్ట నుంచి 36, కేపీహెచ్‌బీ నుంచి 36, మియాపూర్‌ నుంచి 23, లింగంపల్లి నుంచి 23, నేరెడ్‌మెట్‌ నుంచి 21 బస్సులను నడుపనున్నట్లు తెలిపారు. ఇందుకు గాను రంగారెడ్డి రీజియన్‌లోని ఏడు డిపోల బస్సులు అందుబాటులో ఉంటాయన్నారు. ప్రయాణీకుల విన్నపం మేరకు ఈ యేడాది లాల్‌దర్వాజ మమంకాళి ఆలయం నుంచి ప్రత్యేక బస్సులు నడుపుతున్నట్లు వివరించారు. సుమారు 50 వేల నుంచి 60 వేల మంది ప్రయాణికులను చేరవేయడమే లక్ష్యంగా వారం రోజుల పాటు 100 మంది అధికారులు జాతర విధుల్లో ఉంటారని తెలిపారు. రద్దీకి అనుగుణంగా అన్ని డిపో మేనేజర్‌ స్థాయి అధికారులను ఆయా ప్రత్యేక పాయింట్లలో, అంతే కాకుండా మేడారంలో కూడా ఒక డిపో మేనేజర్‌ తిరిగి హైదరాబాద్‌ చేరుకునే వరకు ప్రయాణికుల సౌకర్యార్థం అందుబాటులో ఉంచడం జరిగిందన్నారు. మేడారం జాతరకు వెళ్లే ప్రయాణికులకు ఆన్‌లైన్‌లో రిజర్వేషన్‌ సౌకర్యాన్ని కల్పించడం జరిగిందన్నారు. ప్రయాణికులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవచ్చన్నారు. అంతేకాకుండా నగరంలో ఏ ప్రాంతంలోనైనా 50 మంది ఒకేసారి మేడారం జాతరకు వెళ్తుంటే అటువంటి వారి వద్దకే బస్సును పంపే విధంగా చర్యలు తీసుకోవడం జరిగిందన్నారు. ప్రైవేటు బస్సులను ఆశ్రయించకుండా ఆర్టీసీ బస్సులలో సురక్షితమైన ప్రయాణం చేయాలని ప్రయాణికులకు విజ్ఞప్తి చేశారు.


2 నుంచి 8వ తేదీ వరకూ బస్సుల వివరాలు

మేడారం జాతరకు నగరం నుంచి ఫిబ్రవరి 2 నుంచి 8 వరకు ప్రయాణికుల సౌకర్యార్థ్ధం 500 ప్రత్యేక బస్సులను నడుపుతున్నారు. ఎంజీబీఎస్‌, జేబీఎస్‌, దిల్‌సుఖ్‌నగర్‌, ఉప్పల్‌ క్రాస్‌ రోడ్‌, జగద్గిరిగుట్ట, కేపీహెచ్‌బీ, మియాపూర్‌, లింగంపల్లి, లాల్‌దర్వాజ మహంకాళి తదితర ప్రత్యేక పాయింట్ల నుంచి ఫిబ్రవరి 2 వ తేదీన 30, 3న 35, 4న 40, 5న 100, 6న 120, 7న 140, 8న 35 బస్సులను నడుపుతున్నట్లు ఆర్‌ఎం వరప్రసాద్‌ పేర్కొన్నారు. ప్రయాణికులు అడ్వాన్స్‌ రిజర్వేషన్‌ ఆన్‌లైన్‌ www.tsrtconline. in లో రిజర్వేషన్‌ పొందవచ్చన్నారు.


logo
>>>>>>