శనివారం 04 ఏప్రిల్ 2020
Hyderabad-city - Feb 02, 2020 , 01:01:32

సహపోరు.. పుర పోరును తలపించాలి

సహపోరు.. పుర పోరును తలపించాలి

రంగారెడ్డి జిల్లా, నమస్తే తెలంగాణ : సహకార ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ పార్టీ సత్తా చాటాలని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితారెడ్డి, కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి పిలుపునిచ్చారు. రానున్న సహకార సంఘం ఎన్నికలపై శనివారం ఉమ్మడి రంగారెడ్డి జిల్లా పరిధిలోని ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, జడ్పీ చైర్‌పర్సన్‌లతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రులు మాట్లాడుతూ మున్సిపల్‌ ఎన్నికల్లో మాదిరిగానే అన్ని సొసైటీలపై టీఆర్‌ఎస్‌ జెండా ఎగురవేయాలన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ రైతు సంక్షేమం కోసం అనేక సంక్షేమ పథకాలు చేపట్టి దేశంలోనే అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారన్నారు. రైతుబంధు పథకం, రుణమాఫీ, సకాలంలో ఎరువుల పంపిణీ, సబ్సిడీ విత్తనాలు, రైతు భీమా తదితర వాటితో వ్యవసాయం దండగ అన్న వారికి పండగలాగా ముఖ్యమంత్రి మార్చారని మంత్రులు అన్నారు. రెండేండ్లలో రైతు బీమా ద్వారా ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో రూ.100 కోట్లకు పైగా 2164 బాధిత రైతు కుటుంబాలకు అందించడం జరిగిందన్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత రాష్ట్రంలో వ్యవసాయానికి అధిక ప్రాధాన్యత ఇవ్వడం జరిగిందన్నారు. 


ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో రైతు బంధు ద్వారా దాదాపు రూ.500 కోట్లు ప్రస్తుత సంవత్సరం రబీ, ఖరీఫ్‌లలో అందించడం జరిగిందన్నారు. ఇందులో ఖరీఫ్‌లో 4లక్షల 60వేలకుపై చిలుకు, రబీలో 3లక్షల 67వేల పై చిలుకు మంది అన్నదాతలకు రైతు బంధు ద్వారా లబ్ధి చేకూరిందని వారు పేర్కొన్నారు. సహకార సంఘాల బలోపేతానికి అనేక చర్యలు తీసుకున్నట్లు చెప్పారు. ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ గెలుపుతోనే మరింత అభివృద్ధి సాధ్యమవుతుందన్నారు. ప్రభుత్వం రైతుల కోసం ప్రవేశపెట్టి అమలు చేస్తున్న పథకాలను ప్రచారం చేయాలని వారు సూచించారు. ఈ సమావేశంలో రంగారెడ్డి జిల్లా జడ్పీ చైర్‌పర్సన్‌ తీగల అనితారెడ్డి, ఎమ్మెల్యేలు కేపీ వివేకానంద, కిషన్‌రెడ్డి, ప్రకాశ్‌గౌడ్‌, రోహిత్‌రెడ్డి, ఆనంద్‌, సుభాష్‌రెడ్డి, మహేశ్‌రెడ్డి, కాలె యాదయ్య, ఎమ్మెల్సీ శంభీపూర్‌ రాజు, యెగ్గే మల్లేశం తదితరులు పాల్గొన్నారు. 


logo