గురువారం 02 ఏప్రిల్ 2020
Hyderabad-city - Feb 01, 2020 , 04:42:18

కొత్తగా మూడు వేల టాయిలెట్లు ..

 కొత్తగా మూడు వేల టాయిలెట్లు ..

సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ :  నగరంలో ఎంతోకాలంగా అపరిష్కృతంగా ఉన్న టాయిలెట్ల సమస్యకు శాశ్వత ముగింపు పలకాలని జీహెచ్‌ఎంసీ సంకల్పించింది. పురపాలకశాఖ మంత్రి ఆదేశాలమేరకు వచ్చే కొద్దిరోజుల్లోనే  మూడువేల టాయిలెట్లను అందుబాటులోకి తేవాలని అధికారులు నిర్ణయించారు. ప్రస్తుతం డిజైన్ల తయారీకి చర్యలు తీసుకుంటున్నారు.  నగరంలో ప్రస్తుతం జీహెచ్‌ఎంసీ, సులభ్‌ సంస్థకు సంబంధించిన టాయిలెట్లు సుమారు 400 లోపు ఉన్నాయి. దాదాపు 625చదరపు కిలోమీటర్లమేర విస్తరించి ఉన్న మన నగరానికి ఇవి ఏ మూలకు సరిపోవడంలేదు. గతంలో స్వచ్ఛభారత్‌ కార్యక్రమంలో భాగంగా పెట్రోల్‌ బంకులు, హోటళ్లలోని టాయిలెట్లను ప్రజలకు అందుబాటులోకి తెచ్చినప్పటికీ అవి ఎంతోకాలం ప్రజలకు సేవలు అందించలేదు. ఈ నేపథ్యంలో జీహెచ్‌ఎంసీ బీవోటీ(బిల్డ్‌-ఆపరేట్‌-ట్రాన్స్‌పర్‌) పద్ధతిలో జోన్‌కు 500చొప్పున మూడువేల టాయిలెట్లను నిర్మించాలని లక్ష్యంగా పెట్టుకుంది. పార్కులు, ఖాళీ జాగాలు, ఆట మైదానాలు, కమ్యునిటీ హాళ్లు తదితర జీహెచ్‌ఎంసీ ఆధీనంలో ఉన్న ఖాళీ స్థలాల్లో వీటిని నిర్మించాలని నిర్ణయించారు.


 ప్రజలకు ఉపయుక్తంగా ఉండే ఆధునిక డిజైన్ల రూపకల్పన కోసం జీహెచ్‌ఎంసీ ఏజెన్సీల నుంచి ఆసక్తి వ్యక్తీకరణ టెండర్లు ఆహ్వానించింది. ఫిబ్రవరి 6లోగా డిజైన్లు స్వీకరించి అందులో ఎంపికచేసిన డిజైన్లను జోన్లవారీగా ఖాళీ ప్రాంతాల్లో టాయిలెట్ల నిర్మాణానికి ఉపయోగిస్తారు. యాడ్‌ ఏజెన్సీలు, కాఫీ షాప్‌ల నిర్వాహకులు, మహిళా స్వయం సహాయక సంఘాలు తదితరులు బీవోటీ పద్ధతిలో టాయిలెట్లను నిర్మించి, అక్కడే వారు తమ ఉత్పత్తులను కూడా విక్రయించుకునే వీలు కల్పించాలని నిశ్చయించారు. డిజైన్లు సిద్ధమయ్యాక బీవోటీకి సంబంధించిన విధివిధానాలు ఖరారుచేసి నిర్మాణానికిగాను జోనల్‌ అధికారులకే బాధ్యతలు అప్పగించనున్నట్లు ప్రధాన కార్యాలయంలోని ఉన్నతాధికారులు వెల్లడించారు. సమీప భవిష్యత్తులోనే టాయిలెట్ల సమస్యను తీర్చేందుకు అన్ని చర్యలూ తీసుకుంటున్నట్లు వారు భరోసా వ్యక్తం చేస్తున్నారు. 


logo