శుక్రవారం 03 ఏప్రిల్ 2020
Hyderabad-city - Feb 01, 2020 , 04:35:38

నగరమంతా..స్ట్రీట్‌ వెండింగ్‌ జోన్లు

నగరమంతా..స్ట్రీట్‌ వెండింగ్‌ జోన్లు

హైదర్‌నగర్‌ , జనవరి 31 : వినూత్న కార్యక్రమాల అమలు ద్వారా బల్దియాకు ఆదర్శంగా నిలుస్తున్న శేరిలింగంపల్లి జోన్‌ను మిగిలిన జోన్లూ స్ఫూర్తిగా తీసుకుని ప్రజా సౌకర్య పనులను విస్తృతంగా చేపట్టాలని పురపాలక శాఖ మంత్రి కేటీఆర్‌ అన్నారు. నగర అభివృద్ధికి ఐకాన్‌గా ఉండే పలు అంశాలపై బల్దియాలోని ఆయా జోన్లకు ఇంతకు మునుపు ఇచ్చిన లక్ష్యాలు, పనుల పురోగతిపై శేరిలింగంపల్లి వెస్ట్‌ జోన్‌ కార్యాలయంలో మంత్రి కేటీఆర్‌ సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో పురపాలక శాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీ అరవింద్‌కుమార్‌, బల్దియా కమిషనర్‌ లోకేశ్‌కుమార్‌, సీసీపీ దేవేందర్‌రెడ్డి, ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టర్‌ విశ్వజీత్‌, సీఈలు శ్రీధర్‌, జియావుద్దీన్‌, జోనల్‌ కమిషనర్లు దాసరి హరిచందన, ముషారఫ్‌ అలీ, స్నిగ్థా పట్నాయక్‌, మమత, అశోక్‌బాబు, శ్రీనివాసరెడ్డి పాల్గొన్నారు. శేరిలింగంపల్లి జోన్‌లో అమలు చేస్తున్న ప్లాస్టిక్‌ రీసైకిల్డ్‌ ఫుడ్‌ వెండింగ్‌ జోన్లు, పర్మిబుల్‌ పేవ్‌మెంట్‌ ఫుట్‌పాత్‌లు, ఫుట్‌ ఓవర్‌ బ్రిడ్జిలు, పార్కుల అభివృద్ధి, కూడళ్ల నవీకరణ సహా పలు పనుల పురోగతిపై వెస్ట్‌ జోన్‌ కమిషనర్‌ దాసరి హరిచందన పవర్‌ పాయింట్‌ ప్రెజెంటేషన్‌ ద్వారా మంత్రి కేటీఆర్‌కు వివరించారు.


 ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ప్రజలకు సౌకర్యం కల్పించడమే అందరి ప్రధాన లక్ష్యమని, ఇందుకోసం వినూత్నమైన అభివృద్ధి పనులను విస్తృతంగా చేపట్టాలన్నారు. ప్లాస్టిక్‌ రీసైకిల్డ్‌తో చేసిన ఫుడ్‌ వెండింగ్‌ జోన్‌ల ఏర్పాటులో వెస్ట్‌ జోన్‌ ఆదర్శంగా నిలిచిందని, విధిగా అన్ని జోన్లలో తప్పకుండా వెండింగ్‌ జోన్‌లను అమలు చేయాలని సూచించారు. మెరుగైన రవాణా కోసం ప్రజలకు సౌకర్యవంతమైన రహదారులను అందుబాటులోకి తీసుకురావాలని, ప్రమాద రహితంగా కూడళ్లను నవీకరించాలని కేటీఆర్‌ పేర్కొన్నారు. వెసులుబాటు ఉన్న చోట ఫుట్‌ ఓవర్‌ వంతెనల నిర్మాణాన్ని చేపట్టాలన్నారు. అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించడం ద్వారా వినూత్న ఆలోచనలతో ముందుకు రావాలని, ఆయా జోన్లలో అభివృద్ధి చేయాల్సిన పనులలో వేగం పెంచాలని, త్వరలో వాటి పురోగతిపై తిరిగి సమీక్ష నిర్వహిస్తానని మంత్రి కేటీఆర్‌ ఆన్నారు. వెస్ట్‌ జోన్‌లోని దుర్గం చెరువుపై చేపడుతున్న ప్రాజెక్టు అత్యంత ప్రతిష్టాత్మకమైనదన్నారు. విభిన్న ఆలోచనలతో ఆదర్శవంతమైన పనులను ఆచరణలో పెడుతున్న జోనల్‌ కమిషనర్‌ దాసరి హరిచందనను మంత్రి కేటీఆర్‌ అభినందించారు. మిగిలిన చోట్లా ఇదే తరహాలో పనులను ముమ్మరంగా చేపట్టాలని ఆయన ఆకాంక్షించారు.


logo