మంగళవారం 31 మార్చి 2020
Hyderabad-city - Jan 31, 2020 , 00:41:34

రాళ్లు పిండవుతాయి.. మేకులు బ్రేకవుతాయి

రాళ్లు పిండవుతాయి.. మేకులు బ్రేకవుతాయి

కాచిగూడ: కాచిగూడ, బర్కత్‌పుర ప్రాంతానికి చెందిన 14 ఏండ్ల చిచ్చరపిడుగు అమృతారెడ్డి కరాటేలో అత్యంత ప్రతిభ కనబరుస్తోంది. 9వతరగతి చదువుతున్న అమృత ఇటు చదువులోనూ, అటు కరాటేలోనూ, ఎన్‌సీసీలోను రాణిస్తుంది. 2019 మే 31న  రెండు నిమిషాల 58 సెకన్లలో 1826 ఇనుప మేకులపై పడుకొని 61 గ్రానైట్‌ రాళ్లను తన పొట్టపై పగులగొట్టించుకుంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడి మూడుఏండ్లు అయిన సందర్భంగా 36 గ్రానైట్‌ రాళ్లు, 1096 ఇనుప మేకులపై పడుకొని బ్రేక్‌ చేసి తన అద్భుత విన్యాసంతో వండర్‌ బుక్‌ ఆఫ్‌ రికార్డ్సులో స్థానం సంపాదించుకుంది. 2015లో 365 పెంకులను తన తలపై 360 సెకన్లలో పగులగొట్టించుకుంది. ఆమె ధైర్యానికి ఆ ప్రదర్శన చూస్తున్న ప్రేక్షకులు సంభ్రమాశ్చరానికి గురయ్యారు. 


తెలంగాణ అంటే ఈ చిన్నారికి చిన్ననాటి నుంచే అమితమైన ప్రేమ. ఇప్పటికి ప్రతి నిత్యం తెలంగాణ పాటలు, కేసీఆర్‌ ప్రసంగం వినకుండా ఈ చిన్నారి నిద్రపోదు. అబ్బాయిలకు ఏ మాత్రం తీసిపోకుండా ఈ అమ్మాయి కరాటేలో విశేషంగా రాణిస్తుంది రాష్ట్ర మంత్రులు, ప్రముఖులతో శభాష్‌ అనిపించుకుంది. వందలాది అవార్డులు, ప్రశంసలను ఈ అమ్మాయి తన ఖాతాలో వేసుకుంటూనే ఉంది. ఎలాంటి భయం లేకుండా అవలీలగా కరాటేలో ప్రదర్శనలిస్తూ తనలోని ప్రతిభను చాటుకుంటుంది అమృత. ఈ చిన్నారి తండ్రి జి.ఎస్‌.గోపాల్‌రెడ్డి కరాటే మాస్టర్‌ కావడం విశేషం. తల్లి మాధవి ప్రోత్సాహం, తండ్రి గోపాల్‌రెడ్డి స్ఫూర్తితో ఈ చిన్నారి దేశ, విదేశాల్లో సైతం కరాటే ప్రదర్శనలిస్తూ పలు రికార్డులను సొంతం చేసుకుంది. కృషి చేస్తే ఎలాంటి కఠినమైన విద్యలనైనా నేర్చుకోవచ్చని అమృత నిరూపించింది. కరాటేలో కఠినమైన టెక్నిక్‌లను అలవోకగా నేర్చుకుంటుంది.


 ఆహారంపై శ్రద్ధ ..

కరాటే అంటేనే క్రమశిక్షణతో కూడుకున్న విద్య. అమృత వయసున్న అమ్మాయిలు పిజ్జాలు, బర్గర్లు, చాక్లెట్లు తినడానికి సహజంగా ఇష్టపడతారు. కానీ అమృత వాటి జోలికి అసలే వెళ్లదు. చక్కటి ఆహారపు అలవాట్లతో, క్రమశిక్షణతో కరాటేలో మరింత ప్రతిభ కనబర్చేందుకు నిరంతరం సాధన చేస్తుంది. ఇంట్లో వండిన అహార పదార్థాలు మాత్రమే తింటుంది. కానీ  జంక్‌ ఫుడ్‌కు ఈ కరాటే చిన్నారి ఆమడదూరం ఉంటుంది. 


కరాటే నా పంచప్రాణం...

కరాటే అంటే కండ్లు, చేతులు కదిలించడమే కాదు, ఈ రెండింటిని సమన్వయం చేసుకుని అద్భుతమైన విన్యాసాలు చేయడమని అమృత పేర్కొంది. ప్రతిఒక్కరికీ ఆత్మరక్షణ కోసం ఈ కరాటే విద్య తప్పనిసరి. తోటి స్నేహితులు నా విజయాలను చూస్తూ మురిసిపోవడం నాకెంతో ప్రోత్సాహంగా ఉంటుంది. అమ్మా, నాన్నలు నిరంతరం సహకరిస్తూ కరాటే పోటీల్లో పాల్గొనేందుకు ఎక్కడికైనా పోవడానికి అన్నివిధాలుగా సహకరిస్తారు. నా ఆరోగ్యం, విద్యపై,కరాటేపై తల్లిదండ్రుల ప్రోత్సాహం ఎంతగానో ఉందని అమృత తెలిపింది. కరాటేనే తన ప్రాణమని, భవిష్యత్తులో జాతీయ స్థాయిలో మరిన్ని విజయాలు సాధించి, ”ఐపీఎస్‌ అధికారి” అయి... తెలంగాణ రాష్ర్టానికి మంచి పేరు తీసుకువస్తానని చిన్నారి అమృతారెడ్డి ధీమా వ్యక్తం చేసింది. 


logo
>>>>>>